రోదసిలో మన ఆరిజిన్‌ ఎప్పుడు?
close

ఈనాడు ప్రత్యేకం

రోదసిలో మన ఆరిజిన్‌ ఎప్పుడు?

కంభంపాటి సురేష్‌

ఈనాడు - హైదరాబాద్‌

మొన్న వర్జిన్‌ గెలాక్టిక్‌.. తాజాగా బ్లూ ఆరిజిన్‌! అమెరికాలో ప్రైవేటు అంతరిక్ష కంపెనీలు వరుసగా పతాక శీర్షికలకు ఎక్కుతున్నాయి. ఒకదాని వెంట ఒకటి అలవోకగా రోదసిలోకి వెళ్లొస్తున్నాయి. అంతరిక్ష పర్యాటకానికి పునాదులు వేస్తున్నాయి. సువిశాల విశ్వాన్ని మానవుడికి చేరువ చేస్తున్నాయి. ప్రభుత్వ రంగ రోదసి సంస్థలకు విశ్వసనీయ, చౌకైన ప్రత్యామ్నాయాలుగా ఇవి ఎదుగుతున్నాయి. ఫలితంగా.. ఒకప్పుడు దేశాల మధ్య నడిచిన ‘స్పేస్‌ రేస్‌’ నేడు ప్రైవేటు దిగ్గజాల నడుమ సాగుతోంది. సబ్‌ ఆర్బిటల్‌, భూ దిగువ కక్ష్యలోకే కాకుండా స్పేస్‌ఎక్స్‌ వంటి సంస్థలు చందమామ, అంగారకుడి వద్దకు వ్యోమనౌకలను పంపేందుకూ సిద్ధమవుతున్నాయి. దీనివల్ల ఆయా దేశాలు ఆర్థికంగా, సాంకేతికంగా మరింత వృద్ధి చెందుతున్నాయి. అక్కడ పెద్ద సంఖ్యలో ఉద్యోగాల కల్పన జరుగుతోంది. మరి మన దేశంలో పరిస్థితి ఏంటి..?

కొన్ని దశాబ్దాలుగా అంతరిక్ష రంగంలో రాణిస్తున్న భారత్‌లో ఇలాంటి దిగ్గజ కంపెనీ ఒక్కటీ లేదు. రోదసిరంగంలో అగ్రరాజ్యాలకు దీటుగా ఎదగాలనుకుంటే మన దేశంలోనూ ఇలాంటి సంస్థలు పురుడు పోసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇందుకు ఎప్పుడో పునాదులు పడాల్సిందని విశ్లేషిస్తున్నారు. సుదీర్ఘ జాప్యం తర్వాత ప్రైవేటు రంగానికి ద్వారాలు తెరుస్తూ గత ఏడాది కీలక నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ.. వాటి అమలు విషయంలో జాప్యం జరుగుతోంది. అలసత్వాన్ని వీడి, అనుమతుల ప్రక్రియ, నిబంధనలను సడలిస్తేనే ఈ రంగంపై భరోసా పెరిగి, పెట్టుబడులు పెట్టేందుకు మరింతమంది ముందుకొస్తారు. అప్పుడు మన దేశంలోనూ స్పేస్‌ఎక్స్‌ వంటి కంపెనీలు ఆవిర్భవిస్తాయి. మన భూభాగం నుంచీ అంతరిక్ష పర్యాటకం జరుగుతుంది.

అంతరిక్షం.. అవసరం..

ఆధునిక మానవుడి జీవనం రోజురోజుకూ అంతరిక్ష పరిజ్ఞానంతో పెనవేసుకుపోతోంది. ఇంటర్నెట్‌, జీపీఎస్‌, టీవీ ప్రసారాలు, టెలి కమ్యూనికేషన్లు, వాతావరణ హెచ్చరికలు, పట్టణ ప్రణాళికలు, వ్యవసాయం, భద్రత వంటి అనేక అంశాల్లో మనం శాటిలైట్‌ సేవలు పొందుతున్నాం. నింగిలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో వ్యోమగాములు నిరంతరం మానవాళి పురోభివృద్ధికి అవసరమైన ప్రయోగాలు చేస్తున్నారు. అంతరిక్ష పర్యాటకం ఇప్పుడిప్పుడే చిగురిస్తోంది. కంప్యూటింగ్‌ రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పుల వల్ల తేలికపాటి ఉపగ్రహాల తయారీ సులువైంది. పునర్‌వినియోగ రాకెట్లు, వ్యోమనౌకల రాకతో ప్రయోగ ఖర్చులూ తగ్గాయి. రెండు దశాబ్దాల కిందటితో పోలిస్తే.. అంతరిక్షంలోకి కిలో బరువును మోసుకెళ్లడానికి అయ్యే వ్యయాన్ని స్పేస్‌ఎక్స్‌కు చెందిన ఫాల్కన్‌ 9 రాకెట్‌ 85 శాతం తగ్గించింది. తద్వారా అంతర్జాతీయ ఉపగ్రహ ప్రయోగ మార్కెట్‌లో 60 శాతం వాటాను ఈ సంస్థ దక్కించుకుంది. ఈ రంగంలో డిమాండ్‌ పెరుగుతూనే పోతుందని నిపుణులు చెబుతున్నారు.


మనమెక్కడ?

దశాబ్దాల కృషి ఫలితంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో).. దేశానికే గర్వకారణంగా నిలిచింది. చౌకలో ఉపగ్రహాలు ప్రయోగించే సంస్థగా గుర్తింపు పొందింది. అయితే అంతర్జాతీయ అంతరిక్ష మార్కెట్‌లో మన వాటా 3 శాతమే. ఇది కనీసం 10 శాతానికి పెరగాలన్నది లక్ష్యం. పెరుగుతున్న డిమాండ్‌ను అందుకోవాలంటే ఇస్రో సామర్థ్యం ఏకంగా పది రెట్లు పెరగాలి. సంస్థ సొంతంగా దీన్ని అందుకోవడం కష్టం. ప్రైవేటు రంగం అందిపుచ్చుకొని, పోటీతత్వాన్ని చాటితేనే ఇది సాధ్యం.


కంపెనీలకు కొదవలేదు

అంతరిక్ష రంగానికి సంబంధించి 368 కంపెనీలతో భారత్‌ ప్రపంచంలోనే ఐదో స్థానంలో ఉంది. జపాన్‌, చైనా, రష్యాలోని సంస్థల సంఖ్యతో పోలిస్తే మన వద్దే ఎక్కువ కంపెనీలు ఉన్నాయి. ఎల్‌ అండ్‌ టీ, గోద్రెజ్‌, టాటా, అనంత్‌ టెక్నాలజీస్‌ వంటి సంస్థలు ఇస్రోకు దీర్ఘకాలంగా వివిధ విడిభాగాలు, ఉప వ్యవస్థలు, సేవలను అందిస్తున్నాయి. అయితే వీటిలో కొన్ని పెద్ద సంస్థల స్థూల వ్యాపారంలో రోదసి రంగ ఉత్పత్తుల వాటా నామమాత్రమే.


ఈ నమూనా పనికిరాదు

ప్రైవేటు సంస్థలకు సంబంధించి ఇస్రో.. ‘విక్రేత-వినియోగదారు’ నమూనాను అనుసరిస్తోంది. దీనికింద ఆ సంస్థ.. విడి భాగాలు, ఉప వ్యవస్థలకు సంబంధించిన పరిజ్ఞానాన్ని కంపెనీలకు అందించి, వాటిని ఉత్పత్తి చేయిస్తోంది. అనంతరం వాటిని కొనుగోలు చేస్తోంది. ఈ ఉత్పత్తులకు సంబంధించిన మేధో హక్కులు చాలావరకూ ఇస్రో అజమాయిషీలోనే ఉంటున్నాయి. ఇది భారత కంపెనీల సాంకేతిక పురోగతికి ఇది ప్రతిబంధకంగా మారింది. సొంతంగా అంతరిక్ష ప్రాజెక్టులు చేపట్టడానికి, అంతరిక్ష ఆధారిత సేవలు అందించడానికి అవసరమైన వనరులు, సాంకేతికత వాటికి అందుబాటులో ఉండటంలేదు. దేశ అంతరిక్ష రంగ సత్తా మెరుగుపడాలంటే.. ప్రైవేటుతో ‘భాగస్వామ్య నమూనా’కు ఇస్రో పూనుకోవాలని విశ్లేషకులు చెబుతున్నారు.


సంస్కరణలతో తొలి అడుగులు

వాణిజ్య అంతరిక్ష పరిశ్రమ వికాసానికి దోహదపడే వాతావరణాన్ని సృష్టించడంలో భారత్‌ తీవ్ర జాప్యం చేసింది. అయితే ఇటీవల కొన్ని అడుగులు వేసింది. రాకెట్లు, ఉపగ్రహాల నిర్మాణం, నిర్వహణ, అంతరిక్ష ప్రయోగాల విషయంలో ప్రైవేటు సంస్థలకు వెసులుబాటు కల్పించడానికి 2020లో కేంద్ర కేబినెట్‌ ఒక ముసాయిదా చట్టాన్ని ఆమోదించింది. దీని ద్వారా ప్రైవేటు సంస్థలు స్వీయ పరిశోధన, అభివృద్ధి (ఆర్‌ అండ్‌ డీ) కార్యకలాపాలు పెంచడం, సైన్స్‌, గ్రహాంతర యాత్రల విషయంలో ఇస్రోతో భాగస్వామ్యం వహించడం, ఇస్రో సౌకర్యాలను ఉపయోగించుకోవడం వంటివి చేయవచ్చు. ఈ సంస్కరణలను అమలు చేసే బాధ్యతను ‘ఇండియన్‌ స్పేస్‌ ప్రమోషన్‌ అండ్‌ ఆథరైజేషన్‌ సెంటర్‌ (ఇన్‌-స్పేస్‌) అనే నోడల్‌ సంస్థకు అప్పగించింది. ఇస్రోకు ప్రైవేటు సంస్థలకు మధ్య ఏకైక సంధానకర్తగా ఇది పనిచేస్తుంది. దేశ అంతరిక్ష మౌలిక వసతులు, సాంకేతికతను ప్రైవేటు రంగం ఉపయోగించుకునేందుకు వీలు కల్పిస్తుంది.


మందగమనం..

ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు ప్రకటించినా, వాటిని ఆచరణలోకి తీసుకొచ్చే ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. అనేక వ్యవస్థల నుంచి అనుమతులు తెచ్చుకోవాల్సి రావడం, వాటిలో జాప్యం, విధానపరమైన అస్పష్టత వంటివి తమకు ప్రతిబంధకమవుతున్నాయని కంపెనీలు చెబుతున్నాయి. నిజానికి ‘ఇన్‌-స్పేస్‌’ స్వతంత్ర వ్యవస్థగా ఉండాలి. కానీ, ఇస్రో ప్రభావం దానిపై ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది. దీనివల్ల ఈ సంస్థ.. అటు నియంత్రణ వ్యవస్థగాను ఇటు ఆపరేటర్‌గాను ఉంటుంది. ప్రైవేటు కంపెనీలకు, ఇస్రోకు మధ్య తలెత్తే వివాదాలను పరిష్కరించే విషయంలో ఇది ప్రయోజన వైరుధ్యాని (కాన్‌ఫ్లిక్ట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌)కి దారితీయవచ్చు. దీనిపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి.


ముందడుగు వేయాల్సిందే..

ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన నిర్ణయాలు.. సరైన దిశలో వేస్తున్న అడుగులే. ఇవి వెలువడిన కొద్ది నెలలకే భారత, విదేశీ సంస్థల నుంచి దాదాపు 30 ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందడం స్వాగతించదగ్గ పరిణామం. హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్‌ ఏరో స్పేస్‌, చెన్నైకి చెందిన అగ్నికుల్‌ కాస్మోస్‌ సంస్థలు సొంత రాకెట్‌లతో ఉపగ్రహ ప్రయోగాలకు సిద్ధమవుతున్నాయి. అయితే ఈ వృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం సమయానుకూలంగా చర్యలు చేపట్టాలి. సాంకేతిక ఆవిష్కరణలు, వ్యాపార యోగ్యతను సులభతరం చేసే పరిస్థితులను సృష్టించాలి. పరిశోధనలను ప్రోత్సహించాలి.

* ప్రైవేటు కంపెనీలు నిధులకు ఇబ్బందిపడకుండా ప్రభుత్వం చూడాలి. ప్రైవేటు వెంచర్‌ క్యాపిటల్‌, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ప్రోత్సహించే నిర్ణయాలను తీసుకోవచ్చు. చిన్నపాటి అంతరిక్ష కంపెనీలు తొలినాళ్లలో ఆర్థికంగా మనుగడ సాగించేందుకు ప్రభుత్వం సాయం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆరంభ దశలో సురక్షితంగా రాకెట్‌ పరీక్షల నిర్వహణకు అనువైన ప్రదేశాలను గుర్తించాలని కోరుతున్నారు.

* ఇస్రో పూర్తిగా తన దృష్టిని మానవసహిత అంతరిక్ష యాత్రలు, అధునాతన గ్రహాంతర పరిశోధనలపై కేంద్రీకరించాలి. దిగువ భూ కక్ష్యలోకి ఉపగ్రహాలను పంపే బాధ్యతలను ప్రైవేటు సంస్థలకు అప్పగించాలి. దీనివల్ల ఈ రంగంలో బహుముఖ వృద్ధి సాధ్యమవుతుందని, దేశానికి ఆర్థికంగా, సాంకేతికంగా మేలు జరుగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.


అంతర్జాతీయ రోదసి విపణిలో భారత్‌ వాటా 3%


విమానయానం తరహాలో అంతరిక్ష యాత్రలూ సర్వసాధారణమవుతాయని విశ్వసిస్తున్నా. అయితే రోదసియాత్రల నిజమైన భవిత ప్రభుత్వ సంస్థల చేతిలో ఉండదు. సేవలు అందించే విషయంలో పరస్పరం పోటీ పడే ప్రైవేటు కంపెనీల ద్వారానే వాస్తవ పురోగతి సాధ్యం.

-బజ్‌ ఆల్డ్రిన్‌, చంద్రుడిపై కాలుమోపిన రెండో మానవుడుమరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

+

© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.abc_digital_logo