సంక్షిప్త వార్తలు

ప్రధానాంశాలు

సంక్షిప్త వార్తలు

అక్కడ ఇసుక నిల్వను ప్రారంభించలేదు

హైకోర్టుకు తెలిపిన ఏఎంఆర్‌డీఏ

ఈనాడు, అమరావతి: మందడం గ్రామ పరిధిలో పిటిషనర్‌ ఆరోపిస్తున్న ప్రాంతంలో ఇసుకను నిల్వ చేసే ప్రక్రియ ఇంకా ప్రారంభించలేదని ఏఎంఆర్‌డీఏ(అమరావతి మహానగర ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ) తరఫు న్యాయవాది కాసా జగన్‌మోహన్‌రెడ్డి హైకోర్టుకు శుక్రవారం నివేదించారు. పిటిషనర్‌ హైకోర్టు ముందుంచిన ఫొటో మందడం పరిధిలోని పది ఎకరాల్లో ఇసుక నిల్వ చేసేందుకు లీజుకిచ్చిన సైట్‌వి కాదన్నారు. ఇసుక ఎండిన తర్వాత వేరే ప్రాంతానికి తరలిస్తున్నామన్నారు. ఆ వివరాల్ని అఫిడవిట్‌ రూపంలో వేయాలని ఆదేశించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోస్వామి నేతృత్వంలోని ధర్మాసనం విచారణను దసరా సెలవుల తర్వాత చేపడతామని పేర్కొంది. కృష్ణా నదిలో పూడిక తీసిన ఇసుకను రాజధాని ప్రాంతం మందడం గ్రామ పరిధిలోని పది ఎకరాల్లో నిల్వ చేసేందుకు అధికారులు లీజు ప్రాతిపదికన అనుమతించడాన్ని సవాలు చేస్తూ రాజధాని రైతు పరిరక్షణ సమితి కోశాధికారి అనుమోలు గణేశ్‌ప్రసాద్‌ హైకోర్టులో పిల్‌ వేసిన విషయం తెలిసిందే.


బ్రాహ్మణ కార్పొరేషన్‌ను బీసీ సంక్షేమశాఖ

పరిధిలోకి తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తున్నాం

ఏపీ బ్రాహ్మణ చైతన్య వేదిక

ఈనాడు డిజిటల్‌, అమరావతి: బ్రాహ్మణ కార్పొరేషన్‌ను బీసీ సంక్షేమశాఖ పరిధిలోకి తెస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఏపీ బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్‌శర్మ పేర్కొన్నారు. దీనిపై రాష్ట్రంలోని 75 లక్షల బ్రాహ్మణ జనాభా నిరసన వ్యక్తం చేస్తోందన్నారు. విజయవాడలో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ‘అగ్రవర్ణాలు అంటే ఒక్క బ్రాహ్మణ జాతికి మాత్రమే వర్తిస్తుందా? మిగతా అగ్రవర్ణాలైన కాపు, కమ్మ, రెడ్డి, క్షత్రియ కార్పొరేషన్లను కూడా ఎందుకు బీసీ సంక్షేమశాఖ పరిధిలోకి తీసుకురాలేదు. బ్రాహ్మణ కార్పొరేషన్‌పై నిర్ణయాన్ని ముందుకు తీసుకెళితే మిగతా వాటిని కూడా మార్చాల్సిందే. లేదంటే బ్రాహ్మణ కార్పొరేషన్‌ కోసం ఇచ్చిన జీవోను రద్దు చేయాలి’ అని డిమాండ్‌ చేశారు.


ఏయూకి ఐఎస్‌ఓ గుర్తింపు

విశాఖ, న్యూస్‌టుడే: ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఐఎస్‌ఓ 9001-2015 గుర్తింపు లభించింది. విద్యాప్రమాణాలు, నాణ్యత, నిర్వహణ వంటి పలు అంశాలను ప్రాతిపదికగా తీసుకొని టీయూవీ ఎస్‌యూడీ సంస్థ    ఏయూకి ఐఎస్‌ఓ గుర్తింపును అందిస్తూ ధ్రువపత్రం జారీ చేసింది. 2024వ సంవత్సరం వరకు ఇది వర్తిస్తుంది. ఐఎస్‌ఓ 9001-2015 వల్ల ఏయూకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుందని వీసీ ఆచార్య ప్రసాదరెడ్డి తెలిపారు. శుక్రవారం ఉదయం ఈ ధ్రువపత్రాన్ని ఐక్యూఏసీ సమన్వయకర్త ఆచార్య లలిత భాస్కర్‌, ఏయూ రిజిస్ట్రార్‌ ఆచార్య కృష్ణమోహన్‌కు అందజేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని