పడమటి గట్టూ.. కన్నీటి బొట్టు!

ప్రధానాంశాలు

పడమటి గట్టూ.. కన్నీటి బొట్టు!

  పోలవరం ముంపు గుప్పిట పశ్చిమ గోదావరి జిల్లా గ్రామాలు

ఈనాడు డిజిటల్‌- ఏలూరు, న్యూస్‌టుడే యంత్రాంగం: గోదావరి నీటిమట్టం పెరగడంతో నదీతీరం వెంబడి వేల కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లా వేలేరుపాడు, పోలవరం, కుక్కునూరు మండలాల్లోని 42 గ్రామాలు, 10 వేల కుటుంబాలపై వరద ప్రభావం చూపిస్తోంది. ఇందులో 2,500 కుటుంబాలు ఎత్తైన ప్రదేశాలకు తరలివెళ్లాయి. వేలేరుపాడు మండలం రేపాకగొమ్ము గ్రామంలో 800 కుటుంబాలున్నాయి. గోదావరి, శబరి నదుల సంగమంతో ఈ ఊరంతా జలదిగ్బంధంలో చిక్కుకుంది. దాదాపు 700 కుటుంబాలు ఖాళీచేసి కొండల్లోకి వెళ్లాయి. 20 కుటుంబాల వారు గాలిగుంపు ప్రాంతంలో ఖాళీ స్థలాలు అద్దెకు తీసుకుని మరీ సొంత ఖర్చులతో గుడిసెలు వేసుకున్నారు. ఇళ్ల నుంచి సామాన్లు తరలించేందుకు సొంతంగా వాహనాలు ఏర్పాటు చేసుకున్నారు. గుడిసెల నిర్మాణం, అద్దె, తరలింపునకు ఒక్కో కుటుంబానికి రూ.5 వేలకు పైగా ఖర్చయ్యాయి. అక్కడ విద్యుత్తు సదుపాయం లేదు. చుట్టూ నీరున్నా, తాగేందుకు చుక్కలేదు. పాములు సంచరిస్తున్నాయి. రాత్రివేళ దోమలు నిద్రపోనివ్వడం లేదు. లాంతర్లు కూడా లేక మంటలు వేసుకుని కాలం వెళ్లదీస్తున్నారు.

* దాచారం పునరావాస కాలనీల్లో 500 కుటుంబాలు ఉంటుండగా.. ప్రభుత్వం కుటుంబానికి 5 కిలోల బియ్యం, మంచినీళ్లు తప్ప మరేమీ ఇవ్వలేదని బాధితులు వాపోతున్నారు. గతంలో పునరావాస కాలనీల్లో అన్నం వండిపెట్టడంతోపాటు కనీస సౌకర్యాలు కల్పించేవారని గుర్తుచేశారు. నిర్వాసితులను క్షేమంగా బయటకు పంపించాల్సిన బాధ్యత అధికారులకు లేదా అంటూ పల్లపూరు, తల్లవరం, గాజులగొంది గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. పూర్తిస్థాయిలో ప్యాకేజీ అందించి, ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీల్లో వసతులు మెరుగుపరిచి అక్కడికి తరలించాలని కోరుతున్నారు. కరోనా కారణంగా సమీప గ్రామాల్లోనూ అద్దె ఇళ్లు దొరకడం లేదు. తాము తాత్కాలికంగా కొండ ప్రాంతాల్లో ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నా, పశువులు, మేకల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.


రేపాకగొమ్ముకు చెందిన బైరు లలిత పది రోజుల క్రితం ప్రసవించింది. నాలుగు రోజుల కిందట వరద పోటెత్తడంతో ఆ కుటుంబం గాలిగుంపు ప్రాంతంలో గుడిసె వేసుకుంది. బాలింతకు, పసిబిడ్డకు ఎలాంటి వైద్యం లేదు. ఇక్కడి వసతులపై ఆరా తీసేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు వచ్చిన దాఖలా లేదు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని