close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
విశాఖలో గోదాముల తొలగింపు కలకలం

‘ఆంధ్రజ్యోతి’ ముద్రణ కేంద్రంలోనూ.. అనధికార నిర్మాణాలు అంటున్న ఏపీఐఐసీ అధికారులు

విశాఖపట్నం (అక్కిరెడ్డిపాలెం), న్యూస్‌టుడే: గాజువాక సమీపంలోని మింది గ్రామం వద్ద ఉన్న గోదాముల్లో నిర్మాణాలను ఏపీఐఐసీ అధికారులు తొలగించడం పారిశ్రామిక ప్రాంతంలో బుధవారం కలకలం రేపింది. ఆటోనగర్‌ ఏ బ్లాకులో సర్వే నంబర్లు 35, 36, 38, 39, 40, 42ల్లో ఉన్న స్థలాన్ని ఏపీఐఐసీ.. ఏటీ రాయుడు అనే వ్యక్తికి కేటాయించింది. ఆ స్థలంలో ఉన్న గోదాములను కొందరు లీజుకు తీసుకున్నారు. వాటిలో బెంజ్‌ కార్ల షోరూమ్‌, బిగ్‌బాస్కెట్‌, అమెజాన్‌, మైహోమ్‌ ఫర్నిచర్స్‌, గాజు సీసాల గోదాము, ఆంధ్రజ్యోతి దినపత్రిక ముద్రణ కేంద్రం, రాఘవేంద్ర లాజిస్టిక్స్‌ తదితర సంస్థలు ఉన్నాయి. బుధవారం తెల్లవారుజామునే ఏపీఐఐసీ, రెవెన్యూ అధికారులతో పాటు సుమారు 100 మంది పోలీసులు 5 జేసీబీలతో వచ్చి నిర్మాణాల తొలగింపు ప్రారంభించారు. వ్యాపార సంస్థల యజమానులు, మీడియా ప్రతినిధులను అక్కడికి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. తమ కార్యాలయాల్లో విలువైన సామగ్రి, దస్త్రాలున్నాయని.. ముందస్తు సమాచారం లేకుండా ఎలా తొలగిస్తారని యజమానులు వాగ్వాదానికి దిగారు. అక్రమ నిర్మాణాలున్నట్లు గుర్తించి గతంలోనే గోదాం యజమానికి నోటీసులిచ్చామని, స్పందించకపోవడంతో కూల్చివేస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఆంధ్రజ్యోతి దినపత్రిక ముద్రణ కేంద్రం ప్రధాన ద్వారాన్ని, గోడలు, రేకులను తొలగించారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాలతో ఈ గోదాములను బుధవారం మధ్యాహ్నం పరిశీలించినట్లు జేసీ వేణుగోపాల్‌రెడ్డి ‘న్యూస్‌టుడే’తో చెప్పారు.  

‘ఆంధ్రజ్యోతి’ ప్రెస్‌ గోదాం కూల్చివేతపై స్టేటస్‌కో: హైకోర్టు

ఈనాడు, అమరావతి: ప్రైవేటు సంస్థ నుంచి లీజుకు తీసుకొని ఆంధ్రజ్యోతి పత్రిక ముద్రణ కేంద్రం నిర్వహిస్తున్న పారిశ్రామిక గోదాము/భవనం కూల్చివేతపై యథాతథ స్థితి పాటించాలని ఏపీఐఐసీ అధికారులను హైకోర్టు బుధవారం ఆదేశించింది. విచారణను శుక్రవారానికి వాయిదా వేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యూ.దుర్గాప్రసాదరావు ఆదేశాలిచ్చారు. ముందస్తు నోటీసు ఇవ్వకుండా ఏపీఐఐసీ అధికారులు భవనాన్ని కూల్చడానికి వచ్చారని, దాన్ని నిలువరించాలని ‘ఆంధ్రజ్యోతి’ విజయవాడ శాఖ మేనేజరు వేమూరి మురళి అత్యవసరంగా హైకోర్టులో వ్యాజ్యం వేశారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు