రూ.25 కోట్లు కొట్టేసే ఎత్తుగడ

ప్రధానాంశాలు

రూ.25 కోట్లు కొట్టేసే ఎత్తుగడ

సొంత పార్టీ ప్రజాప్రతినిధిపై వైకాపా ఎమ్మెల్యే రాజా ధ్వజం

వి.ఎల్‌.పురం (రాజమహేంద్రవరం), న్యూస్‌టుడే: తమ పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి పురుషోత్తపట్నం రైతులకు లేనిపోని ఆశలు కల్పించి రూ.25 కోట్ల అవినీతికి పాల్పడేందుకు ప్రయత్నిస్తున్నారని తూర్పుగోదావరి జిల్లా రాజానగరం వైకాపా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆరోపించారు. వారికి రూ.50-60 లక్షల చొప్పున పరిహారం ఇప్పిస్తామని చెప్పి ఎకరానికి రూ.25 లక్షల చొప్పున తీసుకునేలా ఒప్పందం చేసుకున్నారని విమర్శించారు. సోమవారం ఆయన రాజమహేంద్రవరంలో విలేకరులతో మాట్లాడారు. ఇళ్ల స్థలాల కోసం ముంపు భూముల సేకరణకు ఇలాగే ఒప్పందాలు చేసుకున్న విషయాన్ని సీఎం, అధికారుల దృష్టికి తీసుకెళ్లింది తానేనని రాజా వివరించారు. రౌడీషీటర్లు, భూకబ్జాదారులతోపాటు పలు కేసులతో సంబంధమున్న వారిని వెంట పెట్టుకొని ఆ ప్రజాప్రతినిధి అలజడి సృష్టిస్తున్నారని ఆరోపించారు. రైతులతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు, ఆందోళనలు చేస్తున్న ఓ ప్రభుత్వ అధ్యాపకుడిని కృష్ణా జిల్లాకు బదిలీ చేస్తే ఆయనకు వత్తాసు పలకడమేమిటని ప్రశ్నించారు. తెదేపా, జనసేన నాయకులతోనూ కుమ్మక్కై తనపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సీఎం జగన్‌పై కేసులు బనాయించిన విశ్రాంత సీబీఐ జేడీ లక్ష్మీనారాయణతో కలిసి ఆయన ఎలా ఫొటోలు తీయించుకున్నారని ప్రశ్నించారు. సీఎం జగన్‌తోపాటు పార్టీకి నష్టం కల్గించేలా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. కొవిడ్‌ సమయంలో జక్కంపూడి ఫౌండేషన్‌ ద్వారా తాము రూ.15 కోట్లు వసూలు చేసినట్లు ఆరోపించిన తెదేపా మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేశ్‌ ఆ సొమ్ము ఎక్కడెక్కడ వసూలు చేశామనేది నిరూపించాలని రాజా  డిమాండ్‌ చేశారు. లేదంటే రూ.15 కోట్లకు తాను పరువునష్టం దావా వేస్తానన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని