సంక్షిప్త వార్తలు

ప్రధానాంశాలు

సంక్షిప్త వార్తలు

ఎయిడెడ్‌ డిగ్రీ అధ్యాపకులకు వర్సిటీల్లో పోస్టింగ్‌

ఈనాడు, అమరావతి: అర్హత కలిగిన ఎయిడెడ్‌ డిగ్రీ అధ్యాపకులకు విశ్వ విద్యాలయాల్లో పోస్టులు ఇచ్చేందుకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. విశ్వవిద్యాలయాల్లో పని చేసేందుకు ఆసక్తి ఉన్న వారు బుధవారం లోపు ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాళ్లకు దరఖాస్తులు సమర్పించాలని సూచించింది. అనంతరం ఈ దరఖాస్తులను 23లోపు కమిషనరేట్‌కు పంపించాలని ఆదేశించింది. ఎయిడెడ్‌ నుంచి 1091 మంది అధ్యాపకులు వస్తుండగా.. ఇంతమందిని డిగ్రీ కళాశాలల్లో సర్దుబాటు చేసేందుకు అవకాశం లేకపోవడంతో అర్హతలున్న వారికి వర్సిటీల్లో పోస్టులు ఇవ్వాలని నిర్ణయించారు. సిబ్బందిని అప్పగించేందుకు సమ్మతి తెలిపిన ఎయిడెడ్‌ పాఠశాలల ఉపాధ్యాయులను స్థానిక ప్రభుత్వ పాఠశాలల్లో సర్దుబాటు చేయాలని  విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.


డీఈఓల స్థాయిలో ఎయిడెడ్‌ విలీన ప్రక్రియ

ఈనాడు, అమరావతి: ఎయిడెడ్‌ పాఠశాలల విలీన ప్రక్రియను జిల్లా విద్యాధికారుల స్థాయిలోనే పూర్తి చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఎయిడెడ్‌ పోస్టులతోపాటు సిబ్బందిని అప్పగించేందుకు సమ్మతించిన పాఠశాలలకు వ్యక్తిగత ఆదేశాలు జారీ, ప్రైవేటు పాఠశాలలుగా మార్పు, సిబ్బంది విలీన ప్రక్రియను పూర్తిచేయాలని డీఈఓలకు సూచించింది.


సీసీఐ ఏడీజీగా తెలుగు వ్యక్తి

ఈనాడు, గువాహటి: దిల్లీలోని కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌గా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అస్సాం క్యాడర్‌(2005 బ్యాచ్‌) ఐపీఎస్‌ అధికారి జి.వి.శివప్రసాద్‌ నియమితులయ్యారు. దేశంలో వాణిజ్యం సక్రమంగా జరిగేలా సీసీఐ నియంత్రిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల వ్యవసాయ కళాశాల నుంచి బీఎస్సీ పట్టా పొందిన శివప్రసాద్‌ దిల్లీలోని ఇండియన్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్‌ నుంచి ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ అందుకున్నారు. సీసీఐ ఏడీజీగా బాధ్యతలు స్వీకరించడానికి ముందు ఆయన గువాహటిలోని డీజీపీ కార్యాలయంలో డీఐజీగా సేవలందించారు. కార్బి ఆగ్లాంగ్‌ జిల్లాలో వేర్పాటువాదుల నియంత్రణకు కృషి చేశారు.


ప్రత్యేక సమావేశానికి హాజరుకండి జడ్పీటీసీ విజేతలకు నోటీసులు

ఈనాడు, అమరావతి: జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్ల ఎన్నిక కోసం ఈనెల 25న నిర్వహించే ప్రత్యేక సమావేశానికి హాజరు కావాలని కొత్తగా ఎన్నికైన జడ్పీటీసీ సభ్యులకు అధికారులు మంగళవారం నోటీసులు అందజేశారు. పరోక్ష పద్ధతిలో ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్లను సభ్యులు ఎన్నుకోవాల్సి ఉంది. ఈ మేరకు అన్ని జిల్లాల్లో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జడ్పీ ఛైర్మన్‌ స్థానాలకు ఇప్పటికే ఖరారుచేసిన రిజర్వేషన్ల వివరాలను ఎస్‌ఈసీ మరోసారి జిల్లాలకు పంపింది. ఎన్నికల ప్రక్రియను పూర్తిచేయాలని ఆదేశించింది.


పరిధి ఆధారంగానే కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై చర్యలు
రాయలసీమ ఎత్తిపోతలపై ఎన్జీటీ

ఈనాడు, హైదరాబాద్‌: రాయలసీమ ఎత్తిపోతల పథకం పనుల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లయితే ట్రైబ్యునల్‌కు ఉన్న పరిధి ఆధారంగానే చర్యలు ఉంటాయని చెన్నైలోని జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్జీటీ) స్పష్టం చేసింది. సాధారణంగా ట్రైబ్యునల్‌ ఉత్తర్వులు అమలుకానప్పుడు జరిమానా చెల్లించాలని ఆదేశించగలమని, చర్యలకు సంబంధించి మొదటిసారి చర్చ జరుగుతోందని పేర్కొంది. పథకానికి సంబంధించి గతేడాది అక్టోబరు 29న ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘించిన ఏపీ ప్రభుత్వ అధికారులతోపాటు ప్రైవేటు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంటూ జి.శ్రీనివాస్‌తోపాటు తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్లపై మంగళవారం ట్రైబ్యునల్‌ జ్యుడీషియల్‌ సభ్యులు జస్టిస్‌ కె.రామకృష్ణన్‌, సాంకేతిక సభ్యులు డాక్టర్‌ కె.సత్యగోపాల్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. తెలంగాణ తరఫున వాదనలు వినిపించడానికి గడువు కావాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎ.సంజీవ్‌కుమార్‌ కోరారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది కె.శ్రవణ్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ ఎన్జీటీ చట్టం కింద చర్యలు తీసుకునే అధికారం ట్రైబ్యునల్‌కు ఉందంటూ సుప్రీం కోర్టు తీర్పులను ప్రస్తావించారు. ఈ నెలాఖరులో ఏపీ సీఎస్‌ పదవి విరమణ చేస్తున్నందున.. సత్వర విచారణ చేపట్టాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థన నేపథ్యంలో తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేస్తున్నట్లు ట్రైబ్యునల్‌ ప్రకటించింది.


రీ-సర్వే కోసం పీఎంయూల ఏర్పాటు

ఈనాడు, అమరావతి: భూముల రీ-సర్వే కోసం జిల్లా, డివిజనల్‌, మండల స్థాయిలో ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ యూనిట్లను ఏర్పాటు చేయాలని రెవెన్యూ శాఖ జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. అలాగే జిల్లా కలెక్టరేట్‌లో పీఎంయూల కోసం సాయంగా ఉండేందుకు ప్రత్యేకంగా ఓ విభాగాన్ని ఏర్పాటు చేయాలంది. జిల్లా యూనిట్‌కు స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌, డివిజనల్‌ యూనిట్‌కు స్పెషల్‌ తహసీల్దార్‌, మండల యూనిట్‌కు డిప్యూటీ తహసీల్దార్‌ నేతృత్వం వహిస్తారు. జిల్లా యూనిట్‌లో సర్వే, అటవీ, ఎన్‌ఐసీ అధికారి, డిప్యూటీ తహసీల్దార్‌, ఒక విలేజ్‌ సర్వేయర్‌, ఒక విలేజ్‌ రెవెన్యూ అధికారి, ఈ-డిస్ట్రిక్ట్‌ మేనేజర్‌ సభ్యులుగా ఉంటారు. ఇదేవిధంగా డివిజనల్‌, మండల యూనిట్లలో ఎవరెవరు ఉండాలో ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని