3 కోట్ల మందికి వ్యాక్సిన్‌ వేయాలి
close

ప్రధానాంశాలు

3 కోట్ల మందికి వ్యాక్సిన్‌ వేయాలి

గ్లోబల్‌ టెండర్‌ ఆహ్వానించిన వైద్య ఆరోగ్య శాఖ

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో 3 కోట్ల మంది ప్రజలకు వ్యాక్సిన్‌ పంపిణీ చేసేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం అంతర్జాతీయ స్థాయిలో టెండర్లు పిలిచింది. టెండర్‌ దరఖాస్తులో కోటి మంది జనాభాకు వ్యాక్సిన్‌ పంపిణీ చేయాలని పేర్కొంది. అయితే, ప్రభుత్వ సూచన మేరకు 3 కోట్ల జనాభాకు వ్యాక్సిన్‌ పంపిణీ చేయాలని పేర్కొంటూ నిబంధన మార్చబోతున్నారు. 3 కోట్ల మందికి వ్యాక్సిన్‌ పంపిణీ చేయడమంటే 6 కోట్ల డోసులు అవసరమవుతాయి. కొత్త కంపెనీలు ఒక డోసుతోనే కరోనాకు రక్షణ వస్తుందని అనుమతులు పొందితే ఇబ్బందుల్లేకుండా ఉండేందుకు వీలుగా 3 కోట్ల మందికి వ్యాక్సిన్‌ అవసరమని పేర్కొన్నట్లు అధికారులు తెలిపారు. టెండరు వివరాలను ప్రస్తుతం టీకా ఉత్పత్తి చేస్తున్న రెండు దేశీయ కంపెనీలతో పాటు విదేశాల్లోని సంస్థలకూ తెలియజేయనుంది. ‘ఔషధాలు, వ్యాక్సిన్‌ కేటగిరీ’లో రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ అంతర్జాతీయ స్థాయిలో టెండర్లు పిలవడం ఇదే తొలిసారి.

ఇవీ నిబంధనలు
వ్యాక్సిన్‌ పంపిణీకి అవసరమైన అన్నిరకాల అనుమతులను కేంద్ర ప్రభుత్వం నుంచి పొందాల్సిన బాధ్యత టెండర్‌ దక్కించుకున్న ఉత్పత్తి సంస్థలదే. టెండర్‌ ఖరారైన 2 నెలల్లో కేంద్రం నుంచి ఈ అనుమతులు పొందాలి. మూడో నెల నుంచి వ్యాక్సిన్‌ పంపిణీని ప్రారంభించాలి. కనీసం నెలకు 25 లక్షల డోసులు అందించాలి. రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్న షెడ్యూలు నాటికి కేంద్రం నుంచి అనుమతులు పొందగలమన్న నమ్మకం ఉన్న సంస్థలు కూడా బిడ్‌ వేయొచ్చు. ఉత్పత్తి సంస్థ వార్షిక టర్నోవర్‌ రూ.20 కోట్లు ఉండాలి. 75% టీకాల పంపిణీ చేసిన తర్వాత ఒప్పందం చేసుకున్న ధరలో 50% బిల్లులు ప్రభుత్వం చెల్లిస్తుంది. ఉత్పత్తి సంస్థలు దరఖాస్తు చేసుకోవాల్సిన చివరి తేదీ జూన్‌ 3. జూన్‌ 20న ప్రీబిడ్డింగ్‌ సమావేశం జరుగుతుందని రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ విజయరామరాజు వెల్లడించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని