సినిమా టికెట్ల అమ్మకంపై నిర్ణయం తీసుకోలేదు

ప్రధానాంశాలు

సినిమా టికెట్ల అమ్మకంపై నిర్ణయం తీసుకోలేదు

 అది సినిమా ప్రముఖులు అడిగిందే

సమాచార, పౌరసంబంధాలశాఖ మంత్రి పేర్ని నాని

ఈనాడు, అమరావతి: ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల అమ్మకాలపై ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, కమిటీలు వేశామని, అధ్యయనం జరుగుతోందని సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) తెలిపారు. సినిమా నటులు, నిర్మాతలు, పంపిణీదారులు, సినిమాహాళ్ల యజమానులు తదితర విభాగాల ప్రతినిధులతో త్వరలోనే సమావేశం నిర్వహించి వారి సూచనలు తీసుకుంటామన్నారు. సచివాలయంలో మంగళవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ... సినిమా అనే ప్రజల బలహీనతను అడ్డం పెట్టుకుని అధిక ధరలకు టికెట్లు అమ్మకుండా, నిరంతర షోలు వేయకుండా, బ్లాక్‌మార్కెట్‌, పన్ను ఎగవేతలకు పాల్పడకుండా ఉండేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. నిపుణుల కమిటీ ముందుకు గరిష్ఠ ధరలు, ఆన్‌లైన్‌ అమ్మకాలు అనే ప్రతిపాదన వచ్చిందని వివరించారు. 

ప్రభుత్వంపై విష ప్రచారం

‘గతేడాది జూన్‌లో నటులు చిరంజీవి, నాగార్జునతోపాటు దర్శకుడు రాజమౌళి, నిర్మాత దిల్‌రాజుతోపాటు పలవురు సినిమాహాళ్ల యాజమాన్యాల ప్రతినిధులు ముఖ్యమంత్రి జగన్‌ను కలిసి వివిధ అంశాలపై వినతిపత్రం ఇచ్చారు. అందులో ఆన్‌లైన్‌ టికెట్ల అంశమూ ఒకటి. ఇది సినిమా వాళ్లు అడిగిన కోరికే’ అని మంత్రి వెంకట్రామయ్య వెల్లడించారు. 

రెండు బ్లాక్‌బస్టర్లు.. రూ.170 కోట్ల వసూలు.. మరి పన్ను ఏదీ?

‘2020 సంకాంత్రికి రెండు పెద్ద సినిమాలు(జనవరి 11, 12న) విడుదలయ్యాయి. ఆ రెండూ బ్లాక్‌బస్టర్లు అన్నారు. ఒక్క ఏపీ లెక్క చూస్తేనే.. ఒకటి రూ.87 కోట్లు, మరోటి రూ.83 కోట్లపైనే వసూలు చేశాయన్నారు. ఆ రెండు సినిమాలకే సగటున రూ.25 కోట్లపైన జీఎస్టీ రావాలి. అయితే ఆ ఏడాదంతే వచ్చింది రూ.40 కోట్లే.. అంటే ఎక్కడో తేడా కొడుతోందిగా?’ అని మంత్రి వివరించారు.

పరిశ్రమను విశాఖకు రప్పించే ప్రయత్నం

‘సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని కలిసేందుకు తేదీ ఖరారు చేయాలని చిరంజీవి జులై ఆఖరులో నాకు ఫోన్‌ చేశారు. ఆగస్టు 21 నుంచి 23 మధ్య కలుద్దామని ముఖ్యమంత్రి సూచించారు. అప్పుడు చిరంజీవి జన్మదినంతోపాటు పలువురు షూటింగ్‌లకు వెళ్లడంతో కుదరలేదు. త్వరలోనే తేదీ ఖరారు చేస్తాం. సినీ పరిశ్రమను ప్రోత్సహించాలని జగన్‌ ఆలోచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు వస్తే బాగుంటుందని పరిశ్రమ పెద్దల్ని కోరుతున్నారు’ అని మంత్రి పేర్కొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని