‘పెద్దిరెడ్డి గురించి మాట్లాడితే బాంబులేస్తా’

ప్రధానాంశాలు

‘పెద్దిరెడ్డి గురించి మాట్లాడితే బాంబులేస్తా’

చంద్రబాబుకు కుప్పం వైకాపా నేత సెంథిల్‌ హెచ్చరిక  
సీఐని నెట్టేసిన శాంతిపురం ఎంపీపీ భర్త కోదండరామిరెడ్డి

ఈనాడు-డిజిటల్‌, న్యూస్‌టుడే-చిత్తూరు, కుప్పం పట్టణం: చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో వైకాపా నేత, కుప్పం రెస్కో ఛైర్మన్‌ సెంథిల్‌కుమార్‌ గురువారం చేసిన వ్యాఖ్యలు చిచ్చు రేపాయి. తెదేపా అధినేత చంద్రబాబుతో పాటు ఆ పార్టీ శ్రేణులను ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడటంతో.. కుప్పంలో శుక్రవారం ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప ఆధ్వర్యంలో గురువారం కుప్పంలో వైకాపా నేతలు జనాగ్రహ దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సెంథిల్‌ మాట్లాడుతూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా చంద్రబాబు ఒక్క మాట మాట్లాడినా కారుపై బాంబులేస్తానని హెచ్చరించారు. స్థానిక తెదేపా శ్రేణులపైనా తిట్లు లంకించుకున్నారు. ఎంపీ రెడ్డెప్పతో పాటు నాయకులు వారించబోయినా.. ఆయన తగ్గలేదు.
పోలీసుస్టేషన్‌ వద్ద ఉద్రిక్తత: సెంథిల్‌ వ్యాఖ్యలపై తెదేపా శ్రేణులు శుక్రవారం భగ్గుమన్నాయి. సెంథిల్‌పై కేసు నమోదు చేయాలని నాలుగు మండలాల పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదుచేశారు. కుప్పం తెదేపా కార్యాలయం నుంచి.. అర్బన్‌ పోలీస్‌స్టేషన్‌కు నాయకులు ర్యాలీగా బయల్దేరగా పోలీసులు అడ్డుకున్నారు. అయినా తెదేపా నేతలు ఎంఆర్‌రెడ్డి కూడలి వద్దకు చేరుకున్నారు. అక్కడే ఉన్న సీఐ సాధిక్‌ అలీ వారి నుంచి ఫిర్యాదు తీసుకున్నారు.  ఫిర్యాదు ఇచ్చాక తెలుగుదేశం నేతలు వెనుదిరగ్గా.. వైకాపా శ్రేణులు అక్కడే ఉండటంతో పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అప్పటికీ వెనక్కు తగ్గకపోవడంతో సీఐ సాధిక్‌ అలీ వారిని నెట్టారు. శాంతిపురం ఎంపీపీ వసుంధర భర్త, వైకాపా కన్వీనర్‌ కోదండరామిరెడ్డి సీఐ సాధిక్‌ అలీని తోసేశారు. పోలీసులు వైకాపా నేతలను వెనక్కి పంపారు. సెంథిల్‌ వ్యాఖ్యలపై  రాళ్లబూదుగూరు స్టేషన్‌లో తెదేపా నాయకులు ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు తీసుకోలేదు. దీంతో వారు స్టేషన్‌ ఎదుట ధర్నా చేసి వెనుదిరిగారు. మరోవైపు, సీఐ మీద దాడి చేసినందుకు కొంతమంది వ్యక్తులపై కేసు నమోదైంది.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని