తోక... కుక్కను ఆడించలేదు

ప్రధానాంశాలు

తోక... కుక్కను ఆడించలేదు

కుక్క మాత్రమే తోకను ఆడించగలదు

అనుబంధంగా ఇచ్చిన ఫామ్‌ ప్రకారం వ్యవహరించలేరు

ఏపీపీఎస్సీ కమిటీ తీరును తప్పుపట్టిన హైకోర్టు

ఈనాడు, అమరావతి: ఉద్యోగ ప్రధాన ప్రకటనలో పేర్కొనని అంశాల్ని.. అనుబంధంగా ఇచ్చిన ఫామ్‌-1 ఆధారంగా ఏపీపీఎస్సీ క్రీడల కోటా కింద రిజర్వేషన్‌ నిరాకరించడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. తోక కుక్కను ఆడించలేదని.. కుక్క మాత్రమే తోకను ఆడించగలదని తెలిపింది. అలాగే.. అనుబంధంగా ఇచ్చిన ఫామ్‌-1లోని అంశాలకు అనుగుణంగా ఏపీపీఎస్సీ కమిటీ వ్యవహరించలేదని.. నోటిఫికేషన్‌, ప్రభుత్వ జీవోలోని నిబంధనల ప్రకారమే వ్యవహరించగలదని స్పష్టం చేసింది. పిటిషనర్‌ను ప్రతిభావంతుల క్రీడా విభాగంలో పరిగణనలోకి తీసుకోవాలని ఏపీపీఎస్సీని ఆదేశించింది. అధికరణ 309 ప్రకారం రూపొందించిన రాష్ట్ర సబార్డినేట్‌ నిబంధనలు సైతం.. ‘ప్రతిభావంతుడైన క్రీడాకారుడు’ నిర్వచనాన్ని.. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్నవారికే పరిమితం చేయలేదని స్పష్టంచేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు ఇటీవల ఈ మేరకు తీర్పు ఇచ్చారు.

నేపథ్యమిదే..

టెన్నిస్‌ క్రీడాకారుడు జె.వెంకట్‌ బాలాజీ క్రీడల కోటా కింద గ్రూప్‌-1 పోస్టులకు దరఖాస్తు చేశారు. సెంట్రల్‌ స్థాయి టెన్నిస్‌ పోటీల్లో పాల్గొన్న అర్హత ఉంది. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌, మెయిన్స్‌లో అర్హత సాధించారు. ఏపీపీఎస్సీ అడగడంతో క్రీడల ధ్రువీకరణ పత్రాల్ని సమర్పించారు. ఏపీపీఎస్సీ ఏర్పాటు చేసిన కమిటీ.. వాటిని పరిశీలించి బాలాజీ అభ్యర్థనను తిరస్కరించింది. నోటిఫికేషన్‌కు అనుబంధంగా ఉన్న ఫామ్‌-1లోని క్రీడాంశాలను పరిగణనలోకి తీసుకొని.. పిటిషనర్‌ జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో దేశం తరఫున పాల్గొనలేదనే కారణంతో రిజర్వేషన్‌ నిరాకరిస్తున్నట్లు తెలిపింది. ఆ నిర్ణయాన్ని సవాలు చేస్తూ బాలాజీ హైకోర్టును ఆశ్రయించారు. సీనియర్‌ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్నవారే క్రీడల కోటా కింద గ్రూప్‌-1 పోస్టుకు అర్హులని నోటిఫికేషన్లో పేర్కొనలేదన్నారు. అనుబంధంగా తెచ్చిన ఫామ్‌-1 రూపంలో అర్హతలను పేర్కొనడం చట్ట విరుద్ధమన్నారు. జీవో 74 ప్రకారం.. ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించినవారి దగ్గర్నుంచి... రాష్ట్ర, అంతర్‌ జిల్లాస్థాయి పాఠశాల క్రీడల్లో పాల్గొన్నవారూ క్రీడల కోటాకు అర్హులన్నారు. ఆ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి.. రాష్ట్ర సబార్డినేట్‌ నిబంధనల్లో సైతం.. ప్రతిభావంతులైన క్రీడాకారులు అంటే కేవలం జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్నవారేనని పరిమితి విధించలేదన్నారు. ప్రధాన నోటిఫికేషన్‌లో ఉన్న నిబంధనలను ఏపీపీఎస్సీ ఇచ్చిన నోట్‌/ఫామ్‌లోని నిబంధనలు అధిగమించలేవన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని