రాజద్రోహం పద్దులో హక్కుల హననం
close

సంపాదకీయం

రాజద్రోహం పద్దులో హక్కుల హననం

పెచ్చరిల్లుతున్న చట్టాల దుర్వినియోగం

భారత రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛ పరిధి చాలా విశాలమైంది. అసమ్మతిని వ్యక్తీకరించడానికి; ప్రభుత్వ చర్యలు, విధానాలను నిరసిస్తూ ప్రదర్శనలు నిర్వహించడానికి ప్రజలకు ఈ ప్రాథమిక హక్కు స్వేచ్ఛ ఇస్తోంది. ఈ హక్కు లేకపోతే నిరంకుశత్వం రాజ్యమేలుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ, చట్టసభల అధికార దుర్వినియోగం నుంచి పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడే బాధ్యతను రాజ్యాంగం న్యాయస్థానాలకు కట్టబెట్టింది. పాలన, న్యాయ, శాసన వ్యవస్థలు అన్నీ రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సిందే. కానీ, కొన్నేళ్లుగా ప్రభుత్వ విధానాలను శాంతియుతంగా వ్యతిరేకిస్తున్న పౌర సంఘాలు, సామాజిక కార్యకర్తలు, మేధావుల నోరు నొక్కడానికి చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారు. ఉద్యమకారులను రాజద్రోహులుగా చిత్రిస్తూ ఐపీసీ 124 ఏ సెక్షన్‌ కింద కేసులు పెడుతున్నారు. 1967నాటి చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(ఉపా) కింద ఉగ్రవాదులుగా ముద్ర వేస్తున్నారు. ‘ఉపా’ ఎంతటి తిరోగమన శాసనమో ఇటీవల జ్యుడీషియల్‌ కస్టడీలో చోటుచేసుకున్న ఫాదర్‌  స్టాన్‌ స్వామి మరణం చాటిచెప్పింది. 84 ఏళ్ల స్టాన్‌ స్వామి అనేక వ్యాధులతో బాధపడేవారు. అయినా వైద్య కారణాలపై తాత్కాలిక బెయిలు ఇవ్వడానికి బాంబే హైకోర్టు, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ప్రత్యేక న్యాయస్థానం నిరాకరించాయి. ‘ఉపా’ కింద ఆరోపణకు గురైన వ్యక్తికి బెయిలు రావడం అసాధ్యమని స్వామి ఉదంతం నిరూపిస్తోంది. అసలు ఏ వ్యక్తినైనా సరే ఉగ్రవాదిగా ఆరోపించడానికి ఈ చట్టంలోని 35వ సెక్షన్‌ ప్రభుత్వానికి అపరిమిత అధికారమిస్తోంది. దీనిపై ఎలాంటి నియంత్రణలు, సమతుల్యపరచే నిబంధనలు లేవు. ఏ నిర్నిబంధ అధికారమైనా మన ప్రజాస్వామ్య పునాదులను దెబ్బతీస్తుందని గ్రహించి- సుప్రీంకోర్టు బెయిలు మంజూరుపై గతంలో విధించిన నిషేధాన్ని ఎత్తివేసే విషయాన్ని పరిశీలించాలి.

అక్రమ కేసులు

జాతీయ నేర గణాంకాల సంస్థ రికార్డుల ప్రకారం  2016-19 మధ్య రాజద్రోహం కింద నమోదైన కేసులు 160 శాతం పెరిగాయి. నేరనిర్ధారణ మాత్రం 33.3 శాతంనుంచి 3.3 శాతానికి పడిపోయింది. 2014-19 మధ్య దేశవ్యాప్తంగా 326 రాజద్రోహం కేసులు నమోదయ్యాయని, కాగా, ఆరుగురిపైనే నేరారోపణలు రుజువయ్యాయని ఇటీవల కేంద్ర హోంశాఖ ప్రకటించింది. అక్రమ కేసుల బనాయింపే ఈ పరిస్థితికి కారణమని భావించవచ్చు. ‘ఉపా’ కింద అరెస్టయిన వారిలో 66 శాతం నిర్దోషులుగా విడుదలయ్యారు. నేరం చేయకపోయినా మూడు నుంచి అయిదేళ్లు జైలులో మగ్గాకే వారికి విముక్తి లభించింది. ఇంతకన్నా అన్యాయం మరొకటి ఉంటుందా? రాజకీయ ప్రత్యర్థులపై, ప్రభుత్వ విధానాలను ప్రజాస్వామ్యబద్ధంగా వ్యతిరేకించే చైతన్యశీలురపై ఇటువంటి కేసులు ఎక్కువగా పెడుతున్నారు. ఇంతకాలం న్యాయస్థానాలు, ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టులు ‘ఉపా’ చట్టంలోని నాలుగు, ఆరో సెక్షన్ల కింద అరెస్టయిన వారికి వైద్య కారణాలపై తాత్కాలిక బెయిలు ఇవ్వడానికి సైతం నిరాకరిస్తూ వస్తున్నాయి. దీంతో బాధితులు దీర్ఘకాలం జైలులో మగ్గిపోవాల్సి వస్తోంది. ఇటీవల దిల్లీ హైకోర్టు ముగ్గురు విద్యార్థులకు బెయిలు ఇవ్వడంతో పరిస్థితిలో గుణాత్మక మార్పు కనిపిస్తోంది. పౌరసత్వ సవరణ చట్టానికి నిరసనగా ప్రదర్శనలు జరపడమే వారు చేసిన నేరం! రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛ కింద ప్రభుత్వ విధానాలకు నిరసన తెలిపే హక్కు వీరికి ఉందని, దీన్ని ఉగ్రవాదంగానో ఉగ్రవాద ప్రేరేపణగానో పరిగణించకూడదని హైకోర్టు స్పష్టం చేసింది. అఖిల్‌ గొగోయ్‌ కేసులోనూ నిరసన ప్రదర్శనలు నిర్వహించడం, శాంతియుతంగా రాస్తారోకోలు, హర్తాళ్లు పాటించడం దేశ సార్వభౌమత్వానికి, ఆర్థిక భద్రతకు భంగకరంగా పరిగణించరాదని ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు తీర్పు ఇచ్చింది. ఇలాంటి నిరసనకారులపై ‘ఉపా’ చట్టంలోని నాలుగు, ఆరో సెక్షన్లను ప్రయోగించకూడదని పేర్కొంది. ఉగ్రవాద నిరోధం పేరిట ప్రభుత్వం పౌరుల ప్రాథమిక, మానవ హక్కులను హరించకూడదని ఈ రెండు తీర్పులు స్పష్టీకరించాయి.

మార్పులు అత్యవసరం

‘ఉపా’ను, రాజద్రోహ నిరోధానికి ఉద్దేశించిన ఐపీసీ 124ఏ సెక్షన్‌నూ కలగలిపి రాజకీయ ప్రత్యర్థులపై ప్రయోగించే ధోరణి ఈమధ్య కాలంలో పెచ్చుమీరుతోంది. 1962నాటి కేదార్‌నాథ్‌ సింగ్‌ కేసులో 124 ఏ రాజ్యాంగబద్ధతను సమర్థిస్తూనే, శాంతియుతంగా నిరసన తెలిపే రచనలు రాజద్రోహ నేరం కిందకు రావని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇతర కేసుల్లోనూ ఇదే అంశాన్ని చాటిచెప్పింది. హింసను రెచ్చగొట్టడానికి, సామాజిక అవ్యవస్థను ప్రేరేపించడానికి ఉద్దేశించిన చర్యలు, రాతలను మాత్రమే రాజద్రోహంగా పరిగణించాలని సర్వోన్నత న్యాయస్థానం తన తీర్పుల్లో తేల్చిచెప్పింది. అయినా రాజకీయ కక్షసాధింపులకు ‘ఉపా’, ఐపీసీ చట్ట నిబంధనలను పదేపదే దుర్వినియోగం చేస్తున్నారు. పౌర అసమ్మతిని అణచివేయడానికి ఆంగ్లేయ ప్రభుత్వం సెక్షన్‌ 124 ఏను     ఉపయోగిస్తోందని మహాత్ముడే విమర్శించారు. స్వాతంత్య్రం వచ్చిన తరవాతా పరిస్థితి మారకపోవడం శోచనీయం! హక్కుల హననానికి ఆయుధంగా అక్కరకొస్తున్న ‘రాజద్రోహం’ నిబంధనను ఇంకా కొనసాగించడం అవసరమా అని ఇటీవల సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ‘ఉపా’, రాజద్రోహం నిబంధనల దుర్వినియోగం ఇలాగే సాగితే- పరిస్థితిని విద్రోహులు తమకు అనుకూలంగా మలచుకుని యువజనులను పాలనా వ్యవస్థకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రమాదం ఉంది. దీన్ని నివారించడానికి రాజ్యాంగంలో ఉల్లేఖించిన ప్రకారం ప్రాథమిక, మానవ హక్కులకు భంగం కలిగించని రీతిలో ఉగ్రవాద నిరోధక చట్టాల్లో తగినన్ని  మార్పులు చేర్పులు చేయాలి.


ఉగ్రవాద వ్యతిరేక చట్టంతో సహా మరే చట్టాన్నీ దేశంలో అసమ్మతిని అణచివేయడానికి కాని, పౌరులను వేధించడానికి కాని దుర్వినియోగం చేయరాదు.

- జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, సుప్రీంకోర్టు న్యాయమూర్తి


న్యాయ సూత్రాలకే విరుద్ధం

ఉగ్రవాదంపై పోరు అవశ్యం జరగాల్సిందే కానీ, అది జాతీయ భద్రతను, మానవ హక్కులను సమతుల్యపరచుకుంటూ సాగాలి. కానీ, ‘ఉపా’ నాలుగు, ఆరో సెక్షన్ల కింద అరెస్టయిన వ్యక్తిపై కేస్‌ డైరీలో ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉంటే తాత్కాలిక బెయిలు సైతం ఇవ్వకూడదని, అదే చట్టంలోని 43(డి)(5) సెక్షన్‌ స్పష్టం చేస్తోంది. దోషిగా నిరూపణ కానంతవరకు నిందితుడిని నిర్దోషిగానే పరిగణించాలనే ప్రాథమిక న్యాయ సూత్రానికి ఇది విరుద్ధం. పైగా కేస్‌ డైరీలోని అంశాలు నిందితుడికి అందుబాటులో ఉండవని గమనించాలి. అతడిపై ప్రాథమిక సాక్ష్యాధారాలు బలంగా ఉన్నాయా లేదా అనే అంశం విచారణ సమయంలో మాత్రమే కోర్టు పరిశీలనకు వస్తుంది. దర్యాప్తు అధికారులు ‘బాహ్య’ ఒత్తిళ్లతో తప్పుడు సాక్ష్యాధారాలను నమోదు చేసిన ఘటనలు తక్కువేమీ కాదు. దానితో ‘ఉపా’ చట్టం కింద ఆరోపణలకు గురయ్యేవారికి బెయిలు రావడం చాలా కష్టమైపోతోంది. భయాందోళన వాతావరణం సృష్టించి నిరసన స్వరాలను నొక్కివేయడానికి ఈ చట్ట నిబంధనలు ఏలికలకు ఉపకరిస్తున్నాయి.

- డాక్టర్‌ చెన్నుపాటి దివాకర్‌ బాబు

(ప్రిన్సిపల్‌, శ్రీమతి వి.డి.సిద్ధార్థ న్యాయ కళాశాల, విజయవాడ)


జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

+

© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.abc_digital_logo