కరోనాతో ఊపిరితిత్తులకు నష్టమెంత?

ప్రధానాంశాలు

కరోనాతో ఊపిరితిత్తులకు నష్టమెంత?

నిర్ధరణకు తెలుగు శాస్త్రవేత్తల సాఫ్ట్‌వేర్‌

బెంగళూరు: కరోనా కారణంగా ప్రధానంగా దెబ్బతినేది ఊపిరితిత్తులే. వీటికి ఏ మేరకు నష్టం జరిగిందనేది సిటీ స్కాన్‌, ఎక్స్‌-రేల ద్వారా తెలుసుకోవచ్చు. వీటికి తోడుగా కచ్చితత్వం కోసం ‘అనంనెట్‌’ పేరుతో కొత్త సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేశారు ఇద్దరు తెలుగు శాస్త్రవేత్తలు. బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ సంస్థలోని కంప్యుటేషనల్‌ అండ్‌ డాటా సైన్స్‌ విభాగంలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న యలవర్తి ఫణీంద్ర, అక్కడ పీహెచ్‌డీ చేస్తున్న పాలూరు నవీన్‌లు దీన్ని రూపొందించారు. ఇందుకు నార్వేలోని ఓస్లో విశ్వవిద్యాలయం ఆసుపత్రి, యూనివర్సిటీ ఆఫ్‌ అడ్గర్‌ల సహకారం తీసుకున్నారు. ఈ సాఫ్ట్‌వేర్‌ సిటీ స్కాన్‌లను అధ్యయనం చేసి ఊపిరితిత్తులకు ఏమేరకు నష్టం జరిగిందో, ఎక్కడ దెబ్బతిందో స్పష్టంగా తెలుపుతుంది. ఏవైనా అసహజ లక్షణాలు కనిపించినా వాటినీ గుర్తిస్తుంది. వైద్యులకు వెంటవెంటనే సమాచారం అందిస్తుంది. ‘‘అనంనెట్‌తో వైరస్‌ను, వ్యాధి తీవ్రతనూ అంచనా వేయవచ్చు. ఇతర ఆరోగ్యకరమైన భాగాలతో సరిపోల్చుతుంది. ఈ విశ్లేషణ పద్ధతిని అనంఫోరిక్‌ ఇమేజ్‌ ప్రాసెసింగ్‌ అంటారు’’ అని ఈ పరిశోధన పత్ర ప్రథమ రచయిత నవీన్‌ చెప్పారు. ఇలాంటి మరికొన్ని సాఫ్ట్‌వేర్‌లతో సరిపోల్చినప్పుడు దీంట్ల్లో సంక్ష్లిష్టతలు తక్కువగా ఉండడంతో వైద్యులకు ప్రయోజనకరం. సౌకర్యవంతమైనది కావడంతో ‘కొవ్‌సెగ్‌’ పేరుతో యాప్‌ కూడా అభివృద్ధి చేశామని, దీన్ని వైద్యులు తమ ఫోన్‌లోనే ఉపయోగించుకోవచ్చని వివరించారు. ప్రస్తుతం యునెట్‌ వంటి సాఫ్ట్‌వేర్‌లు అందుబాటులో ఉన్నా, దాన్ని ఉపయోగించడానికి ప్రత్యేకంగా పరికరం కావాల్సి  ఉంటుంది. అనంనెట్‌కు అలాంటి అవసరమేమీ లేదు. భవిష్యత్తులో న్యుమోనియా, ఫిబ్రోసిస్‌, లంగ్‌ క్యాన్సర్‌వంటి వ్యాధులను గుర్తించడానికి కూడా ఈ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసే ఆలోచన ఉందని ఫ్రొఫెసర్‌ యలవర్తి ఫణీంద్ర వెల్లడించారు. ఈ పరిశోధన ఫలితాలు ఐఈఈఈ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని