వైకాపా పాలన గాడి తప్పుతోంది

ప్రధానాంశాలు

వైకాపా పాలన గాడి తప్పుతోంది

తాకట్టు పెట్టి అప్పులు తేవడం తప్పు
వచ్చే ఎన్నికల్లో పోటీచేస్తా
మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి

ఈటీవీ, కడప, న్యూస్‌టుడే, మైదుకూరు: ‘రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వ పాలన గాడి తప్పుతోంది ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఎక్కడికి పోతుందో అర్థం కావడం లేదు’ అని కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి, వైకాపా నేత డీఎల్‌ రవీంద్రారెడ్డి పేర్కొన్నారు.  ప్రభుత్వ శాఖలకు మంత్రులుగా ఉన్నవారు ఏం చేస్తున్నారో ఎవరికీ అర్థం కావడం లేదన్నారు. అన్ని శాఖల తరఫున ఒకే నేత భరోసా ఇస్తున్నారని పరోక్షంగా సజ్జలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీలను ప్రభుత్వ పెద్దలు పట్టించుకోవడం లేదు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని వారు కోరడంతో వచ్చే ఎన్నికల్లో మైదుకూరు నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను. ఇంకా రెండేళ్ల సమయం ఉందని, ఎవరైతే ప్రజల కోసం పనిచేస్తారని నమ్మకం ఉంటుందో.. అప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు. కడప జిల్లా ఖాజీపేటలో శనివారం ఆయన ఈనాడు-ఈటీవీ, మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్ర ఆదాయాన్ని, ప్రగతిని, ఆస్తులను తాకట్టు పెట్టి అప్పులు తేవడం చాలా తప్పు. దేనికైనా పరిమితులు ఉంటాయి. కొందరు ఉన్నతస్థాయి వ్యక్తులు ముఖ్యమంత్రిని తప్పుదోవ పట్టిస్తున్నట్లు తెలుస్తోంది. నవరత్నాల పథకం మంచిదని భావించాను. అవి రాష్ట్ర ప్రగతిని దెబ్బతీస్తాయని అనుకోలేదు. ఫీజు రీఎంబర్స్‌మెంట్‌, ఆరోగ్యశ్రీ పథకాలు దారి తప్పాయి. ఈ వ్యవస్థ గాడిన పడాలంటే మరో 25 ఏళ్లు పడుతుందని మేధావులు చెబుతున్నారు. ప్రభుత్వం చెప్పినట్లు ప్రతి చేనేత కుటుంబానికి రూ.50 వేలు ఇస్తామన్న మాట ఉత్తిదే. అందరికీ అందడం లేదు. కొన్ని పథకాల డబ్బులు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి వేస్తుండటం కొంతవరకు మంచిదే. రేషన్‌ బియ్యం దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. రాయలసీమ ఎత్తిపోతల, పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ఆధునికీకరణ, రాజోలి రిజర్వాయర్‌ పనులు ముందుకు కదలడం లేదు. గుత్తేదారులకు డబ్బులిచ్చే పరిస్థితి లేకపోవడమే ఇందుకు కారణం. విద్యుత్తు సంక్షోభం ఎందుకు వచ్చిందో ఆలోచన చేయాలి. ఇంధనశాఖ కార్యదర్శి తెలివి గల వ్యక్తేగానీ... ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. మంత్రులకే సీఎం దర్శనం లేకపోతే... నాలాంటి వ్యక్తికి దొరకడం కష్టం. నేను ఎవరి దగ్గర దేహీ అని అడిగే రకం కాదు..’ అని డీఎల్‌ రవీంద్రారెడ్డి పేర్కొన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని