ఏడాదిలో విశాఖ క్రూయిజ్‌ టెర్మినల్‌ పూర్తి

ప్రధానాంశాలు

ఏడాదిలో విశాఖ క్రూయిజ్‌ టెర్మినల్‌ పూర్తి

కేంద్ర సహాయమంత్రి శంతను ఠాకూర్‌

ఈనాడు, విశాఖపట్నం: గతంలో జరిగిన మారిటైమ్‌ సదస్సులో మొత్తం రూ.26 వేల కోట్ల పెట్టుబడులను విశాఖ నౌకాశ్రయం ఆకర్షించిందని, ఆ మొత్తం ప్రాంతీయ ఆర్థిక ప్రగతికి ఉపయుక్తంగా ఉంటుందని కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్‌, జలమార్గాల మంత్రిత్వ శాఖ సహాయమంత్రి శంతను ఠాకూర్‌ పేర్కొన్నారు. శుక్రవారం నౌకాశ్రయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద నగరంలో రూ.150 కోట్లతో నిర్మించనున్న ఆధునిక చేపల రేవు మత్స్యరంగ ప్రగతికి ఉపకరిస్తుందని వెల్లడించారు. విశాఖ నౌకాశ్రయంలో నిర్మించబోతున్న క్రూయిజ్‌ టెర్మినల్‌ నిర్మాణ పనులు సంవత్సరంలో పూర్తవుతాయని తెలిపారు. కంటైనర్‌ టెర్మినల్‌ విస్తరణ పనులు మూడు నెలల్లో పూర్తవుతాయన్నారు.  విశాఖపట్నం-రాయ్‌పూర్‌ ప్రత్యేక రోడ్డు రవాణా మార్గ నిర్మాణ కూడా త్వరలో పూర్తవుతుందని వెల్లడించారు. నౌకాశ్రయాన్ని ప్రైవేటుపరం చేసే ఆలోచనలు లేవని తెలిపారు.

నౌకాశ్రయ ప్రగతిపై సమీక్ష: సముద్ర విహారానికి అవకాశం కల్పించేవిధంగా నిర్మించ తలపెట్టిన క్రూయిజ్‌ టెర్మినల్‌ నిర్మాణ పనులకు  శంతను ఠాకూర్‌ శంకుస్థాపన చేశారు. కాన్వెంట్‌ కూడలి దగ్గర నిర్మించిన గ్రేడ్‌ సపరేటర్‌ ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. నౌకాశ్రయంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు. నౌకాశ్రయ అధికారులతో సమావేశమై ప్రగతిని సమీక్షించారు.ఈ కార్యక్రమాల్లో నౌకాశ్రయ ఛైర్మన్‌ కె.రామమోహనరావు, ఉప ఛైర్మన్‌ దుర్గేశ్‌ కుమార్‌ దుబే, కార్యదర్శి వేణుగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని