ఏపీని వదిలి తెలంగాణకు వచ్చేస్తా

ప్రధానాంశాలు

ఏపీని వదిలి తెలంగాణకు వచ్చేస్తా

ఇక్కడి రాజకీయాలే బాగున్నాయి: జేసీ దివాకర్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: తాను ఆంధ్రప్రదేశ్‌ను వదిలి తెలంగాణకు వచ్చేస్తానని ఆ రాష్ట్ర తెదేపా నేత, మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. ఏపీ రాజకీయాల కంటే ఇక్కడి రాజకీయాలే బాగున్నాయని అన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ శాసనసభకు వచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లతో భేటీ అయ్యారు. అనంతరం సీఎల్పీ కార్యాలయంలో కాంగ్రెస్‌ పార్టీ నేతలు భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డిలను కలిశారు. ఈ సందర్భంగా విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాక ఇప్పటి వరకు కలవలేదని అందుకే ఇప్పుడు కలిసి మాట్లాడానని చెప్పారు.

జగన్‌కు హైదరాబాద్‌ నుంచి లారీల్లో డబ్బులొచ్చాయ్‌: ‘‘నేను 1980లో సమితి అధ్యక్ష పదవి కోసం రూ.10వేలు ఖర్చు చేశా. ఇప్పుడు ఎంపీగా నిలబడితే రూ.50 కోట్లు ఖర్చవుతోంది. జగన్‌కు ఎన్నికలప్పుడు హైదరాబాద్‌ నుంచి కూడా లారీలలో డబ్బులు వచ్చాయి. అధికారంలో లేని వ్యక్తి.. ఒక్కొక్క ఎమ్మెల్యే అభ్యర్థికి రూ.15 కోట్ల నుంచి 20 కోట్లు ఇచ్చారు. ఎంపీ ఎన్నికల్లో ఒక్కొక్కరు రూ.50 కోట్లు ఖర్చు చేశారు. పరిస్థితి ఇలాగే ఉంటే ఏపీలో ఓటు రూ.4 వేల నుంచి రూ.5 వేలకు పోతుంది. ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఫలితాలు నాకు ఎలాంటి ఆశ్చర్యం కలిగించలేదు. జగన్‌ అనుకున్నాడు.. ఆ ఫలితాలు వచ్చాయి అంతే! ఏపీ సీఎం జగన్‌ మొదట్లో.. సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌లను ‘అన్న’ అని పబ్లిక్‌గా పిలిచాడు. ఇలా జగన్‌ తప్ప... ఏ సీఎం పిలవడు. ఆఖరికి అదే సుబ్రహ్మణ్యంను బాపట్ల కాలేజీలో రిజిస్ట్రార్‌గా వేశాడు. ఐఏఎస్‌లకే గ్యారెంటీ లేదు. చీఫ్‌ సెక్రటరీనే తీసి కళాశాలల్లో పాఠాలు చెప్పుకోమన్నాడు. గతంలో చెన్నారెడ్డి మాటల్లో చెబితే... జగన్‌ చేతల్లో చూపిస్తున్నాడు. ఐఏఎస్‌, ఐపీఎస్‌ల పరిస్థితి అధ్వానంగా మారింది’’ అని జేసీ అన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని