జగన్‌రెడ్డిలో అసహనం మొదలైంది

ప్రధానాంశాలు

జగన్‌రెడ్డిలో అసహనం మొదలైంది

మాజీ మంత్రి కళావెంకట్రావు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్రం జగన్‌రెడ్డి జాగీరు కాదు. చాలా మంది నియంతలను తెదేపా చూసింది. చరిత్రలో ఛీత్కారానికి గురైన వారి జాబితాలోకి జగన్‌ వెళ్లడం ఖాయం. ఆయనలో అసహనం మొదలైంది. అందుకే పులివెందుల రాజకీయాలు చేస్తున్నారు. రాష్ట్రంలో డ్రగ్స్‌ లింకులపై ప్రశ్నించడం మా బాధ్యత. డ్రగ్స్‌ మాఫియాపై మాట్లాడిన పట్టాభిని జైలుకు పంపారు. డ్రగ్స్‌ అమ్మేవారు బహిరంగంగా తిరుగుతున్నారు.


ప్రజల మెప్పు పొందలేకే దాడులు

 మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు

సుపరిపాలన అందించి ప్రజల మెప్పు పొందడం చేతగాకే ప్రతిపక్షాలపై దాడులు చేయిస్తున్నారు. ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెడుతున్నారు. కులాలు, మత రాజకీయాలు చేస్తూ ప్రజల్ని భయభ్రాంతులను చేస్తున్నారు. అధికారం శాశ్వతం కాదని జగన్‌రెడ్డి గుర్తుంచుకోవాలి. జగన్‌రెడ్డికి ఎందుకు ఓటేశామా? అని ప్రజలు పశ్చాత్తాప పడుతున్నారు.


పోలీసుస్టేషన్లకు వైకాపా రంగులేసుకోవాలి

 మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు

పోలీసుస్టేషన్లకు వైకాపా రంగులేసుకోవాలి. గుజరాత్‌ ముంద్రా పోర్టు నుంచి హెరాయిన్‌ ఏపీకి వస్తే ప్రభుత్వం, పోలీసులు సిగ్గుపడాల్సిందిపోయి ప్రశ్నించిన వారిపై దాడులకు పాల్పడుతున్నారు. పైగా తన అభిమానులే ప్రతిస్పందించారని అంటున్నారు. ఇదే తీరు కొనసాగితే రాష్ట్రంలో సామాన్యులు బతకలేని పరిస్థితులు ఏర్పడతాయి.


కీలుబొమ్మగా హోంమంత్రి సుచరిత

తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత

హోంమంత్రి సుచరిత కీలుబొమ్మగా మారారు. చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత ఆమెకు లేదు. మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. ముఖ్యమంత్రి జగన్‌ తీరు చూస్తుంటే రాష్ట్రంలో గంజాయి సాగును పంటగా గుర్తించి ప్రోత్సాహకాలు కూడా ఇచ్చేలా ఉన్నారు.

 

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని