కూరగాయలు, పండ్లలోని పదార్థాలతో క్యాన్సర్లకు కొత్త ఔషధాలు

ప్రధానాంశాలు

కూరగాయలు, పండ్లలోని పదార్థాలతో క్యాన్సర్లకు కొత్త ఔషధాలు

పరిశోధనలో ఎస్‌వీయూ శాస్త్రవేత్తలు

మాస్కో: కూరగాయలు, పండ్లలో ఉండే పదార్థాలతో క్యాన్సర్‌కు కళ్లెం వేయవచ్చని భారత్‌, రష్యా, చైనా శాస్త్రవేత్తలు గుర్తించారు. తద్వారా ఈ వ్యాధికి సమర్థమైన కొత్త ఔషధాల తయారీకి బాటలు వేశారు. ఈ పరిశోధనలో ఆంధ్రప్రదేశ్‌లోని ఎస్‌వీ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కూడా పాలుపంచుకున్నారు. కూరగాయలు, పండ్లలో 30 రకాల పదార్థాలను శాస్త్రవేత్తలు ఎంపిక చేసుకొని.. కంప్యూటర్‌ మోడలింగ్‌ సాయంతో వాటిపై వరుసగా అనేక ప్రయోగాలు నిర్వహించారు. కణాల్లోని ప్రొటీన్లపై ఇవి ఎలా ప్రభావం చూపుతాయన్నది పరిశీలించారు. ‘‘కణితులను మాత్రమే లక్ష్యంగా చేసుకొనే కొత్త ఔషధాలను తయారుచేయాలంటే.. క్యాన్సర్‌ నివారణ, చికిత్సలో ఈ ఆహార పదార్థాలు ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది గుర్తించడం చాలా అవసరం. పరమాణు వ్యవస్థల నమూనాలను నిర్మించడం ద్వారా.. కొన్ని రకాల పదార్థాలు ప్రొటీన్లకు ఎలా అతుక్కుంటున్నాయన్నది పరిశీలించాం. తద్వారా కొత్త మందులతో దాడి చేయడానికి అనువైన భాగాలను గుర్తించాం’’ అని పరిశోధనలో పాల్గొన్న గ్రిగోరి జిర్యానోవ్‌ చెప్పారు. క్యాన్సర్‌ నిరోధక సామర్థ్య పదార్థాలు బ్రకోలీ, క్యాబేజీ, క్యాలీఫ్లవర్‌, క్యారెట్లు, లెటూస్‌, టమోటా, బచ్చలి వంటివాటిలో ఉన్నట్లు తెలిపారు. సహజసిద్ధ ఆల్కలాయిడ్లు, మోనోటెర్పీన్లు, ఆర్గానోసల్ఫైడ్లు, కెరోటినాయిడ్లు, ఫ్లేవనాయిడ్లు, ఫెనోలిక్‌ ఆమ్లాలు, స్టిల్‌బెన్‌లు, ఐసోఫ్లేవోన్లు కూడా క్యాన్సర్‌ నివారణ, చికిత్సకు దోహదపడతాయని గుర్తించారు. నిర్దిష్ట రకం క్యాన్సర్ల చికిత్సకు ప్రత్యేకంగా సహజసిద్ధ పదార్థం లేదా మిశ్రమం అవసరమని శాస్త్రవేత్తలు తేల్చారు. ఉదాహరణకు ఇండోల్‌-3-కార్బినాల్‌కు రొమ్ము, పెద్దపేగు, వంటి భాగాల్లో వచ్చే క్యాన్సర్‌ను నిరోధించే సామర్థ్యం ఉందని వెల్లడైంది. శరీరంలో ఇతర భాగాలపై దుష్ప్రభావాలు కలగకుండా క్యాన్సర్‌ కణాలను లక్ష్యంగా చేసుకునే సమర్థ  ఔషధాల వృద్ధికి ఈ పరిశోధన దోహదపడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని