ఇసుక తరలింపు వివరాలను ఇవ్వండి

ప్రధానాంశాలు

ఇసుక తరలింపు వివరాలను ఇవ్వండి

ఏఎంఆర్‌డీఏకు హైకోర్టు ఆదేశం

ఈనాడు, అమరావతి: తడి ఆరిన ఇసుక తరలింపు వివరాలను కోర్టు ముందు ఉంచాలని అమరావతి మహానగర ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఏఎంఆర్‌డీఏ)ను హైకోర్టు ఆదేశించింది. దానిని ఎక్కడికి తరలిస్తున్నారు, ఎవరు తరలిస్తున్నారు, గుత్తేదారులెవరు, నిల్వ చేస్తున్న ప్రాంతం నదికి ఎంత దూరంలో ఉందో తెలియజేయాలని పేర్కొంది. కృష్ణా నదిలో పూడిక తీసిన ఇసుకను రాజధాని ప్రాంతం మందడం గ్రామ పరిధిలోని పది ఎకరాల్లో నిల్వ చేసేందుకు అధికారులు లీజు ప్రాతిపదికన అనుమతించడాన్ని సవాలు చేస్తూ ‘రాజధాని రైతు పరిరక్షణ సమితి’ కోశాధికారి అనుమోలు గణేశ్‌ ప్రసాద్‌ పిల్‌ వేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోస్వామి, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. వాదనలను విన్న అనంతరం విచారణను ఈనెల 24కు వాయిదా వేసింది.


తితిదే పాలకమండలి సభ్యుల నియామకంపై నేడు హైకోర్టు విచారణ

ఈనాడు, అమరావతి: తితిదే పాలక మండలి సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితుల నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాలపై బుధవారం విచారణ జరుపుతామని హైకోర్టు పేర్కొంది. పిటిషనర్‌, భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి జి.భానుప్రకాశ్‌రెడ్డి తరఫు న్యాయవాది ఎన్‌.అశ్వనీకుమార్‌ ఈ వ్యాజ్యంపై అత్యవసరంగా విచారణ జరపాలని మంగళవారం హైకోర్టు సీజే జస్టిస్‌ ఏకే గోస్వామి నేతృత్వంలోని ధర్మాసనాన్ని కోరారు. తొందరగా విచారించాల్సిన అవసరం ఏముందని ధర్మాసనం ప్రశ్నించగా.. బోర్డు సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందన్నారు. మంగళవారం విచారణ సాధ్యం కాదని తెలిపిన ధర్మాసనం.. బుధవారం విచారణ చేస్తామంది. మరో పిటిషనర్‌, హిందూ జన శక్తి సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు కాకుమాను లలిత్‌కుమార్‌ తరఫు న్యాయవాది పీవీజీ ఉమేశ్‌చంద్ర స్పందిస్తూ ఇదే అంశంపై తాము దాఖలు చేసిన వ్యాజ్యాన్ని బుధవారం విచారించాలని కోరారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని