కంటికి రెప్పలా.. కన్నవారి ఆసరా

ప్రధానాంశాలు

కంటికి రెప్పలా.. కన్నవారి ఆసరా

బుద్ధిమాంద్యం పిల్లల ఎదుగుదల కోసం తపన

బిడ్డల తోడిదే లోకంగా జీవితం

నేడు తల్లిదండ్రుల దినోత్సవం

బిడ్డ పుడుతుందంటే ఎన్నో కలలు. వాళ్లెలా ఉంటారోనన్న ఊహలు, ఇలా ఉంటే బాగుంటుందంటూ ఆశలు.. ప్రతి తల్లిదండ్రికీ సహజం. కానీ ఆ బిడ్డ బుద్ధిమాంద్యంతో పుడితే, అందరు పిల్లల్లాగా మాట్లాడలేరని, ఆటలాడలేరని తెలిస్తే.. ఆ అమ్మానాన్నల ఆవేదన ఊహించలేం. ఆ బాధను అణుచుకుంటూ.. మిగిలినవారితో సమానంగా తమ బిడ్డను నిలబెట్టాలన్న తపనతో వారు అనుక్షణం ప్రయత్నిస్తున్నారు. పిల్లల బంగారు భవిష్యత్తు కోసం అహరహం శ్రమిస్తున్న ఇలాంటి కొందరు తల్లిదండ్రుల గురించి.. తల్లిదండ్రుల దినోత్సవ వేళ ప్రత్యేక కథనం.


ఆటిజంపై ‘ఆరంభ్‌’

‘మా అమ్మాయి సింధుకు పుట్టుకతోనే ఆటిజం సమస్య ఉందని తెలిసింది. స్థానికంగా ఉన్న మానసిక దివ్యాంగుల పాఠశాలలో చేర్పించినా పాపలో పెద్దగా మార్పు కనిపించలేదు. దిల్లీలో యాక్షన్‌ ఫర్‌ ఆటిజం అనే సంస్థ.. ఇలాంటి చిన్నారులకు ప్రత్యేక శిక్షణ ఇస్తుందని తెలిసి అక్కడికి వెళ్లడానికి సిద్ధమయ్యాం. అమలాపురం సమీపంలోని నగరం గ్రామంలో కార్పొరేషన్‌ బ్యాంకులో పనిచేసేవాణ్ని. పాప పరిస్థితిని ఉన్నతాధికారులకు చెప్పి, దిల్లీకి బదిలీ అయ్యాను. యాక్షన్‌ ఫర్‌ ఆటిజంలో పాపను చేర్చాను. అక్కడ చిన్నారుల తల్లిదండ్రులకు శిక్షణ ఇస్తారనడంతో నా భార్య శారదను ఏడాది కోర్సులో చేర్పించాను. మూడేళ్లు దిల్లీలో ఉన్నాక సింధులో కొంత మార్పు కనిపించడంతో తిరిగివచ్చేశాం. స్వచ్ఛంద పదవీ విరమణ చేయగా వచ్చిన డబ్బుతో రాజమహేంద్రవరం సమీపంలోని పుణ్యక్షేత్రం గ్రామంలో ఓ భవనం నిర్మించి ‘ఆరంభ్‌’ ఆటిజం సెంటర్‌ ఏర్పాటు చేశాం. దాతలు, చిన్నారుల తల్లిదండ్రుల సహకారంతో 25 మందికి అన్ని రకాల చికిత్సలు అందిస్తున్నాం.

-జక్కిలింకి శ్రీరామ్‌, రాజమహేంద్రవరం


కూతురి ‘శ్రేయ’స్సు కోసం..

పాతపట్నం, న్యూస్‌టుడే: ‘మా అమ్మాయి శ్రేయ మిశ్రోకు బుద్ధి మాంద్యం ఉందని తెలియగానే ఎన్నో ఆస్పత్రుల్లో చూపించాం. మిగిలిన పిల్లలతో మమేకమైతే బాగవుతుందేమోనని ఒడిశాలోని పర్లాఖెముండిలోని సెయింట్‌ జోసఫ్‌ పాఠశాలలో చేర్పించాం. పాప కాస్త మెరుగుపడింది. ఎనిమిదో తరగతి వరకు చదివించాం. ఇంట్లో ఒంటరిగా ఉంచడం ఎందుకని నృత్యం నేర్పించాం. కొవిడ్‌ నేపథ్యంలో ఇంట్లో ఉంటూనే ఆన్‌లైన్‌ ద్వారా శిక్షణ తరగతులకు హాజరవుతోంది. పాఠశాల స్థాయిలో నిర్వహించిన వార్షికోత్సవాల్లో ఉత్తమ ప్రతిభ చూపి బహుమతులు గెలుచుకుంది. నేను ఐసీడీఎస్‌లో కంప్యూటర్‌ విభాగంలో ఉద్యోగిని. నా భర్త శివప్రసాద్‌ ఒడిశాలో ఉపాధ్యాయుడు. శ్రేయను చూసుకోవడానికి ఇబ్బందవుతుందని ఇద్దరం ఉద్యోగాలు వదిలేశాం. 

 

- పద్మావతి మహపాత్రో, పాతపట్నం


పిల్లాడి కోసం ఆయాగా మారా

‘నా కుమారుడు వంశీకి పుట్టుకతోనే బుద్ధిమాంద్యం సమస్య వచ్చింది. సొంతంగా ఏ పనీ చేసుకోలేడు. మందులు వాడినా ప్రయోజనం ఉండదని, మానసిక వికలాంగుల పాఠశాలలో చేర్పిస్తే తెలివితేటలు స్వల్పంగా పెరిగే అవకాశాలుంటాయని చెప్పారు. దీంతో విశాఖలోని హిడెన్‌స్ప్రౌట్స్‌ మానసిక వికలాంగుల పాఠశాలలో చేర్పించాను. నా కుమారుడితోపాటు అలాంటి వారి ఆలనాపాలనా చూసినట్లు ఉంటుందని ఆ స్కూల్లోనే ఆయాగా చేరి, పద్నాలుగేళ్లుగా పని చేస్తున్నా. నా కుమారుడికి 18ఏళ్లు వచ్చాయి. కాస్త మెరుగయ్యాడు. మిగిలిన పిల్లలతో కలిసి నా బిడ్డ అక్కడ ఆనందంగా ఆడుకుంటుంటే మనస్సు సంతోషంతో నిండిపోతుంది.

- భారతి, పూర్ణామార్కెట్‌, విశాఖపట్నం


22 ఏళ్లుగా శ్రమిస్తున్నాం..

నరసరావుపేట పట్టణం, న్యూస్‌టుడే: ‘ఆడపిల్ల పుట్టగానే సంబరపడ్డాం. తర్వాత కొద్ది రోజులకే పాప సాయిప్రజ్ఞకు జన్యుపరమైన సమస్య ఉందని తెలిసింది. పాపను గట్టిగా పట్టుకున్నా ఎముకలు విరిగిపోతాయని వైద్యులు చెప్పారు. మొదట్లో కొంత ఆందోళనకు గురైనా ఆ తర్వాత ధైర్యాన్ని తెచ్చుకున్నాం. ఇద్దరు ఉద్యోగాలు చేస్తే పాపను చూసుకోవడం కష్టమని భావించి నా భార్య జ్యోత్స్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాన్ని వదిలేసింది. పాపను నడిపించాలనే ఉద్దేశంతో ఎంతోమంది వైద్యుల దగ్గరకు తీసుకెళ్లాం. ఎన్ని శస్త్రచికిత్సలు చేయించినా ఫలితం కనిపించలేదు. చక్రాల కుర్చీలో తీసుకెళ్లి చదువు చెప్పించాం. తను బాగా చదివి బీటెక్‌ పూర్తి చేసింది. ఉన్నత చదువులు చదవాలనే లక్ష్యంతో గేట్‌ ద్వారా తిరుపతి ఐఐటీలో ఎంటెక్‌  సీటు సాధించింది. మా పాపను ఉన్నత స్థానంలో నిలబెట్టాలనే లక్ష్యంతో 22 ఏళ్లుగా శ్రమిస్తున్నాం.

- రమణారావు, డీఈఈ,
లింగంగుంట్ల ఎన్నెస్పీ సర్కిల్‌ కార్యాలయం


మా బిడ్డలాంటి వారి కోసం పాఠశాల

విజయవాడ (పటమట), న్యూస్‌టుడే: ‘మా అబ్బాయి శిశిర్‌కు మూడేళ్లు గడిచేసరికి తనలో మానసికంగా ఎదుగుదల లేదని గుర్తించాం. హైదరాబాద్‌లోని ఓ మానసిక వికలాంగ పాఠశాలలో చేర్పించినా లాభం లేకపోయింది. హోమియోపతి ఫిజీషియన్‌ అయిన నా భార్య సింధు ఇంటి దగ్గరే శిశిర్‌కు శిక్షణ ఇవ్వడం ప్రారంభించింది. ఇలాంటి పిల్లలతో ఎలాంటి సమస్యలొస్తాయి? వారికి ఎలా తర్ఫీదు ఇవ్వాలో తెలుసుకుంది. ఆ అనుభవం, మానసిక వికలాంగుడైన మా బిడ్డలాంటి మరికొందరికి ఆసరాగా నిలవాలనే ఉద్దేశంతో హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డులో అభయ కేర్‌ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశాం. దీని ఆధ్వర్యంలో ఆటిజం రీసెర్చ్‌ అండ్‌ మల్టీ డిసిప్లినరీ స్కూల్‌ను 2011లో స్థాపించాం. పిల్లలకు ప్రత్యేక విద్యతోపాటు వారి పనులు వారే చేసుకునేలా తర్ఫీదు ఇస్తున్నాం. 2014లో విజయవాడలో మరో పాఠశాలను ఏర్పాటు చేశాం.

- వల్లభనేని వెంకట కృష్ణకుమార్‌, విజయవాడ
ఈనాడు- అమరావతి, ఈనాడు డిజిటల్‌ - రాజమహేంద్రవరం


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని