‘తితిదే పాలకమండలి’ని రద్దు చేయాలి

ప్రధానాంశాలు

‘తితిదే పాలకమండలి’ని రద్దు చేయాలి

గవర్నర్‌కు భాజపా వినతిపత్రం

 నడ్డా లేఖ ఇస్తేనే పార్టీ ఇచ్చినట్లు: సోమువీర్రాజు

ఈనాడు-అమరావతి, విజయవాడ, న్యూస్‌టుడే: తిరుమల-తిరుపతి దేవస్థానం జంబో పాలకమండలి బోర్డు ఏర్పాటులో భాగంగా నియమించిన 52 మంది ప్రత్యేక ఆహ్వానితుల జాబితాను రద్దు చేయాలని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను భాజపా రాష్ట్ర శాఖ కోరింది. నూతన పాలకమండలి సభ్యులు, ఆహ్వానితుల జాబితాపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేసింది. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరణ కోరాలని విజ్ఞప్తి చేసింది. రాజకీయ ప్రయోజనాల కోసమే పాలకమండలిని ఎక్కువ మందితో ఏర్పాటు చేశారని పేర్కొంది. ఈ జంబో పాలకమండలి ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పేర్కొంది. ఈ మేరకు విజయవాడలో గవర్నర్‌కి సోమవారం వినతిపత్రాన్ని అందచేసింది. అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు విలేకర్లతో మాట్లాడారు. పలువురు నేరస్తుల పేర్లు జాబితాలో ఉండడాన్ని భాజపా సహించదన్నారు. ‘ఈరోజు గవర్నర్‌ను కలవటం ఓ ఆలోచన మాత్రమే. ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై రాష్ట్ర శాఖ ఆలోచిస్తోంది. ప్రత్యేక ఆహ్వానితులకు కూడా బోర్డు సభ్యులతో సమానమైన ఏర్పాట్లు చేయడంవల్ల భక్తులకు అసౌకర్యం కలుగుతుంది. ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ తరచూ హిందువుల మనోభావాలు దెబ్బతినేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు’ అని మండిపడ్డారు. ‘పార్టీ అధిష్ఠానవర్గం తరపున నడ్డా లేఖ ఇస్తేనే (బోర్డు సభ్యుల నియామకానికి సంబంధించి) పార్టీపరంగా ఇచ్చినట్లు అవుతుంది. మిగిలిన వారిలో ఎవరూ లేఖ రాసినా భాజపాకు సంబంధంలేదు’ అని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

ప్రత్యేక ఆహ్వానితుల నియామకంపై హైకోర్టులో వ్యాజ్యాలు

ఈనాడు, అమరావతి: తితిదే పాలక మండలి సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితుల నియామకాన్ని సవాలు చేస్తూ సోమవారం హైకోర్టులో మూడు ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలు అయ్యాయి. భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి జి.భానుప్రకాశ్‌రెడ్డి మొత్తం 80 మంది నియామకానికి సంబంధించిన మూడు జీవోలను సవాలు చేశారు. హిందూ జన శక్తి సంక్షేమ సంఘం వ్యవస్థాపకుడు కాకుమాను లలిత్‌కుమార్‌, అనంతపురం జిల్లా కల్యాణదుర్గంకు చెందిన ఎం.ఉమామహేశ్వరనాయుడు కూడా వేరువేరుగా వ్యాజ్యాలు వేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి, తితిదే ఈవోలను వ్యాజ్యంలో ప్రతివాదులగా చేర్చాలని కోరారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని