ప్రజా సమస్యలను ప్రస్తావించడమే తప్పా?: ఎమ్మెల్యే రామానాయుడు

ప్రధానాంశాలు

ప్రజా సమస్యలను ప్రస్తావించడమే తప్పా?: ఎమ్మెల్యే రామానాయుడు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ప్రజా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించడమే తాము చేసిన తప్పా? అని తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. శాసనసభను తప్పుదోవ పట్టించామని తనపై, అచ్చెన్నాయుడిపై చర్యలు తీసుకోవడానికి శాసనసభకు సిఫారసు చేస్తున్నామని ప్రివిలేజ్‌ కమిటీ పేర్కొనడం దారుణమని మండిపడ్డారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ‘నాకు, అచ్చెన్నాయుడికి రెండేళ్లపాటు మైక్‌ ఇవ్వకూడదనే నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. మేము అసెంబ్లీలో ఎప్పుడూ అసత్యాలు మాట్లాడలేదు. ఆనాడు అసెంబ్లీలో గంటన్నరసేపు అధికారపక్షం మాట్లాడాక.. మాకు అవకాశం ఇచ్చాకే మాట్లాడాం. నగదు బదిలీపై స్వల్పకాలిక చర్చలో ఐదారు నిమిషాలే మాట్లాడా. సీఎంగా జగన్‌ ప్రమాణస్వీకారం చేసినప్పుడు వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు రూ.3వేల పింఛను ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. ఇది మోసం చేయడమేనని మాట్లాడాను. కాపు కార్పొరేషన్‌కు ఏడాదికి రూ.2వేల కోట్లు ఇస్తామని చెప్పారు. ఆ లెక్కన ఐదేళ్లకు రూ.10వేల కోట్లు ఇవ్వాల్సి ఉందని, ఇవ్వడం లేదని మాట్లాడుతుండగానే మైక్‌ కట్‌ చేశారు. ఇలా విపక్షాల గొంతునొక్కే చర్యలను ఆపాలి’ అని సూచించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని