రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందంటే డీజీపీకి ఏంటి బాధ?

ప్రధానాంశాలు

రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందంటే డీజీపీకి ఏంటి బాధ?

ఆయనేమైనా వైకాపా తరపున వకాల్తా పుచ్చుకున్నారా?
తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజం

ఈనాడు, అమరావతి: డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ వైఖరి వింతగా ఉందని, ప్రజలకు రక్షకుడిగాకంటే, ఆయన అధికార పార్టీ రక్షకుడిగానే ఎక్కువగా వ్యవహరిస్తున్నారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. మాదకద్రవ్యాల వ్యవహారంలో తెదేపా నేతల వ్యాఖ్యల వల్ల తన ప్రతిష్ఠకు భంగం కలిగిందంటూ... చంద్రబాబు సహా పలువురికి ఆయన నోటీసులివ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ‘‘జగన్‌ పాలనలో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కు వెళ్లిందని, రాష్ట్రాన్ని మాఫియాకి నిలయంగా మార్చేశారని, దీనిపై డీజీపీ, ముఖ్యమంత్రి ఏం సమాధానం చెబుతారని చంద్రబాబు వ్యాఖ్యానించడం వల్ల తన ప్రతిష్ఠకు భంగం కలిగినట్లు ఆ నోటీసుల్లో సవాంగ్‌ పేర్కొన్నారు. రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కు వెళ్లిందని చంద్రబాబు అంటే... ముఖ్యమంత్రో, మంత్రులో, అధికార పార్టీ ప్రతినిధులో మాట్లాడాలిగానీ సవాంగ్‌ ఎందుకు స్పందిస్తున్నారు? ఆయనేమైనా వైకాపా తరపున వకాల్తా పుచ్చుకున్నారా? లేకపోతే జగన్‌మోహన్‌రెడ్డికి అనుంగు అనుచరుడా? ప్రతిపక్షపార్టీల గొంతు నొక్కాలని డీజీపీ చూస్తున్నారా?’’ అని వర్ల రామయ్య గురువారం జరిగిన విలేఖరుల సమావేశంలో ధ్వజమెత్తారు. ‘‘అసలు రాష్ట్రంలో డ్రగ్స్‌ మాఫియా ఆగడాలు ఉన్నాయనిగానీ, లేవనిగానీ చెప్పడానికి పోలీసులు చేసిన దర్యాప్తేంటో చెప్పాలి. ప్రజలు అడిగితే డీజీపీ ఏం సమాధానం చెబుతారు?  విజయవాడలో సోదాలు జరిపామని, కొన్ని ముఖ్యమైన పత్రాల్ని స్వాధీనం చేసుకున్నామని ఎన్‌ఐఏ చెప్పినా... విజయవాడకు, డ్రగ్స్‌ మాఫియాకి సంబంధం లేదని ఎలా చెబుతారు. ఎవర్ని రక్షించడానికి డీజీపీ అంతగా ఉలిక్కిపడుతున్నారో చెప్పాలి...’ అని పేర్కొన్నారు. తెదేపా అధినేత సహా, ఇతరులకు ఇచ్చిన నోటీసుల్ని వెంటనే వాపస్‌   తీసుకోవాలని, లేకపోతే డీజీపీ కోర్టులో నిలబడాల్సి ఉంటుందని రామయ్య చెప్పారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని