పోలవరం నిర్వాసితులకు పరిహారం చెల్లింపులో అక్రమాలు

ప్రధానాంశాలు

పోలవరం నిర్వాసితులకు పరిహారం చెల్లింపులో అక్రమాలు

సీవీసీకి లోకేశ్‌ ఫిర్యాదు

ఈనాడు, ఈనాడు డిజిటల్‌, అమరావతి: పోలవరం నిర్వాసితుల పరిహారాన్ని వైకాపా నేతలు దొడ్డిదారిన కాజేస్తున్నారని కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ (సీవీసీ)కు తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ శుక్రవారం ఫిర్యాదు చేశారు. నిర్వాసితులకు సహాయ, పునరావాస ప్యాకేజీ అమల్లో భారీ కుంభకోణం జరుగుతోందని ఆరోపించారు. అధికార పార్టీ నాయకులతో గ్రామ రెవెన్యూ అధికారులు కుమ్మక్కై అక్రమాలకు తెరతీశారని విమర్శించారు. దీనిపై  విచారించి చర్యలు తీసుకోవాలని లేఖలో విన్నవించారు. ఈ అంశానికి సంబంధించి సమాచారహక్కు చట్టం ద్వారా పొందిన సమాచారాన్ని లేఖకు జత చేశారు. ‘ప్రతి ఆదివాసి కుటుంబానికి మెరుగైన సహాయ, పునరావాస ప్యాకేజీ ఉన్నప్పటికీ అసలైన నిర్వాసితులకు చేరడం లేదు. నకిలీ డీఫాం పట్టాలు, ధ్రువపత్రాలతో కాజేస్తున్నారు’ అని లేఖలో పేర్కొన్నారు. నిర్వాసిత గిరిజనులు వివక్షకు గురవుతున్నారని, ఈ అంశాన్ని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చినా ఇప్పటివరకు చర్యలు చేపట్టలేదని తెలిపారు. ఒక్క కె.కొత్తగూడెం గ్రామంలోనే 12 మంది నకిలీ డీఫాం పట్టాలతో రూ.3.17 కోట్ల పరిహారం కాజేశారని, ఒక్కొక్కరు రూ.10లక్షల నుంచి రూ.52లక్షల వరకు పరిహారం పొందారని తెలిపారు.

బయటపడ్డ ఏపీపీఎస్సీ అక్రమాలు

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 నియామకాల్లో అర్హత సాధించని ఆరుగురు అభ్యర్థులు సివిల్స్‌లో దేశంలో అత్యుత్తమ ర్యాంకులు సాధించారని, తాజా ఫలితాలతో దాని అక్రమాలు నిర్ధారణ అయ్యాయని నారా లోకేశ్‌ ఆరోపించారు. సివిల్స్‌ ఫలితాలతో సీఎం జగన్‌ ధనదాహం వెలుగుచూసిందని ప్రకటనలో విమర్శించారు. ‘గ్రూప్‌-1లో జగన్‌ అక్రమాలకు బలైన సంజనాసింహాకు 207వ ర్యాంకు, బయ్యపురెడ్డి చైతన్యకు 604, యశ్వంత్‌కుమార్‌రెడ్డికి 93, సాహిత్యకు 647, జగత్‌సాయికి 32, వసంత్‌కుమార్‌కు 170వ ర్యాంకు వచ్చింది. ఈ ఆరుగురు గ్రూప్‌-1 నియామకాల్లో మాకు అన్యాయం జరిగిందని, డిజిటల్‌ మూల్యాంకనం పేరుతో కావాల్సిన వారికి వైకాపా నేతలు ఉద్యోగాలు అమ్ముకున్నారని న్యాయస్థానంలో కేసు వేసినవారే. ఇప్పుడు వీరికే సివిల్స్‌ ర్యాంకులు రావడంతో జగన్‌ బృందం అక్రమాలపై చర్చ సాగుతోంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని