పుట్టెడు కష్టాల్లో పురుడు!

ప్రధానాంశాలు

పుట్టెడు కష్టాల్లో పురుడు!

జోరుగా వర్షం, ఆ చినుకులకు తడిసిన కొండ ప్రాంతం.. కాలు పెడితే జారిపోయే సన్నటి దారి.. ఇక్కడ సాధారణంగా ఒక వ్యక్తి అడుగు తీసి అడుగు వేయడమే గగనం. అలాంటిది పురిటి నొప్పులతో బాధపడుతున్న నిండు చూలాలు విధిలేని పరిస్థితుల్లో కుటుంబ సభ్యులతో కలిసి దవాఖానా దారి పట్టింది. మార్గమధ్యంలోనే ప్రసవ వేదన ఎక్కువై మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ నొప్పులన్నీ పంటి బిగువున భరించిన పచ్చి బాలింత ఆ స్థితిలోనూ వాగుపై ఉన్న కర్రల వంతెనను దాటి అంబులెన్సు వద్దకు చేరింది. ఇది సినిమా కథ కాదు.. విశాఖ మన్యంలో ఓ మాతృమూర్తి ఎదుర్కొన్న కష్టం. జి.మాడుగుల మండలం పెదలోచలి పంచాయతీ చిన్నసంఘం గ్రామానికి చెందిన నిండు గర్భిణి గొల్లోరి కాంతమ్మకు మంగళవారం సాయంత్రం పురిటినొప్పులు వచ్చాయి. గ్రామానికి రోడ్డు లేకపోవడం, ఆ సమయానికి వర్షం పడుతుండటంతో ఆమెను తరలించేందుకు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. ఫీడర్‌ అంబులెన్సు వచ్చేలోగా కొద్ది దూరమైనా వెళ్తామని ఆమెను నడిపించుకుంటూ బయలుదేరారు. కానీ దారి మధ్యలోనే మగబిడ్డకు జన్మనిచ్చింది. అప్పటికీ అంబులెన్సు వద్దకు చేరాలంటే ఇంకా ఓ వాగు దాటాల్సి ఉంది. ఇందుకు ఒక కర్రల వంతెనే ఆధారం. దీంతో కుటుంబ సభ్యులు పచ్చి బాలింతను కర్రల మీదుగా నెమ్మదిగా నడిపిస్తూ వాగు దాటించారు. ఇలా ఎంతో కష్టపడి బైక్‌ అంబులెన్సు వద్దకు చేరగా ఆరోగ్య సిబ్బంది ఆమెను జి.మాడుగుల ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు.

- జి.మాడుగుల, న్యూస్‌టుడే


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని