ఆ కాన్వాయ్‌ చూస్తే మాట్లాడటానికి వెళ్లినట్లుందా?

ప్రధానాంశాలు

ఆ కాన్వాయ్‌ చూస్తే మాట్లాడటానికి వెళ్లినట్లుందా?

 చంద్రబాబు ఇంటిపై దాడిని పోలీసులు సమర్థించడం దారుణం: తెదేపా నేతలు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ప్రతిపక్షనేత చంద్రబాబు ఇంటిపై దాడి జరిగితే పోలీసుశాఖ దాన్ని సమర్థించడం దారుణమని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మండిపడ్డారు. వైకాపా ఎమ్మెల్యే జోగి రమేశ్‌ కాన్వాయ్‌ని చూస్తే ఆయన మాట్లాడటానికి వెళ్లినట్లుందా? అని ప్రశ్నించారు. మంగళగిరిలో ఆయన మంగళవారం విలేకర్లతో మాట్లాడారు. ‘గుంటూరు రేంజి డీఐజీ త్రివిక్రమవర్మ, అర్బన్‌, రూరల్‌ ఎస్పీలతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశం హాస్యాస్పదం. జోగి రమేష్‌ దండయాత్రపై సమాచారం లేదని పోలీసులు చెప్పడం అసత్యం. ఎన్‌ఎస్‌జీ భద్రతలో ఉన్న వీఐపీని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత డీజీపీకి లేదా?’ అని ప్రశ్నించారు.

చాలా తాపత్రయం: ఆనందబాబు

గుంటూరు (పట్టాభిపురం), న్యూస్‌టుడే: ‘చంద్రబాబు ఇంటిపై దాడి జరిగితే.. అది దాడి కాదని చిత్రీకరించడానికి జిల్లా పోలీసు ఉన్నతాధికారులు చాలా తాపత్రయపడ్డారు’ అని మాజీ మంత్రి, తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు ధ్వజమెత్తారు. తెదేపా కార్యాలయంలో మంగళవారం విలేకర్లతో మాట్లాడుతూ ‘మేము డీజీపీ కార్యాలయానికి వెళ్తే.. ఏఎస్‌ఐతో ఫిర్యాదు ఇప్పించి మాపై తప్పుడు కేసులు పెట్టించారు. మీ విధానాలు తొందర్లోనే నాశనమవుతాయి’ అని హెచ్చరించారు. గుంటూరు పార్లమెంటు తెదేపా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌ మాట్లాడుతూ చంద్రబాబు ఇంటిపై దాడి చేసేందుకు జోగి రమేష్‌ అనుచరులతో వెళ్తే.. వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లినట్లు పోలీసులకు కనిపించడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. వినతిపత్రం ఇచ్చేందుకు 200 మందితో వైకాపా జెండాకర్రలు తీసుకుని వెళ్తారా.. అని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ మాట్లాడుతూ చంద్రబాబు భద్రతాధికారి పోలీసులకు ముందే చెప్పినా స్పందించలేదంటే.. ఈ కుట్ర వెనుక సీఎం జగన్‌ పాత్ర ఉందని ఆరోపించారు. మాజీమంత్రి మాకినేని పెదరత్తయ్య, జాతీయ అధికార ప్రతినిధి మహమ్మద్‌ నసీర్‌లు మాట్లాడుతూ పోలీసులు శాంతి, భద్రతలను గాలికి వదిలేసి వైకాపా నేతలు చెప్పినట్లు నడుచుకునే పనిలో నిమగ్నమయ్యారన్నారు.

చంద్రబాబు ఇంటిపై దాడిలో వాస్తవాలను గుంటూరు రేంజి పోలీసు అధికారులు వెల్లడించాలని మాజీ ఎమ్మెల్సీ, తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న డిమాండ్‌ చేశారు. జోగి రమేష్‌ ఒక రోజు ముందుగానే చంద్రబాబు ఇంటికి వెళ్తానన్నా నియంత్రించకపోవడం శాంతిభద్రతల వైఫల్యమేనని విమర్శించారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని