27న భారత్‌ బంద్‌ను విజయవంతం చేయాలి

ప్రధానాంశాలు

27న భారత్‌ బంద్‌ను విజయవంతం చేయాలి

 రౌండ్‌టేబుల్‌ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పిలుపు

గుంటూరుసిటీ, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం రైతులు, కార్మికులు, విద్యార్థులు, ఉద్యోగుల హక్కులను హరిస్తోందని.. దేశ సంపదను కార్పొరేట్లకు కట్టబెడుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. భారత్‌ బంద్‌ను జయప్రదం చేయాలని కోరుతూ రాజకీయ, ప్రజా సంఘాల నాయకులతో గుంటూరులోని సీపీఐ కార్యాలయంలో శనివారం రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. రామకృష్ణ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా తెచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని దిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు చేస్తున్న ఉద్యమానికి ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని కోరారు. సంయుక్త కిసాన్‌ మోర్చా ఆధ్వరంలో ఈనెల 27న నిర్వహించనున్న భారత్‌ బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గుంటూరు పార్లమెంటు తెదేపా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌ మాట్లాడుతూ భారత్‌ బంద్‌కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై తెదేపా నిరంతరం పోరాడుతూనే ఉందని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ సైతం బంద్‌కు మద్దతు ఇస్తుందని ఆ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు తెలిపారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి అజయ్‌కుమార్‌, సీపీఎం నేత శ్రీనివాస్‌, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు రాధాకృష్ణమూర్తి, ముస్లింలీగ్‌ నాయకుడు నాగూర్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని