ఇంటర్‌ అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ ఫలితాల విడుదల

ప్రధానాంశాలు

ఇంటర్‌ అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ ఫలితాల విడుదల

ఈనాడు, అమరావతి: ఇంటర్‌ మొదటి, రెండో ఏడాది అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ ఫలితాల్లో అందరూ ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలను ఇంటర్‌ విద్యామండలి కార్యదర్శి రామకృష్ణ శనివారం విడుదల చేశారు. కరోనా కారణంగా పరీక్షలను రద్దు చేసి, మొదటి ఏడాది విద్యార్థులందర్నీ ఉత్తీర్ణులు చేయగా.. రెండో ఏడాది వారికి మొదటి సంవత్సరంలో వచ్చిన మార్కులు 70శాతం, పదోతరగతి మార్కులు 30శాతంగా తీసుకొని కేటాయించారు. వీటిపై సంతృప్తి చెందని వారు అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ రాసుకునేందుకు అవకాశం కల్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,24,800మంది పరీక్షలకు హాజరు కాగా.. అందరూ ఉత్తీర్ణులైనట్లు ప్రకటించారు. రెండో ఏడాదికి సంబంధించి 14,950మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. గతేడాది మార్చిలో పరీక్ష ఫీజు చెల్లించిన వారికి ఈ పరీక్షల్లో మార్కులు పెరగకపోయినా గతంలో కేటాయించిన వాటినే ఇస్తారు. షార్ట్‌ మెమోలను 25 సాయంత్రం 5గంటల నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. పునఃలెక్కింపు, పరిశీలనకు నవంబరు 2లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పునఃలెక్కింపునకు ఒక్కో పేపర్‌కు రూ.260, పునఃపరిశీలన, స్కానింగ్‌ కాపీ ఇచ్చేందుకు ఒక్కో పేపర్‌కు రూ.1,300 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.

ఆన్‌లైన్‌ మూల్యాంకనం..: ఈ ఏడాది ప్రయోగాత్మకంగా ఆన్‌లైన్‌ మూల్యాంకనం నిర్వహించారు. వృత్తి విద్యా, కన్నడ, తమిళం ప్రశ్నపత్రాలను ఈ విధానంలో మూల్యాంకనం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జవాబు పత్రాలను విశాఖపట్నం, గుంటూరు, చిత్తూరుకు తరలించి, అక్కడ స్కానింగ్‌ చేశారు. స్కానింగ్‌ చేసిన జవాబు పత్రాలను మూల్యాంకనం చేసే వారికి ఆన్‌లైన్‌లో పంపించారు. ఇద్దరు లెక్చరర్లతో మూల్యాంకనం చేయించారు. వీరిద్దరూ ఇచ్చిన మార్కుల్లో 10శాతంపైగా వ్యత్యాసం వస్తే మూడో లెక్చరర్‌తో చేయించారు. వచ్చే ఏడాది నుంచి అన్ని జవాబుపత్రాలను ఆన్‌లైన్‌లోనే మూల్యాంకనం చేయనున్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని