సైదాబాద్‌ ఘటనపై సీఎం స్పందించే వరకు దీక్ష: షర్మిల

ప్రధానాంశాలు

సైదాబాద్‌ ఘటనపై సీఎం స్పందించే వరకు దీక్ష: షర్మిల

ఐఎస్‌ సదన్‌, న్యూస్‌టుడే: సైదాబాద్‌ పరిధిలో ఆరేళ్ల బాలిక హత్యాచార ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పందించే వరకు నిరాహార దీక్ష కొనసాగిస్తానని వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రకటించారు. బుధవారం బాలిక కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం సమీపంలో ఆమె దీక్షకు కూర్చున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఘటన జరిగి ఇన్ని రోజులైనా నిందితుడిని పట్టుకోకపోవడం దారుణమన్నారు. ఫామ్‌హౌస్‌ నుంచి పాలన సాగించే సీఎం ఉప ఎన్నికలు ఉంటేనే బయటకొస్తారని విమర్శించారు. రాష్ట్రంలోని గిరిజనుల మాన, ప్రాణాలంటే ముఖ్యమంత్రికి లెక్కలేదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వమే విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు పెంచి.. ఇలాంటి ఘటనలకు కారణమవుతోందని షర్మిల ఆరోపించారు. నిందితుడిని అరెస్టు చేసి.. కఠిన శిక్ష పడేలా చూడాలన్నారు. బాధిత కుటుంబానికి రూ.10 కోట్ల పరిహారం ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. మంత్రి కేటీఆర్‌ దత్తత ప్రాంతమే ఇలా ఉంటే.. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల పరిస్థితేంటని ప్రశ్నించారు. లాఠీఛార్జి చేసి మరీ చిన్నారి మృతదేహాన్ని తీసుకెళ్లిన పోలీసులు.. ఇంతవరకు పోస్టుమార్టం నివేదిక ఎందుకు ఇవ్వలేదన్నారు. వైఎస్‌ విజయమ్మ.. షర్మిల దీక్ష చేస్తున్న ప్రాంతానికి వచ్చి సంఘీభావం ప్రకటించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని