బలవంతం లేదని కోర్టుకు చెబుతున్నారు

ప్రధానాంశాలు

బలవంతం లేదని కోర్టుకు చెబుతున్నారు

 క్షేత్రస్థాయిలో యాజమాన్యాలను ఒత్తిడి చేస్తున్నారు

 ఎయిడెడ్‌ విద్యాసంస్థల్లో అధికారుల తీరుపై హైకోర్టు ఆగ్రహం

 పాఠశాల విద్య సంచాలకుడు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశం

 కడప డీఈవో ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ అమలు నిలుపుదల

ఈనాడు, అమరావతి: ఎయిడెడ్‌ విద్యాసంస్థల్లో సిబ్బందిని ప్రభుత్వానికి స్వాధీనం చేయాలంటూ యాజమాన్యాలను అధికారులు ఒత్తిడి చేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సమ్మతించిన యాజమాన్యాల నుంచే స్వాధీనం చేసుకుంటున్నామని న్యాయస్థానానికి చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేరుగా ఉన్నట్లు స్పష్టమవుతోందని వ్యాఖ్యానించింది. బలవంతం లేదని కోర్టుకు చెబుతూ.. యాజమాన్యాలతో అధికారులు మరోలా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించింది. వారు తెలివిగా వ్యవహరిస్తే తాము మరింత తెలివిగా వ్యవహరిస్తామని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఎయిడెడ్‌ పాఠశాలల్లో పోస్టులను ప్రభుత్వానికి అప్పగించేలా యాజమాన్యాలను ఒప్పించాలని కడప జిల్లా డీఈవో దిగువ స్థాయి సిబ్బందికి ప్రొసీడింగ్స్‌ ఇవ్వడంపై మండిపడింది. ఆ ఉత్తర్వులను సస్పెండ్‌ చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని పాఠశాల విద్య సంచాలకుడు చినవీరభద్రుడ్ని ఆదేశించింది. యాజమాన్యాలను బలవంతం చేస్తున్న అధికారులపై ఏమి చర్యలు తీసుకున్నారో చెప్పాలని స్పష్టం చేసింది. విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోస్వామి, జస్టిస్‌ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.

ప్రైవేటు ఎయిడెడ్‌ విద్యాసంస్థలకు (పాఠశాలలు, జూనియర్‌, డిగ్రీ కళాశాలలు) ఆర్థిక సాయం నిలిపేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. వాటిని ప్రైవేటుగా నిర్వహించుకోవాలని, లేదంటే తమకు అప్పగించాలని కోరుతూ ఏపీ విద్యా చట్టానికి సవరణ చేస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ 12/2021, తదనంతరం ఆగస్టు 17న జారీచేసిన జీవో 50ని సవాలు చేస్తూ ‘శ్రీ సరస్వతి కమిటీ ఎయిడెడ్‌ అప్పర్‌ ప్రైమరీ పాఠశాల’ కరస్పాండెంట్‌ దాసరి వెంకట సుబ్బారావు, పలు ప్రైవేటు ఎయిడెడ్‌ పాఠశాలల యాజమాన్యాల ప్రతినిధులు, విద్యార్థులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది ఎన్‌.సుబ్బారావు వాదనలు వినిపిస్తూ.. ఎయిడెడ్‌ పోస్టులను ప్రభుత్వానికి అప్పగించాలని యాజమాన్యాలను విద్యాశాఖ అధికారులు ఒత్తిడి తెస్తున్నారన్నారు. ఈ వ్యవహారంపై కడప జిల్లా డీఈవో ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను కోర్టుకు అందజేశారు. దీనిపై విద్యాశాఖ ప్రభుత్వ న్యాయవాది(జీపీ) రఘువీర్‌ను ధర్మాసనం వివరణ కోరింది. తాము బలవంతం చేయడం లేదని, యాజమాన్యాలు అంగీకరిస్తేనే విద్యాసంస్థలు, సిబ్బందిని ప్రభుత్వ స్వాధీనంలోకి తీసుకుంటున్నామన్నారు. ఒత్తిడి చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. దీంతో... పాఠశాల విద్య సంచాలకులు స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది.


41ఏ నిబంధన పాటించండి

  అయ్యన్నపాత్రుడి విషయంలో పోలీసులకు హైకోర్టు ఆదేశం

గుంటూరు జిల్లా నకరికల్లు పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ మాజీ మంత్రి, తెదేపా సీనియర్‌ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు హైకోర్టులో వ్యాజ్యం వేశారు. జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌ శుక్రవారం ఈ వ్యాజ్యంపై విచారణ జరిపి.. సీఆర్‌పీసీ 41ఏ నిబంధనను పాటించాలని దర్యాప్తు అధికారిని ఆదేశించారు. 41ఏ ప్రకారం ముందుగా నోటీసు జారీ చేసి వివరణ తీసుకోవాలన్నారు. అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని అయ్యన్నపాత్రుడిపై కె.కోటేశ్వరరావు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని