కని పెంచే దైవాలు

ప్రధానాంశాలు

కని పెంచే దైవాలు

పిల్లల భవిష్యత్తు కోసం జీవితమే త్యాగం

నేడు జాతీయ తల్లిదండ్రుల దినోత్సవం

- ఈనాడు, అమరావతి

హోటల్‌లో పనిచేసి... సోడాలు అమ్మి

ఆయన పెద్దగా చదువుకోలేదు. తన కుమారులను మాత్రం ఉన్నత స్థానాల్లో నిలబెట్టాలని నిర్ణయించుకున్నారు. ఆయన పడిన కష్టం చివరికి ఫలించింది. నూజివీడుకు చెందిన కొంపల్లి రామచంద్రరావు పేద బ్రాహ్మణుడు. రోజు వారీ కూలీగా, హోటళ్లలో పనిచేస్తూ.. అనేక కష్టాలు పడ్డారు. ముందుగా అర్చకుడిగా శిక్షణ పొంది.. వృత్తిలో స్థిరపడ్డారు. తర్వాత తన పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దడానికి ప్రయత్నించి.. భార్య అనంతలక్ష్మి సహకారంతో అనుకున్నది సాధించారు. తనకొచ్చే ఆదాయం చాలకపోవడంతో.. మరోవైపు సోడాలను అమ్మారు. కుమారుల చదువుల విషయంలో మాత్రం ఎక్కడా రాజీ పడలేదు. పెద్ద కుమారుడు శోభన్‌బాబు ఎంఫిల్‌ పూర్తిచేసి విక్రం సారాబాయి స్పేస్‌ సెంటర్‌లో శాస్త్రవేత్తగా చేరారు. రెండో కుమారుడు మహేష్‌శివప్రసాద్‌, మూడో కుమారుడు రాధాకృష్ణ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా స్థిరపడ్డారు. ‘మేము పడ్డ కష్టానికి ప్రతిఫలం మా బిడ్డలు సాధించిన కొలువులే. అందుకే అనుకున్నది సాధించామనే ఆనందంతో ప్రశాంత జీవితం గడుపుతున్నాం.’ అంటూ రామచంద్రరావు దంపతులు తెలిపారు.

కొడుకును శాస్త్రవేత్తని చేశారు..

వత్సవాయి మండలం మక్కపేటకు చెందిన నరుకుళ్ల నాగేశ్వరరావు, వెంకట్రావమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. దంపతులిద్దరూ నిరక్షరాస్యులు.. అయినా తమ పిల్లలను బాగా చదివించి ఉన్నత స్థానాల్లో నిలపాలనే లక్ష్యంతో ముందుకెళ్లారు. వీరి పెద్ద కుమారుడు వెంకటేశ్వరరావు ఎమ్మెస్సీ చదివి, ఫిజిక్స్‌(స్పెస్‌)లో పీహెచ్‌డీ పూర్తిచేసి ఇస్రోలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. రెండో కుమారుడు రమేష్‌ కెమిస్ట్రీలో ఇటీవలే పీహెచ్‌డీ పూర్తి చేశారు. కుమార్తె రమాదేవి బీఎస్సీ, బీఈడీ చేశారు. ‘మా చదువుల కోసం అమ్మ, నాన్న చేయని కష్టం లేదు. నాన్న తాపీ పని, అమ్మ వ్యవసాయకూలీగా పనిచేస్తూ డబ్బులు సమకూర్చారు. అవసరం అయినపుడు అప్పులు చేసి పంపారు. వారి రెక్కల కష్టంతోనే వాటిని తీర్చారు. వారిని జాగ్రత్తగా చూసుకునే సమయంలోనే గత నవంబరులో నాన్న అనారోగ్యంతో మృతి చెందారు. వారి త్యాగాల వల్లే మేము ఉన్నతంగా ఎదిగాం.’ అని ఇస్రో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న వెంకటేశ్వరరావు వివరించారు.

అమృతం తాగిన వాళ్లు దేవతలు, దేవుళ్లు..

అది కన్నబిడ్డలకు పంచేవాళ్లు అమ్మానాన్నలు.. అన్నాడో సినీకవి..

దేవుళ్ల కంటే తల్లిదండ్రులే గొప్పవాళ్లు అనేది అక్షర సత్యం.. పిల్లల కోసం వారు ఏ త్యాగానికైనా వెనుకాడరు. బిడ్డల భవిష్యత్తు బాగుండాలని.. రాత్రీపగలు కష్టపడుతుంటారు. ఒక వైపు కుటుంబ భారాన్ని మోస్తూనే.. పిల్లల భవిష్యత్తుకు బాటలు వేస్తుంటారు. ప్రస్తుత జీవనశైలిలో చాలామంది తల్లిదండ్రులకు వారి పిల్లలతో గడిపే సమయం కూడా దొరకని పరిస్థితి ఉంటోంది. కొంతమంది మాత్రం తాము చేస్తున్న కొలువులు, వ్యాపారాలను వదులుకుని మరీ పిల్లల వెన్నంటే ఉంటున్నారు. విద్యాకేంద్రంగా ఉన్న కృష్ణా జిల్లాలో ఏటా పదో తరగతి లోపు ఆరు లక్షల మంది, ఇంటర్‌, డిగ్రీ, ఇంజినీరింగ్‌, పీజీ విద్యార్థులు మరో రెండు లక్షల మంది ఉన్నారు. వీరందరి చదువుల కోసం ఏటా కోట్లాది రూపాయలను తల్లిదండ్రులు వెచ్చిస్తున్నారు. కొంతమంది పిల్లల కోసమే ప్రత్యేకంగా విజయవాడ వచ్చి ఉంటున్నారు. వారిని దగ్గరుండి చూసుకునేందుకు.. తల్లిదండ్రుల్లో ఒకరు కొలువు, వృత్తి, వ్యాపారాలను వదిలేసి మరీ వస్తున్నారు. జాతీయ తల్లిదండ్రుల దినోత్సవం సందర్భంగా ఆదర్శంగా నిలుస్తున్న తల్లిదండ్రులపై కథనమిది.

కోమాలో ఉన్నా కంటికి రెప్పలా చూసుకుంటూ..

ఆ తల్లిదండ్రులకు అతడు ఒక్కగానొక్క కొడుకు. అల్లారు ముద్దుగా పెంచారు. ఎంబీఏ చదివి, హైదరాబాద్‌లోని టీసీఎస్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. అంతా బాగుందనుకున్న సమయంలో సెలవులకు స్వగ్రామమైన హనుమాన్‌జంక్షన్‌ వచ్చాడు. తిరిగి హైదరాబాద్‌ వెళుతుండగా ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిపోయాడు. వైద్యులు ఇక లాభం లేదని తేల్చేశారు. అయినా పేగుబంధం మీద ఆశతో నాలుగేళ్లుగా కుమారుడ్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు హనుమాన్‌జంక్షన్‌కు చెందిన ఎరువుల వ్యాపారి కాకుల రంగారావు, శ్రీదేవి దంపతులు. జీవచ్ఛవంలా ఉన్న కుమారుడు నాగవెంకటరాజీవ్‌(28)ను హైదరాబాద్‌లో ఓ ఇంటిని తీసుకుని ఉంచి అపురూపంగా చూసుకుంటున్నారు. ఎప్పటికైనా తమ బిడ్డ మామూలు మనిషిగా అవుతాడనే నమ్మకంతో పగలూ, రాత్రి సేవలు చేస్తూ ఎంతో ఆశగా జీవనం వెళ్లదీస్తున్నారు.

పేగు బంధాన్ని మించింది లేదు

తమకు వారసుడు జన్మించాడని ఆ దంపతులు ఎంతో సంతోషించారు. ఆ తర్వాత ఉన్నట్టుండి కుమారుడి శరీరంలో పెను మార్పులు వచ్చాయి. 25ఏళ్లు వచ్చినా.. పసి బిడ్డను చూసుకుంటున్నట్లుగా చూస్తున్నారు.. పామర్రుకి చెందిన కొర్రపాటి రామారావు, కృష్ణకుమారి దంపతులు. వీరికి 1996లో మోహన సాయి జన్మించాడు. రెండేళ్ల తర్వాత ఒకరోజు కుమారుడికి హై ఫీవర్‌ వచ్చింది. నరాలు బలహీన పడిపోయి కదలలేని స్థితిలోకి వెళ్లిపోయాడు.ఎంతోమందికి వైద్యులకు చూపించి మందులు వాడినా ఫలితంలేదు. 25 ఏళ్లు వచ్చినా మోహన్‌సాయి మంచం మీద నుంచి కదలేని పరిస్థితి. అన్నీ తల్లిదండ్రులే చూస్తున్నారు. బంధువుల ఇళ్లలో శుభకార్యాలకు వెళ్లాల్సి వచ్చినా.. కచ్చితంగా ఒకరు కుమారుడి వద్ద ఉండాల్సిందే. తండ్రి ఉపాధ్యాయుడు కావడంతో పాఠశాలకు వెళ్లేలోపు స్నానం, తదితర పనులు చేస్తున్నారు. సాయంత్రం వరకు తల్లే ప్రేమతో సాకుతోంది. పేగుబంధం మించినది మరొకటి లేదని వారు చెబుతున్నారు.

 


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని