ఇతర రాష్ట్రాల పోలీసులకు నోటీసులిచ్చే దమ్ముందా?: పట్టాభి

ప్రధానాంశాలు

ఇతర రాష్ట్రాల పోలీసులకు నోటీసులిచ్చే దమ్ముందా?: పట్టాభి

ఈనాడు డిజిటల్, అమరావతి: ఏపీ పోలీసులకు దమ్ముంటే రాష్ట్రంలో మాదక ద్రవ్యాల స్మగ్లర్లపై దాడులు చేస్తున్న తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, యూపీ పోలీసులకు నోటీసులిచ్చి.. ఆ తర్వాత తమ జోలికి రావాలని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ సవాల్‌ విసిరారు. ఆంధ్రప్రదేశ్‌లోకి ఎందుకొచ్చారని ఇతర రాష్ట్రాల పోలీసుల్ని ప్రశ్నించే ధైర్యం ప్రభుత్వానికి, తాడేపల్లి పెద పాలేరుకు ఉందా అని మండిపడ్డారు. తెదేపా కేంద్ర కార్యాలయంలో మంగళవారం పట్టాభి విలేకర్లతో మాట్లాడారు. వైకాపా నేతలే గంజాయి స్మగ్లర్లతో చేతులు కలిపి యథేచ్ఛగా సాగు, రవాణా చేస్తున్నారని వార్తలొచ్చాయని, దానిపై ఆయన ఏం చెబుతారని ప్రశ్నించారు. ధైర్యముంటే ఏపీలో గంజాయి సాగు, మాదకద్రవ్యాల మాఫియా వ్యవహారాన్ని కట్టడి చేయాలన్నారు. పోలీసుశాఖను గుప్పిట్లో పెట్టుకుని తెదేపాను భయపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. తాడేపల్లి దొర... ఆయన చెప్పినట్లు వినే పోలీసులిచ్చే నోటీసులు చిత్తు కాగితాలతో సమానమని, తాటాకు చప్పుళ్లకు భయపడబోమని చెప్పారు. ‘సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు మీడియా సమావేశం నిర్వహిస్తే, ఆయనకు నోటీసులిచ్చేందుకు నర్సీపట్నం పోలీసులు రాత్రి 11 గంటలకల్లా గుంటూరు చేరుకున్నారు. పక్కనే ఉన్న ఏజెన్సీలో గంజాయి సాగవుతుంటే ఇంతే మెరుపువేగంతో వెళ్లి ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు? నోటీసులిచ్చేందుకు ఆగమేఘాల మీద ప్రయాణం చేసినవాళ్లు, వేరే ఏ ఇతర కేసుల్లోనైనా ఇంత మెరుపు వేగంతో పనిచేశారా? తాడేపల్లి పెద పాలేరు చెప్పినట్లుగా ఆడటానికి సిగ్గనిపించట్లేదా. గంజాయి సాగు పట్ల అప్రమత్తంగా ఉండాలంటే నోటీసులిస్తారా?’ అని ధ్వజమెత్తారు. ఈ విలేకరుల సమావేశం అనంతరమే పట్టాభి వ్యాఖ్యలపై వైకాపా శ్రేణుల నిరసనలు వెల్లువెత్తాయి. 

 

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని