వైఎస్‌ హయాంలోనే అక్రమ మైనింగ్‌కు బీజం

ప్రధానాంశాలు

వైఎస్‌ హయాంలోనే అక్రమ మైనింగ్‌కు బీజం

జగన్‌ సీఎం అయ్యాక అటవీ భూముల్ని రెవెన్యూ భూములుగా మార్చారు

తెదేపా జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరాం

ఈనాడు, అమరావతి: వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కొండపల్లి అటవీ ప్రాంతంలో అక్రమ మైనింగ్‌కు బీజం పడిందని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం ధ్వజమెత్తారు. హైకోర్టు తీర్పు మేరకు తెదేపా హయాంలో వాటి లీజులు రద్దుచేయగా.. జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయ్యాకే అటవీ భూముల్ని రెవెన్యూ భూములుగా మార్చారన్నారు. తెదేపా జాతీయ కార్యాలయంలో ఆదివారం విలేకర్లతో మాట్లాడుతూ.. ‘కొండపల్లి రిజర్వ్‌ ఫారెస్ట్‌లో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆధారాలతో ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. స్పందన లేకపోవడంతో మీడియాతో కలిసి ఆ ప్రాంతానికి వెళ్లారు. ఈ సమయంలోనే మైలవరం వీరప్పన్‌ అయిన వసంత కృష్ణప్రసాద్‌ రౌడీమూకలు ఆయనపై హత్యాయత్నం చేశాయి’ అని ఆరోపించారు. ఈ సందర్భంగా మైనింగ్‌కు సంబంధించిన అంశాలను వెల్లడించారు.

* కొండపల్లి ప్రాంతంలో సర్వే నంబరు 143 గతంలో దస్త్రాల్లోనే లేదు. కలంతో రాసి సృష్టించి దానికింద 216.25 ఎకరాలు చేర్చారు. ఈ విషయాన్ని 2016లో హైకోర్టు తన తీర్పులో చెప్పింది. దీనిపై చర్యలు తీసుకోవాలనే హైకోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబు  సీఎంగా ఉన్నప్పుడు 2017 ఫిబ్రవరి 3న అక్కడి మైనింగ్‌ అనుమతుల్ని రద్దుచేశారు. రాజశేఖరరెడ్డి హయాంలోనే.. తమ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన సుదర్శన్‌రావు అనే వ్యక్తికి సహకరించేందుకు దస్త్రాల్ని ట్యాంపర్‌ చేశారు. 2014-2019 మధ్య ఎవరికీ లీజులు ఇవ్వలేదు. ఒకరిద్దరికి ఉంటే.. అవి రాజశేఖరరెడ్డి, కాంగ్రెస్‌ ప్రభుత్వాల హయాంలో ఇచ్చినవే.

* అటవీ ప్రాంతంలో మైనింగ్‌ నిబంధనలు పాటించలేదని 1996 డిసెంబరు 12న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు సర్వే నంబరు 26/2లో లీజుల్నీ అప్పటి తెదేపా ప్రభుత్వం రద్దుచేసింది.

* జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాకే.. సర్వే నంబరు 143, 26/2లోని భూముల్ని రెవెన్యూ భూములుగా మారుస్తూ 2019 అక్టోబరు 17న ఉత్తర్వులు వెలువడ్డాయి. తర్వాత అక్కడ తవ్వకాలను వసంత కృష్ణప్రసాద్‌ ప్రారంభించారు.

* 2020 ఆగస్టులో అప్పటి కలెక్టర్‌.. అవి అటవీభూములే అని తిరిగి తేల్చారు. దీనిపై అప్పటి రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి ఉషారాణి పేరుతో 2020 డిసెంబరు 28న స్టే ఉత్తర్వులు తెచ్చారు. ఇది నిజం కాదా? అక్కడ అక్రమ మైనింగ్‌ జరగకపోతే గ్రావెల్‌ తరలిస్తున్న వాహనాలను అటవీ సిబ్బంది ఎందుకు సీజ్‌ చేశారు? ఆరుగురు సిబ్బందిని ఎందుకు సస్పెండ్‌ చేశారు? డీఎఫ్‌ఓ మంగమ్మను ఎందుకు బదిలీ చేయించారు? ఏమీ జరగకుండానే రూ.10లక్షల జరిమానా చెల్లించారా? ఇవన్నీ ఎవరి ఒత్తిడితో జరిగాయో కృష్ణప్రసాద్‌కు తెలియదా?

* దేవినేని ఉమామహేశ్వరరావు కొండపల్లి అటవీప్రాంతంలో అక్రమ మైనింగ్‌ ప్రాంతాన్ని పరిశీలించడానికి వెళ్లారని ఎఫ్‌ఐఆర్‌లో ఎస్‌ఐ రాశారు. అంటే అది అక్రమ మైనింగ్‌ ప్రాంతమని పోలీసులే చెప్పారు కదా? వీటిపై మైలవరం వీరప్పన్‌ ఏం చెబుతారు?


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని