చంపుతాం అన్న ఎమ్మెల్యేపైనా కేసు పెట్టరా?

ప్రధానాంశాలు

చంపుతాం అన్న ఎమ్మెల్యేపైనా కేసు పెట్టరా?

 ఈసారి మాజోలికొస్తే తలలు పగులుతాయి: లోకేశ్‌

ఈనాడు, అమరావతి: ‘రాబోయే రోజుల్లో వైకాపావాళ్లు మాపై దాడులు చేస్తూ వాళ్ల తలలు పగులుతాయి. ఇన్నాళ్లూ పోలీసుల్ని, చట్టాన్ని నమ్ముకున్నాం. వారు కాపాడనప్పుడు మమ్మల్ని మేం రక్షించుకోవాలి కదా’ అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ హెచ్చరించారు. ‘అక్కడ కాబట్టి దాడితో సరిపెట్టారని, అదే రాయలసీమలో అయితే చంపేసేవాళ్లమని మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి అన్నారు. ఆ ఎమ్మెల్యేపై ఎందుకు కేసు పెట్టరు? మా వాళ్లను చంపాలన్న ఉద్దేశంతోనే మా కార్యాలయంపై దాడి చేశారని అర్ధమవుతోంది కదా? కానీ వారిపై ఎందుకు హత్యాయత్నం కేసు నమోదు చేయలేదు? మా కార్యాలయంపై దాడి చేయడానికి వచ్చిన ఇన్‌స్పెక్టర్‌కి కాఫీ ఇచ్చి పోలీసులకు అప్పగించినందుకు మాపై హత్యాయత్నం కేసు పెట్టారు. ఇదెక్కడి దారుణం? డీజీపీ నుంచి కానిస్టేబుల్‌ వరకు... ప్రతిపక్ష నాయకుల్ని ఎలా ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనతో ఉండటం వల్లే పోలీస్‌ వ్యవస్థ గాడి తప్పింది. రాష్ట్రం మాదకద్రవ్యాలకు అడ్డాగా మారింది. వైకాపా నాయకులకు గంజాయికి కేజీకి ఇంతని ముట్టడం వల్లే ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్న అనుమానం కలుగుతోంది’ అని ధ్వజమెత్తారు. తనను కూడా రేపో, ఎల్లుండో అరెస్ట్‌ చేస్తారేమోనన్నారు. ప్రజా సమస్యలపై పోరాటంలో జైలుకెళ్లడానికీ తాను సిద్ధమేనన్నారు.గురువారం ఆయన  పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకర్లతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. 

డ్రగ్స్‌పై కేంద్రానికి ఫిర్యాదు చేస్తాం: ‘మాదకద్రవ్యాలకు ఆంధ్రప్రదేశ్‌ అడ్డాగా మారడం, ప్రభుత్వమే ప్రోత్సహించడంపై రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోం మంత్రులను కలసి వినతిపత్రం ఇస్తాం. డ్రగ్స్‌పై పోరాడుతున్నందుకే మాపై దాడి చేశారన్న విషయాన్ని దేశమంతా తెలిసేలా చేస్తాం’ అని తెలిపారు. దాడి గురించి చంద్రబాబు ఫోన్‌లో వివరించినప్పుడు.. లేఖ రాయమని, పార్టీ కార్యాలయాలకు కేంద్ర బలగాల భద్రత కల్పిస్తామని అమిత్‌షానే చెప్పారని తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని