మహిళల ఆత్మ గౌరవానికి భంగం

ప్రధానాంశాలు

మహిళల ఆత్మ గౌరవానికి భంగం

ఈ తరహా నేరాల్లో ఏపీది దేశంలో మొదటి స్థానం
పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల్లో రెండో స్థానం..
స్త్రీలపై జరిగిన మొత్తం నేరాల్లో మాత్రం స్వల్ప తగ్గుదల
మహిళలపై అత్యధిక నేరాలు జరిగిన రాష్ట్రాల్లో ఎనిమిదో స్థానానికి
ఈనాడు - అమరావతి

ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై దాడులు, లైంగిక వేధింపులు, అత్యాచారాలు, వారి ఆత్మగౌరవానికి భంగం కలిగించే ఘటనలు పెరిగాయి. స్త్రీలపై జరిగిన మొత్తం నేరాల్లో స్వల్ప తగ్గుదల ఉన్నా, వారిపై భౌతిక దాడుల నేరాలు అదుపులోకి రాకపోవడం కలవరపరుస్తోంది. మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించే ఘటనల్లో ఏపీ దేశంలో మొదటి స్థానంలో ఉండటం, గతేడాది దేశవ్యాప్తంగా జరిగిన ఈ తరహా ఘటనల్లో 33.14% మన రాష్ట్రంలోనే నమోదవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ కేసులు 2019లో 1,892 నమోదు కాగా... 2020లో ఆ సంఖ్య 2,342కు పెరిగింది. ఏడాది వ్యవధిలో 23.78 శాతం మేర అధికమయ్యాయి.

* పని ప్రదేశాల్లో మహిళలను లైంగికంగా వేధించడం, స్త్రీలను రహస్యంగా చిత్రీకరించటం (వోయిరిజం) నేరాల్లో ఆంధ్రప్రదేశ్‌ దేశంలో రెండో స్థానంలో ఉంది. 2020 సంవత్సరానికి సంబంధించి జాతీయ నేర గణాంక సంస్థ తాజాగా విడుదల చేసిన వార్షిక నివేదిక ఈ వివరాలు వెల్లడించింది.


* ఏపీలో మహిళలపై 2019లో 17,746, 2020లో 17,089 నేరాలు జరిగాయి. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే గతేడాది   3.70 శాతం మేర తగ్గాయి. ఈ తరహా నేరాలు అత్యధికంగా జరిగిన రాష్ట్రాల జాబితాలో 2019లో పదో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ 2020లో ఎనిమిదో స్థానానికి వెళ్లింది.


* పని ప్రదేశాల్లో మహిళల్ని లైంగికంగా వేధించిన ఘటనల్లో హిమాచల్‌ప్రదేశ్‌ (72 కేసులు) దేశంలో మొదటిస్థానంలో ఉండగా.. 70 కేసులతో ఏపీ రెండో స్థానంలో ఉంది.


* స్త్రీలను రహస్యంగా చిత్రీకరించిన ఘటనలు అత్యధికంగా చోటుచేసుకున్న రాష్ట్రాల జాబితాలో ఏపీది రెండో స్థానం. మహారాష్ట్రలో ఈ తరహా కేసులు 201 నమోదు కాగా.. ఏపీలో 124 కేసులు పెట్టారు.


పరిచయస్తులే అత్యాచార నిందితులు

రాష్ట్రంలో 1,095 అత్యాచార ఘటనలు జరగ్గా.. అందులో 1,088 ఘటనల్లో ఈ నేరాలకు పాల్పడ్డది బాధితులకు పరిచయస్తులే. 91 ఘటనల్లో బాధితుల కుటుంబసభ్యులే నిందితులు. 997 ఘటనల్లో స్నేహితులు, ఆన్‌లైన్‌ ఫ్రెండ్స్‌, ఇరుగుపొరుగువారి ప్రమేయం ఉంది. అత్యాచారాలు 0.82% పెరిగాయి.

సైబర్‌, చిన్నారులపై నేరాల్లో పెరుగుదల

రాష్ట్రంలో 2019తో పోలిస్తే 2020లో సైబర్‌ నేరాలు, చిన్నారులపై జరిగిన నేరాలు కొంత పెరిగాయి. రోడ్డుప్రమాదాలు 14,700 నుంచి 12,830కు తగ్గాయి. అపహరణ కేసులు 902 నుంచి 737కు తగ్గాయి.

పోలీసులపై కేసుల్లో మూడోస్థానం

పోలీసులే పలు కేసుల్లో నిందితులవుతున్నారు. దేశవ్యాప్తంగా వారిపై అత్యధికంగా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ది మూడో స్థానం. అస్సాం (2,179), మహారాష్ట్ర (407) తర్వాత 261 కేసులతో ఆంధ్రప్రదేశ్‌ నిలిచింది. ఆయా ఘటనలపై అభియోగపత్రాల దాఖలులో దర్యాప్తు అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. ఏపీలో 70 (26.81%) కేసుల్లోనే అభియోగపత్రాలు దాఖలుచేశారు. మరో 10 కేసుల్ని ప్రాథమిక దశలోనే న్యాయస్థానాలు కొట్టేశాయి. 17 కేసుల్లో తుది నివేదికలు దాఖలు చేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని