తెదేపా నేత బ్రహ్మం చౌదరి ఎక్కడ?

ప్రధానాంశాలు

తెదేపా నేత బ్రహ్మం చౌదరి ఎక్కడ?

డీజీపీకి అచ్చెన్నాయుడి లేఖ

ఈనాడు డిజిటల్‌- అమరావతి: తెదేపా నేత బ్రహ్మం చౌదరి, మరికొందరు మహిళా నేతలను పోలీసులు బుధవారం ఉదయం అరెస్టు చేశారు. అనంతరం మహిళా నేతలను విడుదల చేశారు. బ్రహ్మం చౌదరి ఆచూకీ మాత్రం ఇప్పటివరకూ తెలియడంలేదని, ఆయనను పోలీసులు ఎక్కడికి తీసుకెళ్లారో చెప్పడం లేదని పలువురు తెదేపా నేతలు, వారు కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై డీజీపీకి పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఒక లేఖ రాస్తూ...  బ్రహ్మం చౌదరిని తక్షణమే విడుదల చేయాలని, ఆయనకు ఏం జరిగినా డీజీపీ గౌతం సవాంగ్‌ బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. బుధవారం ఉదయం మంగళగిరికి వెళ్లేందుకు బయలుదేరిన తెదేపా నేత బ్రహ్మం చౌదరి, మరో 10 మంది నేతలను అనుమతి లేదంటూ తాడేపల్లి సీఐ అడ్డుకున్నారు. ఈ సందర్భంగా తీవ్ర వాగ్వాదం జరిగింది. అనంతరం బ్రహ్మంతో పాటు, మరో నేత షేక్‌జానీని వాహనంలో ఎక్కించి మేడికొండూరు పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లారు.  అక్కడ షేక్‌ జానీని అక్కడే విడుదల చేశారు. బ్రహ్మం చౌదరిని మాత్రం కారంపూడికి, విజయపురిసౌత్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారని, ఆ తర్వాత ఎలాంటి సమాచారం లేదని తెదేపా నేతలు వెల్లడించారు. తాడేపల్లి సెంటరులో తమను అదుపులోకి తీసుకునే సందర్భంలో తమపై పోలీసులు అభ్యంతరకరంగా వ్యవహరించారని పలువురు మహిళా నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. అరెస్టైన వారిలో కంభంపాటి శిరీష, రాణి, ఆశ, పాలడుగు వినీల, పాలేటి కృష్ణవేణి, వంశీ, శ్రీనివాస్‌రెడ్డి తదితరులున్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని