కొత్త అధ్యక్షుడి తీరని కోరిక!

ప్రధానాంశాలు

కొత్త అధ్యక్షుడి తీరని కోరిక!

మునుముందు ఎలా ఉంటుందోగాని... అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న జో బైడెన్‌ తొలిరోజే తన మనోభీష్టాన్ని వదలుకోవాల్సి వస్తోంది! ప్రమాణ స్వీకారానికి తనకలవాటైన... తనకిష్టమైన... దాదాపు 40 సంవత్సరాలపాటు రోజూ తాను ప్రయాణించిన.... రైలులో రావాలని నిర్ణయించుకున్నారు బైడెన్‌! తన సొంత ఊరైన డెలవర్‌ రాష్ట్రంలోని విల్‌మింగ్టన్‌ పట్టణం నుంచి వాషింగ్టన్‌లో ప్రమాణ స్వీకారానికి అమ్‌ట్రక్‌ (అమెరికా రైల్వే వ్యవస్థ) రైలులో ప్రయాణించాలనుకున్నారు. అందుకు ఏర్పాట్లు కూడా చకచకా జరిగిపోయాయి. కానీ...తీరా ముహూర్తం వేళకు భద్రతాబృందం నో చెప్పింది. కారణం- కొద్దిరోజుల కిందట క్యాపిటల్‌లో చోటు చేసుకున్న అరాచకమే!
* అమెరికా సెనెట్‌కు డెలవర్‌ రాష్ట్రం నుంచి సెనెటర్‌గా ఎన్నికైన తర్వాత 1972లో జో బైడెన్‌ జీవితం ఈ రైలుతో ముడిపడింది. అప్పుడే ప్రమాదంలో తన తొలి భార్య, కూతురు చనిపోయారు. దీంతో... ఇద్దరు అబ్బాయిలను చూసుకోవటం కోసం... వాషింగ్టన్‌ నుంచి రోజూ రైలెక్కి విలిమింగ్‌టన్‌కు వచ్చేవారు బైడెన్‌.
* ఇలా ఒకటికాదు రెండు కాదు... 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. చివరకు ఉపాధ్యక్షుడయ్యాక కూడా!
* అందుకే బైడెన్‌ను ‘అమ్‌ట్రక్‌ జో’ అని ఆటపట్టిస్తుంటారు కూడా!
* అంతేకాదు... 1987లో తొలిసారిగా అధ్యక్ష బరిలోకి దిగినప్పుడు కూడా బైడెన్‌ తన సొంతూరులోని రైల్వే స్టేషన్‌ నుంచే అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు.
* 2011లో ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు జో గౌరవార్థం-  విల్‌మింగ్టన్‌ స్టేషన్‌పేరును... జోసెఫ్‌ ఆర్‌ బైడెన్‌ జూనియర్‌ రైల్‌రోడ్‌ స్టేషన్‌’ అని మార్చింది అమ్‌ట్రక్‌.
‘‘అమ్‌ట్రక్‌ కేవలం ఒకచోటి నుంచి మరోచోటికి మమ్మల్ని చేరవేయటమేగాదు... పనుల్ని కూడా సాధ్యం చేస్తుంది. లేదంటే ఇలా ఉండేది కాదు. 36 సంవత్సరాల్లో ఎన్నో పుట్టినరోజు వేడుకలు చేసుకోవటానికి... రాత్రికల్లా ఇంటికి చేరుకొని పిల్లలకు కథలు చెప్పి నిద్రపుచ్చటానికి... ఇలా ఎన్నో ఎన్నెన్నో ఎంతో విలువైన అనుభూతుల్ని మిగిల్చింది అమ్‌ట్రక్‌! నా జీవితంలో ఎదురైన ఎన్నో సుఖాలు, కష్టాలకు సాక్షం ఈ రైలు... 2017లో ఉపాధ్యక్ష పదవి నుంచి దిగిపోయి ఇంటికి వస్తుంటే... లెక్కలు తీశారు... మొత్తం 20 లక్షల మైళ్ళు... 8200 రౌండ్ల ట్రిప్పులు ప్రయాణించానని’’ అని బైడెన్‌ తన అనుభూతుల్ని పంచుకున్నారు. సుమారు 40 సంవత్సరాలు నిరాటంకంగా రైల్లో తిరిగినా... అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించటానికి కూడా ఇందులోనే ప్రయాణించాలన్న కోరిక మాత్రం బైడెన్‌కు భద్రతా కారణాలతో తీరకుండా పోతోంది.

- ఈనాడు ప్రత్యేక విభాగంTags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని