విధ్వంసక పాలన చూసి పారిశ్రామికవేత్తలు పరార్‌

ప్రధానాంశాలు

విధ్వంసక పాలన చూసి పారిశ్రామికవేత్తలు పరార్‌

తెలంగాణకు రూ.8,617 కోట్ల ఎఫ్‌డీఐలు

ఆంధ్రప్రదేశ్‌కు వచ్చింది రూ.638 కోట్లే

శాసనమండలిలో ప్రతిపక్ష నేత యనమల ధ్వజం

ఈనాడు, అమరావతి: వైకాపా ప్రభుత్వ అసమర్థత, అవినీతి వల్ల మూలధన వ్యయం అడుగంటి, పారిశ్రామిక పెట్టుబడులు క్షీణించి, ఆర్థికరంగం స్తంభించిందని శాసనమండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. ప్రభుత్వ విధ్వంసక పాలన చూసి పారిశ్రామికవేత్తలు పరారవుతున్నారని ఆయన బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2020 ఏప్రిల్‌ నుంచి 2021 ఏప్రిల్‌ వరకు తెలంగాణకు రూ.8,617.71 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) వస్తే, ఏపీకి రూ.638.72 కోట్లే వచ్చాయన్నారు. ‘ఇదే జగన్‌ ప్రభుత్వ విధ్వంసానికి ప్రత్యక్ష సాక్ష్యం. ఎఫ్‌డీఐల్ని ఆకర్షించడంలో దక్షిణాదిలో అట్టడుగుకి, జాతీయస్థాయిలో 15వ స్థానానికి ఏపీ పతనమైంది. తెలంగాణలో నిరుద్యోగిత రేటు 4.7% ఉంటే, ఆంధ్రప్రదేశ్‌లో 6.5% ఉన్నట్టు ప్రభుత్వలెక్కలే చెబుతున్నాయి. సహజ సంపదను జె-గ్యాంగ్‌ నిలువుదోపిడీ చేయడంతో ఖజానాకు చిల్లు పడింది. రాష్ట్రాభివృద్ధికి చిల్లిగవ్వ లేకుండాపోయింది’ అని యనమల దుయ్యబట్టారు. పేదల సంక్షేమానికి పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తున్నట్టు చెప్పడం తప్ప చేసిందేమీ లేకపోవడం వల్లే, ఆర్థిక అసమానతలు పెరిగి పేదరికం ప్రబలిందని ఆయన విమర్శించారు.

కొవిడ్‌ కారణమైతే... వాటికి పెట్టుబడులు ఎలా వచ్చాయి?

‘రాష్ట్ర ఆర్థిక పతనానికి కొవిడ్‌ కారణమని జగన్‌ ప్రభుత్వం అబద్ధాలు చెబుతోంది. కొవిడ్‌తో తీవ్రంగా ప్రభావితమైన మహారాష్ట్ర, కర్ణాటక, దిల్లీ, తమిళనాడులకు భారీగా ఎఫ్‌డీఐలు వచ్చాయి. పారిశ్రామిక మౌలిక వసతుల కల్పనలో, నూతన ఆవిష్కరణలు, ప్రోత్సాహకాల్లో ఏపీ 13వ స్థానానికి వెళ్లిపోయింది. గ్రాస్‌ఫిక్స్‌డ్‌ కేపిటల్‌ ఫార్మేషన్‌ (జీఎఫ్‌సీఎఫ్‌)పై జగన్‌ ప్రభుత్వం దృష్టిపెట్టలేదు. తెదేపా ప్రభుత్వం మూడు పారిశ్రామిక సదస్సుల్లో ఆకర్షించిన రూ.16లక్షల కోట్ల పెట్టుబడులు, 30లక్షల మంది యువతకు ఉద్యోగాల ప్రతిపాదనలను బుట్టదాఖలు చేసింది’ అని యనమల మండిపడ్డారు.

బకాయిల చెల్లింపునకే 23% పోతోంది

2020-21 బడ్జెట్‌లో వడ్డీతో కలిపి తిరిగి చెల్లించాల్సిన బకాయిల మొత్తం 23%కు చేరుకోగా, మూలధన వ్యయం 8% మాత్రమే ఉండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఈ రెండేళ్లలో బడ్జెటేతర రుణమే సుమారు రూ.1,68,000 కోట్లు ఉందన్నారు. పాత బకాయిలు, రెండేళ్లలో చేసిన బడ్జెటేతర అప్పులు మొత్తం కలిపితే... రాష్ట్ర రుణభారం సుమారు రూ.5,08,000 కోట్లకు చేరిందని యనమల పేర్కొన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని