విశాఖలో ఎగుమతుల పరిశోధనశాల

ప్రధానాంశాలు

విశాఖలో ఎగుమతుల పరిశోధనశాల

తనిఖీ కేంద్రం ఉప కార్యాలయం కొత్త భవనం ప్రారంభం

విశాఖపట్నం: ఎగుమతుల తనిఖీ మండలి(ఈఐసీ)కి చెందిన చెన్నెలోని కార్యాలయానికి సంబంధించి విశాఖపట్నంలో ఉపకేంద్రం నూతన కార్యాలయం, పరిశోధనశాల ప్రాంగణం ప్రారంభమైంది. ఆనందపురంలోని గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌లో ఏర్పాటుచేసిన ఈ ఉప కార్యాలయాన్ని శుక్రవారం కేంద్ర వాణిజ్యశాఖ కార్యదర్శి బీవీఆర్‌ సుబ్రహ్మణ్యం ప్రారంభించారు. 1973లో ఈ ఉపకేంద్రాన్ని స్థాపించగా ఇప్పుడు కొత్త ప్రాంగణానికి తరలింది. దీనికి ఏపీఐఐసీ స్థలాన్ని కేటాయించింది. ఈ ఉపకేంద్రం పరిధిలో ప్రస్తుతం 58 అనుమతి పొందిన ఎగుమతుల సంస్థలు ఉన్నాయి. ఇక్కడి పరిశోధనశాలలో యాంటీబయోటిక్స్‌, పురుగు మందులు, భార లోహాల రసాయన విశ్లేషణ, ఆహార పదార్థాల విశ్లేషణ చేయడానికి అవసరమైన సదుపాయాలను ఏర్పాటు చేశారు. దీనివల్ల స్థానిక ఎగుమతిదారులు పరీక్షల కోసం నమూనాలను దూర ప్రాంతాలకు పంపాల్సిన ఇబ్బంది తప్పనుంది. తద్వారా సమయం ఆదా కావడంతో పాటు, రవాణా వ్యయం కూడా తగ్గనుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర వాణిజ్యశాఖ సంయుక్త కార్యదర్శి, ఈఐసీ డైరెక్టర్‌ దివాకర్‌నాథ్‌ మిశ్ర, ఎంపెడా ఛైర్మన్‌ కె.ఎస్‌.శ్రీనివాస్‌, ఎపెడా ఛైర్మన్‌ డాక్టర్‌ ఎం.అంగముత్తు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని