బూతులను సమర్థిస్తూ చంద్రబాబు దీక్షా?: పేర్ని నాని

ప్రధానాంశాలు

బూతులను సమర్థిస్తూ చంద్రబాబు దీక్షా?: పేర్ని నాని

ఈనాడు, అమరావతి: ‘చంద్రబాబు చేస్తున్న దీక్ష దేనికోసం.. ముఖ్యమంత్రిపై పట్టాభి మాట్లాడిన బూతులను సమర్థిస్తూ ఈ దీక్ష చేస్తున్నారా?’ అని మంత్రి పేర్ని నాని విమర్శించారు. గురువారం ఆయన వైకాపా కేంద్ర కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. ‘తెదేపా హయాంలో ప్రధాని మోదీ రాష్ట్రానికి వస్తే తెదేపా ఆధ్వర్యంలో నిరసనలు చేశారు, అమిత్‌ షా తిరుమలకు వస్తే తెదేపా గూండాలు కారుపై దాడి చేయలేదా? భారతదేశానికి గంజాయి రాజధానిగా ఏపీ మారిందని 2018లోనే జాతీయ పత్రికలు రాశాయి. చంద్రబాబు చేసిన ఆ పాపాలను కడిగేందుకు సీఎం జగన్‌ ఎస్‌ఈబీని ఏర్పాటుచేసి కష్టపడుతున్నారు’ అని వ్యాఖ్యానించారు.


తెదేపా బతికుందని అనిపించుకోవడానికే..: కన్నబాబు

కాకినాడ, న్యూస్‌టుడే: చచ్చిపోతున్న తెదేపాను బతికుందని అనిపించుకోవడానికి చంద్రబాబు కొత్త డ్రామాలకు తెరతీశారని వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు విమర్శించారు. కాకినాడలో ఎమ్మెల్సీ రవీంద్రబాబు, నాయకులతో కలిసి గురువారం జనాగ్రహ దీక్షలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం జగన్‌పై తెదేపా నాయకుడు పట్టాభి పలకడానికీ అవకాశం లేని మాట వాడారని, ఉత్తరభారతంలో ఆ పదం వాడితే నరికేస్తారన్నారు.


రాష్ట్రంలో రాజకీయాలు దిగజారుతున్నాయి: ధర్మాన

అరసవల్లి, న్యూస్‌టుడే: రాష్ట్రంలో రాజకీయాలు దిగజారుతున్నాయని ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళంలో నిర్వహించిన జనాగ్రహ దీక్షలో ఆయన మాట్లాడారు. ‘అధికారం పోయాక తెదేపా నాయకుల మానసిక పరిస్థితి బాగోలేదు. పట్టాభి ముఖ్యమంత్రిని దూషిస్తే, పార్టీనుంచి సస్పెండ్‌ చేయాల్సింది పోయి చంద్రబాబు దీక్ష చేయడం విడ్డూరం’ అన్నారు.


ప్రజలు తిరస్కరించినా బుద్ధి రాలేదు: ధర్మాన కృష్ణదాస్‌

పోలాకి, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి సక్షేమ పథకాలతో ప్రజలను ఆకట్టుకుంటుంటే, దాన్ని చూసి ఓర్వలేని చంద్రబాబు.. సీఎం జగన్‌ని నానా తిట్లు తిట్టించడం జుగుప్సాకరంగా ఉందని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా పోలాకిలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. గత ఎన్నికల్లో ఆయన పాలనను ప్రజలంతా తిరస్కరించినా, ఇంకా చంద్రబాబుకు బుద్ధి రాలేదని విమర్శించారు.


ప్రజాస్వామ్యానికి గ్రహణం చంద్రబాబు: ఎంపీ మాధవ్‌

ఈనాడు, దిల్లీ: ప్రజాస్వామ్యానికి చంద్రబాబు గ్రహణంలా మారారని వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌ విమర్శించారు. ఏపీభవన్‌లో ఆయన జనాగ్రహ దీక్ష చేశారు. తెదేపా నాయకులు దుర్భాషలు మానుకోవాలని, చంద్రబాబు సంయమనం పాటించాలన్నారు.


చంద్రబాబు దీక్ష విడ్డూరం: చంద్రశేఖర్‌రెడ్డి

ఈనాడు డిజిటల్‌, అమరావతి: సీఎం జగన్‌ను తిడితే దానికి క్షమాపణ చెప్పకపోగా దానిని సమర్థిస్తూ చంద్రబాబు దీక్ష చేయడం విడ్డూరంగా ఉందని ఏపీఎన్జీవో రాష్ట్ర మాజీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి విమర్శించారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని