మంత్రి వెలంపల్లికి రాజధాని ఉద్యమ సెగ

ప్రధానాంశాలు

మంత్రి వెలంపల్లికి రాజధాని ఉద్యమ సెగ

 వినతిపత్రం ఇచ్చేందుకు అనుమతించని పోలీసులు

ఈనాడు డిజిటల్‌- అమరావతి, తుళ్లూరు (గ్రామీణ), న్యూస్‌టుడే: రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌కు రాజధాని రైతుల నిరసన సెగ తగిలింది. శనివారం తాళ్లయపాలెంలోని శైవక్షేత్రానికి మంత్రి వచ్చారన్న సమాచారం తెలుసుకున్న అసైన్డు రైతులు తమ సమస్యలపై వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లారు. ప్రధాన ద్వారం నుంచి లోపలికి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అనుమతించలేదు. గంటపాటు గేటు దగ్గరే ఎదురుచూశారు. మంత్రి వచ్చే సమయంలో ఆయన్ను కలిసేందుకు ముందుకెళ్లగా పోలీసులు మళ్లీ అడ్డుకుని పక్కకు తీసుకెళ్లారు. ఆగ్రహానికి గురైన రైతులు జై అమరావతి అంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. మంత్రి వారిని పట్టించుకోకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం రైతులు మీడియాతో మాట్లాడుతూ.. అమరావతిలో వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి ప్రతిపాదించిన స్థలాన్ని రెండు ఎకరాలకు కుదించారని, బడ్జెట్‌ను తగ్గించడం దారుణమని పేర్కొన్నారు. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శనివారం తుళ్లూరు, వెలగపూడి, రాయపూడి, ఉద్దండరాయునిపాలెం తదితర దీక్షా శిబిరాల్లో 585వ రోజూ రైతులు ఆందోళనలు కొనసాగించారు.

* రాజధానిలోని అసైన్డు రైతులకు ప్రభుత్వం వార్షిక కౌలు చెల్లించేలా ఒత్తిడి తీసుకోవాలని అమరావతి దళిత ఐకాస నేతలు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును కోరారు. శనివారం తాళ్లాయపాలెంలోని శైవక్షేత్రానికి వచ్చిన ఆయనకు ఈ మేరకు వినతిపత్రం అందించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని