కాలేజీలున్నాయి.. అధ్యాపకులేరి?
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కాలేజీలున్నాయి.. అధ్యాపకులేరి?

రాష్ట్రంలో 81% ప్రైవేటు కళాశాలలే
అత్యధిక విద్యా సంస్థలున్న జిల్లాల్లో గుంటూరుకు తొమ్మిదో స్థానం
అఖిలభారత ఉన్నతవిద్య సర్వేలో వెల్లడి

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని ఉన్నత విద్యాసంస్థల్లో అధ్యాపకుల సంఖ్య తగ్గుతోంది. 2015-16లో 1,08,112 మంది అధ్యాపకులు ఉండగా.. 2019-20కి ఈ సంఖ్య 99,737 దిగువకు చేరింది. బోధన సిబ్బంది సంఖ్య తగ్గుతున్నా.. కళాశాలలు, విశ్వవిద్యాలయాల సంఖ్య పెరుగుతున్న విషయాన్ని అఖిలభారత ఉన్నతవిద్య సర్వే బహిర్గతం చేసింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ గురువారం ఈ నివేదికను విడుదల చేశారు. విశ్వవిద్యాలయాలు, డిగ్రీ, డిప్లొమా కళాశాలల్లో ఖాళీ పోస్టులు భర్తీకాకపోవడంతో ఈ సమస్య ఏర్పడుతోంది. 2015-16లో కళాశాలలు 2,532, అన్ని రకాల వర్సిటీలు కలిపి 28 ఉండగా.. గత విద్యా సంవత్సరానికి కళాశాలల సంఖ్య 2,750కి, వర్సిటీల సంఖ్య 41కి చేరింది. ప్రతి లక్ష మంది విద్యార్థులకు జాతీయస్థాయిలో సగటున 30 కళాశాలలు ఉండగా.. రాష్ట్రంలో 51 ఉన్నాయి. కర్ణాటక (59) తెలంగాణ (53) తర్వాత రాష్ట్రం మూడోస్థానంలో నిలిచింది. విద్యార్థుల ప్రవేశాలు మాత్రం అంత ఆశాజనకంగా లేవు. జాతీయస్థాయిలో సగటున కళాశాలకు 680 చొప్పున ప్రవేశాలు ఉండగా.. రాష్ట్రంలో సగటున 547 మాత్రమే ఉన్నాయి.

ప్రైవేటుదే హవా..
ఉన్నతవిద్యలో ప్రైవేటు విద్యాసంస్థలదే అగ్రస్థానం. జాతీయస్థాయిలో అత్యధిక ప్రైవేటు విద్యాసంస్థలున్న రాష్ట్రాల్లో ఏపీ మొదటి స్థానంలో ఉంది. జాతీయ సరాసరిన 78.6% ప్రైవేటు సంస్థలుండగా.. రాష్ట్రంలో ఇది 81%. తెలంగాణలో 80, ఉత్తర్‌ప్రదేశ్‌ 78.5, తమిళనాడులో 77.6% ఉన్నాయి. విద్యార్థుల చేరికలూ ప్రైవేటులోనే ఎక్కువ. ప్రైవేటులో 10,46,189, ఎయిడెడ్‌లో 1,43,701, ప్రభుత్వ విద్యా సంస్థల్లో 1,76,975 మంది ప్రవేశాలు పొందారు. అత్యధిక కళాశాలలున్న మొదటి పది జిల్లాల్లో గుంటూరు తొమ్మిదో స్థానంలో ఉంది. బెంగళూరులో అత్యధికంగా 1,009 విద్యాసంస్థలు ఉండగా.. గుంటూరులో 301 ఉన్నాయి. దేశంలో అత్యధిక కళాశాలలున్న జాబితాలో ఏపీ ఐదో స్థానంలో ఉంది.
యూజీతోనే చదువుకు స్వస్తి..
అండర్‌ గ్రాడ్యుయేషన్‌(యూజీ)తో చదువు నిలిపివేస్తున్న వారు ఎక్కువ. యూజీలో 13-14 లక్షల మంది చేరుతుండగా.. పీజీ, ఆపై చదివేవారు 3-4లక్షలకు మించడం లేదు. సాంకేతిక విద్యలో యూజీతో   వచ్చే ఉద్యోగాలతోనే స్థిరపడిపోతున్నారు. రాష్ట్రంలో అన్ని కోర్సుల్లో కలిపి 2019-20లో 18,97,149 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. వీరిలో ఎస్సీలు 3,16,573, ఎస్టీలు 88,231, బీసీలు 8,37,454, ముస్లింలు 61,295 మంది ఉన్నారు. రాష్ట్రంలో వివిధ కోర్సుల్లో 2,094 మంది విదేశీ విద్యార్థులు చదువుతున్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు