అబ్బాయిల ఫోన్లలోనూ దిశ యాప్‌ ఉండాలి

ప్రధానాంశాలు

అబ్బాయిల ఫోన్లలోనూ దిశ యాప్‌ ఉండాలి

ఆపదలో ఉన్న మహిళలను రక్షించవచ్చు
మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత

ఈనాడు, అమరావతి: ‘దిశ యాప్‌ను అబ్బాయిలు కూడా తమ స్మార్ట్‌ ఫోన్లలో డౌన్‌లోడ్‌ చేసుకోవాలని చెబుతున్నాం. దీని వల్ల వారికి సమీపంలో ఎవరైనా మహిళలు ఆపదలో ఉంటే వారిని రక్షించేందుకు అది దోహదపడుతుందని’ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. కడప జిల్లాకు చెందిన ఓ యువతి పరీక్ష రాసేందుకు ఈ నెల 11న దిల్లీ వెళ్లగా, అక్కడ ఆటో డ్రైవర్‌ వల్ల ఇబ్బంది పడనున్నట్లు గుర్తించి దిశ యాప్‌ ద్వారా తెలియజేసిందని, వెంటనే డీఎస్పీ, ఎస్పీ స్పందించి ఆమెను రక్షించగలిగారని చెప్పారు. బుధవారం సచివాలయంలో మంత్రి విలేకరులతో మాట్లాడారు. ‘లోకేశ్‌కు దిశ బిల్లులో ఏముందో తెలియదా? దానిని ఆమోదించమని ఆయన ఓ లేఖ అయినా కేంద్రానికి రాశారా? ఆ చట్టం ప్రతులను ఆయన చించడం దారుణం. అత్యాచారానికి గురైన వారికి ప్రభుత్వం పరిహారం అందిస్తుంటే... ఎగతాళి చేస్తున్నారు. ఆయన్ను సమాజం క్షమించదు...’ అని పేర్కొన్నారు. ‘మహిళలపై దాడి చేసిన 148 మందిలో ముగ్గురికి ఉరి శిక్ష, 17 మందికి జీవిత ఖైదు, ముగ్గురికి 20 ఏళ్ల జైలు శిక్ష, పది మందికి పదేళ్ల జైలు శిక్ష దిశ చట్ట ప్రకారం విధించారని’ అని మంత్రి వనిత వివరించారు. అయితే.. దిశ చట్టం అమల్లోకి రాలేదు కదా అని విలేకరులు ప్రశ్నించగా.. నిర్భయ చట్టం ద్వారా ఈ శిక్షలు పడ్డాయని మంత్రి వనిత సమాధానమివ్వడం గమనార్హం.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని