కనీస టైంస్కేల్‌ అమలుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది

ప్రధానాంశాలు

కనీస టైంస్కేల్‌ అమలుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది

హేమచంద్రారెడ్డి, సతీష్‌చంద్రల వెల్లడి

ఈనాడు, అమరావతి: విశ్వవిద్యాలయాల అధ్యాపకులకు కనీస టైం స్కేల్‌ అమలు చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డి తెలిపారు. ఉన్నత విద్యామండలి కార్యాలయంలో శనివారం ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్రతో కలిసి విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ‘‘గత ప్రభుత్వమిచ్చిన ఉత్తర్వు అమలులో గందరగోళంతోనే ఈ జాప్యం జరుగుతోంది. 2015లో సవరించిన పే స్కేల్స్‌ ప్రకారం అధ్యాపకులకు కనీస టైం స్కేల్‌ ఇవ్వాలని 2019లో ఇచ్చిన ఉత్తర్వు-24లో చెప్పారు. వర్సిటీ ఉద్యోగులకు యూజీసీ స్కేల్‌ వర్తిసుంది. దీన్ని ఎలా వర్తింప చేయాలనే విషయంలో సందిగ్ధత నెలకొంది. ప్రస్తుత ప్రభుత్వం ఉత్తర్వు-40 తీసుకొచ్చి, ఒప్పంద ఉద్యోగుల గురించి ఆలోచిస్తోంది. మంత్రివర్గ ఉపసంఘమూ చర్చిస్తోంది. వర్సిటీల స్థాయిలో కనీస టైం స్కేల్‌ అమలు చేయడం లేదంటూ వస్తున్న వార్తలు అవాస్తవం. గతంలో వర్సిటీ నియామకాల్లో క్రమపద్ధతి పాటించలేదు. నియామకాల్లో ప్రభుత్వం, ఆర్థిక శాఖల అనుమతి లేకపోవడం, నోటిఫికేషన్‌ ఇవ్వకపోవడం లాంటివి ఉన్నాయి. ఒప్పంద అధ్యాపకులలో కొందరు మంజూరు పోస్టుల్లో, మరికొందరు సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సుల్లో పని చేస్తున్నారు. ఆదికవి నన్నయ్య, కాకినాడ, అనంతపురం జేఎన్‌టీయూల్లో ఉద్యోగులకు ఇప్పటికే రూ.39 వేలకు వేతనాలు పెంచాం’’ అని వివరించారు. సతీష్‌చంద్ర మాట్లాడుతూ... ‘‘సుప్రీంకోర్టు తీర్పు, 1994 చట్టం ప్రకారం ఒప్పంద అధ్యాపకులను క్రమబద్ధీకరించడం కుదరదు. కొందరు ఉద్యోగులు కోర్టుకు వెళ్లడంతోనే కనీస టైం స్కేల్‌పై నిర్ణయం తీసుకోలేకపోతున్నాం. ఎయిడెడ్‌ సిబ్బందిలో 300 మందే వర్సిటీలకు అర్హత కలిగి ఉన్నారు. వీరిని తీసుకున్నా ఒప్పంద అధ్యాపకులను తొలగించబోం’’ అని వెల్లడించారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని