మాపై పెట్టిన ఎస్సీ, ఎస్టీ కేసును కొట్టేయండి

ప్రధానాంశాలు

మాపై పెట్టిన ఎస్సీ, ఎస్టీ కేసును కొట్టేయండి

హైకోర్టును ఆశ్రయించిన తెదేపా నేతలు 

ఈనాడు, అమరావతి: తాడేపల్లి పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసుతో పాటు, ఐపీసీ సెక్షన్ల కింద నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలని కోరుతూ తెదేపా నేతలు 11 మంది హైకోర్టులో పిటిషన్‌ వేశారు. తెదేపా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు, అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌, జంగాల సాంబశివరావు, నాగుల్‌మీరా, నాదెళ్ల బ్రహ్మయ్య, సుంకర విష్ణుకుమార్‌, తదితరులు ఈ వ్యాజ్యం దాఖలు చేసిన వారిలో ఉన్నారు. ఎఫ్‌ఐఆర్‌ 922/2021 ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోకుండా పోలీసులను నిలువరించాలని కోరారు. పెడన వైకాపా శాసనసభ్యుడు జోగి రమేశ్‌, తన అనుచరులతో చంద్రబాబు ఇంటిపై దాడికి యత్నించిన ఘటనలో పరస్పర దాడులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఎమ్మెల్యే జోగి రమేశ్‌ కారు డ్రైవర్‌ తాండ్ర రాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాడేపల్లి పోలీసులు తెదేపా నేతలపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ‘ఫిర్యాదిదారు రామును తాము ఎప్పుడూ చూడలేదు. ఏ సామాజికవర్గానికి చెందిన వారో మాకు తెలీదు. అలాంటిది మాపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు సరి కాదు. ప్రతిపక్ష నేతలపై పోలీసులు తప్పుడు కేసు నమోదు చేస్తున్నారని చెప్పడానికి ఇది మంచి ఉదాహరణ. వాస్తవానికి ఫిర్యాదిదారు, మరికొందరు జోగి రమేశ్‌ నేతృత్వంలో చంద్రబాబు ఇంటిపై దాడికి యత్నించారు. ఈ ఘటనలో బాధితులుగా మారింది మేము. పోలీసులు మాపై తప్పుడు కేసు నమోదు చేశారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని మాపై నమోదు చేసిన కేసును కొట్టేయండి..’ అని వారు ఆ వ్యాజ్యంలో కోరారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని