డీజీపీ కార్యాలయం వైపు వెళ్లకుండా సర్వీసు రోడ్డు మూసివేత

ప్రధానాంశాలు

డీజీపీ కార్యాలయం వైపు వెళ్లకుండా సర్వీసు రోడ్డు మూసివేత

తెదేపా కేంద్ర కార్యాలయంవైపు నుంచి రాకుండా అడ్డుకట్ట

ఈనాడు, అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబు చేపట్టిన 36 గంటల నిరాహార దీక్ష సందర్భంగా మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయం నుంచి డీజీపీ కార్యాలయం వైపు వెళ్లటానికి వీల్లేకుండా రాకపోకల్ని పూర్తిగా నిలిపేశారు. రెండు రోజుల పాటు దీక్ష జరగ్గా ఆ సమయంలో ఒక్క వాహనం కూడా అటువైపు వెళ్లనీయకుండా సర్వీసు రోడ్డు మూసేశారు. బారికేడ్లు, స్టాపర్లను అక్కడ అడ్డం పెట్టారు. కాలినడకన వెళ్లే వారినీ అటువైపు అనుమతించలేదు. డీఎస్పీ, అదనపు ఎస్పీ స్థాయి అధికారులతో పాటు ఇతర సిబ్బందిని అక్కడ భారీగా మోహరించారు. తెదేపా కేంద్ర కార్యాలయం నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలన్నింటినీ డీజీపీ కార్యాలయం మీదుగా సర్వీసు రోడ్డులో కాకుండా జాతీయ రహదారి మీదుగా మళ్లించారు. ఈ నెల 19న తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి జరిగిన రోజున దాడికి పాల్పడిన వారు డీజీపీ కార్యాలయం మీదుగా సర్వీసు రోడ్డులోనే కార్లలో వస్తే కనీసం నిలువరించని పోలీసులు.. ఇప్పుడు డీజీపీ కార్యాలయం వైపు ఎవరూ వెళ్లకుండా బందోబస్తు ఏర్పాటు చేసుకున్నారని తెదేపా నేతలు విమర్శిస్తున్నారు. విజయవాడ వైపు నుంచి తెదేపా కేంద్ర కార్యాలయానికి వెళ్లాలంటే జాతీయ రహదారిపై నుంచి దిగి హ్యాపీ రిసార్ట్స్‌ సమీపంలో సర్వీసు రోడ్డులోకి వెళ్లి.. అక్కడి నుంచి అండర్‌పాస్‌లోకి ప్రవేశించి సర్వీసు రోడ్డులో విజయవాడ వైపు వెళ్లే దారిలోకి కొద్దిదూరం వెళ్లాలి. ఈ దారిపొడవునా కూడా భారీ సంఖ్యలో పోలీసుల్ని మోహరించారు. అండర్‌పాస్‌ దాటిన తర్వాత ద్విచక్ర వాహనాల్ని మినహా కార్లను తెదేపా కార్యాలయం వైపు పోలీసులు అనుమతించలేదు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని