న్యాయస్థానాలనే అనుమానిస్తారా?

ప్రధానాంశాలు

న్యాయస్థానాలనే అనుమానిస్తారా?

 ఎంపీ రఘురామకు తెలంగాణ హైకోర్టు ప్రశ్న

 సీబీఐ కోర్టు నుంచి పిటిషన్‌ బదిలీ చేయాలనడంపై వ్యాఖ్య

 ఉత్తర్వులు నేటికి వాయిదా

ఈనాడు, హైదరాబాద్‌: నిందితులు ఇతర దేశాలకు వెళ్లడానికి అనుమతించినంత మాత్రాన కోర్టులనే అనుమానిస్తారా అని ఎంపీ రఘురామ కృష్ణరాజును తెలంగాణ హైకోర్టు మంగళవారం ప్రశ్నించింది. పరిస్థితులకు అనుగుణంగా నిందితులు విదేశాలకు వెళ్లడానికి ప్రత్యేక కోర్టులు అనుమతించడం సాధారణమేనని, తామూ ఇలా చాలామందికి అనుమతులిచ్చామని వ్యాఖ్యానించింది. అంతమాత్రాన కోర్టులను సందేహిస్తూ కేసు బదిలీ చేయాలని ఎలా కోరతారంటూ... బదిలీకి సరైన కారణాలు చెప్పాలని పేర్కొంది. అక్రమాస్తుల కేసులో నిందితులైన ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డిల బెయిలు రద్దుచేయాలంటూ దాఖలైన పిటిషన్లను ప్రధాన సీబీఐ కోర్టు నుంచి మరో కోర్టుకు బదిలీ చేయాలంటూ ఎంపీ రఘురామ కృష్ణరాజు హైకోర్టులో అత్యవసరంగా పిటిషన్‌ దాఖలు చేశారు. దీనికి అనుమతించిన న్యాయమూర్తి జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ మధ్యాహ్నం విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది ఎస్‌.శ్రీవెంకటేశ్‌ వాదనలు వినిపిస్తూ విజయసాయిరెడ్డి బెయిలు రద్దు పిటిషన్‌పై వాదనలు కొనసాగుతుండగా, జగన్‌ బెయిలును రద్దుచేయాలన్న పిటిషన్‌ను కోర్టు కొట్టేసిందంటూ సాక్షి వెబ్‌మీడియాలో ట్వీట్‌ చేశారన్నారు. ఇంతలో విదేశీ పర్యటన కోసం విజయసాయిరెడ్డికి సీబీఐ కోర్టు అనుమతి మంజూరు చేసిందన్నారు. ఈ కేసుల్లో పారదర్శకంగా విచారణ కొనసాగడం లేదని, రోజువారీ విచారణ కొనసాగించాల్సి ఉండగా నిందితులు కోరినట్లు వాయిదాలు వేస్తున్నారన్నారు. ఇవన్నీ అనుమానాస్పదంగా ఉన్నందున పిటిషన్లను మరో కోర్టుకు బదిలీ చేయాలన్నారు. ఈ దశలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ విజయసాయిరెడ్డికి ఇచ్చిన అనుమతులపై హైకోర్టును ఆశ్రయించారా అని ప్రశ్నించారు. లేనప్పుడు ఆ ఉత్తర్వుల ప్రస్తావన ఎందుకన్నారు. గతంలో ఎప్పుడైనా అనుమతులిచ్చారా? అప్పుడు ఆయన షరతులను ఉల్లంఘించారా అని ప్రశ్నించగా సీబీఐ న్యాయవాది కె.సురేందర్‌ సమాధానమిస్తూ లేదన్నారు. కోర్టు నుంచి కేసు బదిలీ చేయాలంటే సహేతుకమైన కారణాలు ఉండాలని, ఇక్కడ అలాంటివేవీ లేకుండా ఊహాజనిత కారణాలతో బదిలీ కోరుతున్నారన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి ఉత్తర్వులను బుధవారం జారీ చేస్తామంటూ వాయిదావేశారు.

కోర్టు ధిక్కరణ కేసులో ముగిసిన వాదనలు

సాక్షి మీడియాపై ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలుచేసిన కోర్టుధిక్కరణ కేసుపై సీబీఐ కోర్టులో వాదనలు ముగిశాయి. దీనిపై సీబీఐ కోర్టు న్యాయమూర్తి బి.ఆర్‌.మధుసూదన్‌రావు బుధవారం ఉత్తర్వులు వెలువరించనున్నారు. విచారణకు సాక్షి ఎడిటర్‌ మురళి, సీఈఓ వినయ్‌ మహేశ్వరి హాజరయ్యారు. దీంతోపాటు లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌, ఇందూ గృహనిర్మాణ మండలి వ్యవహారాల్లో సీబీఐ నమోదుచేసిన కేసుల్లో ప్రధాన నిందితులైన వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి, విజయసాయిరెడ్డి దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్లపై కౌంటరు దాఖలు చేయడానికి సీబీఐ గడువు కోరడంతో కోర్టు అనుమతిస్తూ విచారణను వాయిదా వేసింది. లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌ కేసు ఈ నెల 20కి, ఇందూ గృహనిర్మాణ మండలిపై కేసును బుధవారానికి వాయిదా వేసింది.

బెయిలు రద్దు పిటిషన్లపై నేడు తీర్పు

అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితులు ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డిల బెయిలు రద్దు చేయలంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ కోర్టు బుధవారం తీర్పు వెల్లడించనుంది. ఇప్పటికే ఇరుపక్షాల వాదనలు విన్న జడ్జి.. తీర్పును వాయిదా వేసిన విషయం తెలిసిందే.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని