కోర్టు ఉత్తర్వులంటే నవ్వులాటగా ఉందా?

ప్రధానాంశాలు

కోర్టు ఉత్తర్వులంటే నవ్వులాటగా ఉందా?

స్టే ఉన్నా అరెస్టు ఎలా చేస్తారు
పిడుగురాళ్ల ఇన్‌స్పెక్టర్‌కు హైకోర్టు నోటీసులు

ఈనాడు, అమరావతి: న్యాయస్థానం ఇచ్చిన స్టే ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ... తెలుగు యువత నేత దియ్యా రామకృష్ణ ప్రసాద్‌ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడంపై హైకోర్టు మండిపడింది. ‘కోర్టు ఆదేశాలంటే పోలీసులకు నవ్వులాటగా ఉందా? లెక్కలేకుండా పోయిందా?’ అని ఘాటుగా వ్యాఖ్యానించింది. ‘స్టే ఉత్తర్వులు ఉన్నా ఎలా అరెస్టు చేస్తారు. ఈ విషయం చాలా తీవ్రమైంది. బాధ్యులైన అధికారులు చట్టపరమైన చర్యలు ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉండాలి’ అని హెచ్చరించింది. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణ ఠాణా ఇన్‌స్పెక్టర్‌ కె.ప్రభార్‌రావు, ఎస్‌ఐలు సమీర్‌బాష, ఎం.పవన్‌కుమార్‌, ఎంవీ.చరణ్‌, ఏఎస్‌ఐ గౌరి, కానిస్టేబుల్‌ వెంకట్‌రెడ్డికి కోర్టు ధిక్కరణ నోటీసులు జారీచేసింది. విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌ శనివారం ఈమేరకు ఆదేశాలిచ్చారు. సామాజిక మాధ్యమంలో ఓ పోస్టును ఫార్వర్డ్‌ చేసినందుకు ఐపీసీ 153ఏ, 504, 505(2) సెక్షన్ల కింద పిడుగురాళ్ల పోలీసులు దియ్యా రామకృష్ణ ప్రసాద్‌పై కేసు నమోదు చేశారు. దాంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో సెక్షన్‌ 153ఏ వర్తించదని, పిటిషనర్‌ అరెస్టుతోపాటు పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌కు సంబంధించిన తదుపరి చర్యలన్నింటినీ నిలిపేస్తూ సెప్టెంబరు 1న న్యాయస్థానం ఉత్తర్వులు జారీచేసింది. అయితే... వాటిని ధిక్కరిస్తూ సెప్టెంబరు 5న సివిల్‌ డ్రస్‌లో ఉన్న పిడుగురాళ్ల ఠాణాకు చెందిన పోలీసులు తనను అక్రమంగా అరెస్టు చేశారంటూ రామకృష్ణ ప్రసాద్‌ హైకోర్టులో కోర్టుధిక్కరణ వ్యాజ్యం వేశారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు వాదనలు వినిపిస్తూ... హైకోర్టు స్టే ఉందని చెప్పినా, దస్త్రాలను పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా లక్ష్యపెట్టలేదన్నారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి... పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని