Love Story: అలాంటి సినిమాలు నాకు సరిపోవు: నాగచైతన్య

సినిమా

Love Story: అలాంటి సినిమాలు నాకు సరిపోవు: నాగచైతన్య

అక్కినేని వారసుడిగా అరంగేట్రం చేసి తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న యువహీరో నాగచైతన్య. ప్రేమకథలు, ఫీల్‌ గుడ్‌ సినిమాలతో టాలీవుడ్‌ సినీ ప్రేమికులను అలరిస్తున్నాడు. శేఖర్‌ కమ్ములతో చైతు హీరోగా నటించిన తొలి చిత్రం ‘లవ్‌స్టోరి’పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా పరిశ్రమంతా ఎక్కడ చూసినా ఆ సినిమా గురించే చర్చ. రేపటి నుంచి ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైందీ సినిమా. ఈ సందర్భంగా ఆ సినిమా కథానాయకుడు నాగచైతన్య మీడియాతో మాట్లాడారు. ‘లవ్‌స్టోరి’ అనుభవాలను పంచుకున్నారు. ఆ విశేషాలు మీకోసం.

‘లవ్‌స్టోరి’పై  ఆత్మవిశ్వాసంతో ఉన్నారా?
నాగచైతన్య: సినిమా గురించి చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందోననే టెన్షన్‌ మాత్రం కొద్దిగా ఉంది. మూడు రోజుల టికెట్లన్నీ ముందే అయిపోయాయి. ఆ తర్వాత రోజుల్లో ఎలాంటి స్పందన ఉంటుందనేది చూడాలి. కుటుంబ ప్రేక్షకులు మా సినిమాతో మళ్లీ థియేటర్‌ బాట పడతారనే నమ్మకముంది.  

మిగతా ప్రేమకథలకు ‘లవ్‌స్టోరి’కి ఉన్న తేడా?
నాగచైతన్య: సమాజంలో కనిపించే కుల, స్త్రీ వివక్ష సమస్యలే ప్రధానంగా శేఖర్ కమ్ముల దీన్ని రూపొందించారు. ఇవి రెండూ సున్నితమైన అంశాలు. వీటి గురించి మాట్లాడేందుకు ఇప్పటికీ సంకోచిస్తున్నారు. ఆయా సమస్యలపై వచ్చిన కథనాలు చదివితే చాలా ఇబ్బందిగా అనిపించేది. మనమెందుకు వీటి గురించి చెప్పట్లేదని చాలా సార్లు అనుకున్నాను. ఇలాంటివి సినిమాల ద్వారా చెబితే ఎక్కువ మందికి చేరుతుంది. ప్రజలకు అవగాహన పెంచే అవకాశం దక్కుతుంది. శేఖర్‌ ఇలాంటి కథతోనే రావడం ఆనందమేసింది. ‘లవ్‌స్టోరి’ వాస్తవ జీవితానికి చాలా దగ్గర ఉండే ప్రేమకథ. రేవంత్‌, మౌనికల పాత్రలు అంతే రియలిస్టిక్‌గా ఉంటాయి. 
రెండు రకాల క్లైమాక్స్‌లు తీశారట?
నాగచైతన్య: లేదు. ఒక క్లైమాక్స్ మాత్రమే తెరకెక్కించాం. లాక్‌డౌన్‌ సమయానికి షూట్‌ దాదాపు పూర్తయింది. ఆ తర్వాత  6,7 నెలల సమయం దొరికింది.  పతాక సన్నివేశాలు మరింత మెరుగ్గా ఉండాలని, అదే  క్లైమాక్స్‌ని కొన్ని మార్పులతో మళ్లీ తెరకెక్కించారు. ఇంత ఎక్కువ సమయం దొరకడంతో డబ్బింగ్‌పైనా ఎక్కువ దృష్టి పెట్టే వీలుచిక్కింది. తెలంగాణ యాస కోసం పాటలు, వీడియోలు ఎక్కువ చూశాను.

ఇండస్ట్రీ అంతా మీ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది కదా? 
నాగచైతన్య: కరోనా వల్ల చిత్ర పరిశ్రమకు కష్టాలు ఎదురయ్యాయి. రెండేళ్ల నుంచి చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడొక బలమైన ముందడుగు పడాలి. ఇండస్ట్రీ కోసమైనా మా సినిమా ఆడాలి. 

డ్యాన్స్‌ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?
నాగచైతన్య: పాట చిత్రీకరణంటే ఒక రకమైన భయముండేది. ‘శైలజా రెడ్డి అల్లుడు’ సినిమా నుంచి శేఖర్‌ మాస్టర్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. నా బాడీ లంగ్వేజ్‌ గమనిస్తూ నాకోసం ప్రత్యేకంగా డ్యాన్స్‌ రూపొందించారు. ఆయనకున్న ఓపిక, ఆత్మవిశ్వాసం నాకు బాగా ఉపయోగపడింది. 

నాగార్జున ఏమన్నారు?
నాగచైతన్య:  నాన్న చాలా హ్యపీగా ఉన్నారు. నటుడిగా ఈ సినిమాతో నాకొక సంతృప్తి దొరికింది.
లైవ్‌ లోకేషన్లలో పనిచేయడం ఎలా ఉంది?
నాగచైతన్య: ప్రజల మధ్య చిత్రీకరిస్తే మంచి నటనను రాబట్టుకోవచ్చనేది శేఖర్‌ గారికి గట్టి నమ్మకం. నేనూ దీనికి అంగీకరిస్తాను. అలాంటి లోకేషన్లలో చేస్తే ఏదో తెలియని శక్తి వస్తుంది. తక్కువ మంది బృందంతో వెళ్లి  చిత్రీకరణ జరుపుకోవచ్చు. ఇలాంటి ఫిల్మ్‌ మేకింగ్‌ అంటేనే నాకు ఇష్టం. ‘మజిలి’ తర్వాత మళ్లీ ఇందులోనే రియలిస్టిక్‌గా పనిచేసే అవకాశం దొరికింది. 
కమర్షియల్‌ సినిమాలకు, శేఖర్‌ కమ్ముల సినిమా శైలికి ఎలాంటి తేడా కనిపించింది?
నాగచైతన్య: ఇప్పుడు సినిమాల ట్రెండ్‌ మారింది. ప్రేక్షకుల అభిరుచి కూడా మారుతూ వస్తోంది. వాస్తవానికి దగ్గరగా ఉండే కథలను ఎక్కువగా ఆశిస్తున్నారు. దర్శకుడు సుకుమార్‌ కూడా ఓ సారి మాట్లాడుతూ ఇదే అన్నారు. మనం కొత్తగా చేయడానికి వెనకాడతాం కానీ, ప్రేక్షకులు ఆదరించేందుకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారన్నారు. అందుకే కథాంశం విభిన్నంగా ఉండేలా చూసుకుంటున్నాను. 

స్టార్‌ డైరెక్టర్లతో ఎందుకు పనిచేయట్లేదు?
నాగచైతన్య: నాకు చిన్నాపెద్దా అనే తేడా లేదు. కథ మాత్రమే నన్ను ఎక్కువగా ఆకర్షిస్తుంది. కానీ దర్శకులందరితో పనిచేయాలని ఉంది. అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను. 
పాన్‌ ఇండియా సినిమాలపై ఎందుకు దృష్టి పెట్టట్లేదు?
నాగచైతన్య:  పాన్‌ ఇండియా మార్కెట్‌ నాకు తెలియదు. ప్రస్తుతం నా దృష్టంతా టాలీవుడ్‌ మీదే ఉంది. తెలుగు ప్రేక్షకుల కోసమే సినిమాలు చేయాలని ఉంది. పాన్‌ ఇండియా స్థాయిలో కథ రాసుకుంటే, స్థానికంగా ఉండే మూలాలు దెబ్బతింటుందేమో అని నా అభిప్రాయం. కానీ హిందీలో మంచి అవకాశాలు వస్తే మాత్రం చేసేందుకు వెనకాడను. 
అమిర్‌ఖాన్‌తో పనిచేసే అవకాశం ఎలా వచ్చింది? 
నాగచైతన్య:  అమిర్‌ఖాన్‌ గారే ఫోన్‌ చేసి ఓ రోజు ముంబయికి రమ్మన్నారు. అక్కడ కొన్ని సీన్లు చేసి చూపించాక, ఆయనకు నచ్చి ‘లాల్‌సింగ్‌ చద్దా’లో అవకాశమిచ్చారు. ఈ పన్నేండేళ్ల కెరీర్‌లో నేర్చుకున్న దానికంటే ఎక్కువగా అమిర్‌ఖాన్‌తో పనిచేసిన 45 రోజుల్లో నేర్చుకున్నాను. ఆయనతో  చేసిన ప్రయాణం చాలా ఉపయోగపడింది. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు వస్తారని ఊహించలేదు. ట్రైలర్‌ చూసి వచ్చారు. చాలా సింపుల్‌గా ఉంటారు. 
అమిర్‌ఖాన్‌కు ‘లవ్‌స్టోరి’ చూపిస్తున్నారా? 
నాగచైతన్య: ఆయనే సినిమా వేయమని అడిగారు. ఆయనకున్న సమయాన్ని బట్టి చూపించే ప్రయత్నం చేస్తున్నాం. 
శేఖర్‌ కమ్ములలో మిమ్మల్ని ప్రభావం చేసిన అంశాలేంటి?
నాగచైతన్య: శేఖర్‌ కమ్ముల మంచి విలువలున్న వ్యక్తి. సెట్‌ బాయ్‌ నుంచి హీరోహీరోయిన్ల వరకు అందరినీ ఒకే రకంగా చూస్తారు. ఇదంతా కావాలని చేయరు. ఆయన వ్యక్తిత్వమే అలాంటిది. శేఖర్‌తో నిరంతరం ప్రయాణించాలని, ఆయనతోనే ఉండిపోవాలనే భావనను కలిగిస్తారు. అందుకే ఈ సినిమా కోసం 200 రోజులైనా పని చేయొచ్చనిపించింది. అంతగా ప్రభావితం చేశారు. శేఖర్‌లో కనిపించే అంకితభావం, నిజాయతీ ఇంకెవరిలో చూడలేదు. ప్రతి చిన్న విషయాన్ని చాలా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. నటుడిగానూ ఎక్కువగా నేర్చుకునే వీలుంటుంది.  

ప్రేమకథలే చేస్తున్నారు. ఎందుకని?
నాగచైతన్య:  ప్రేక్షకులు నన్ను అలాంటి కథల్లోనే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. నాక్కూడా ఇలాంటి భావోద్వేగాలున్న చిత్రాల్లో నటించడం ఇష్టం.  
శేఖర్‌ కమ్ములతో పని చేసిన తర్వాత.. కథల ఎంపికలో మార్పు వచ్చిందా?
నాగచైతన్య: కథల ఎంపికలో చాలా మార్పు వచ్చింది. బయట ప్రేక్షకులు కూడా కమర్షియల్‌ సినిమాల్లో అందరినీ ఆదరించట్లేదు. స్టార్‌ హీరోలకు మాత్రమే ఈ మినహాయింపు ఉంది. ఇప్పుడు ట్రెండ్‌ మార్చాల్సిన అవసరం ఏర్పడింది. కొత్త కథలతో పలకరించే బాధ్యత మాలాంటి యువహీరోల మీదే ఎక్కువగా ఉంది. 
‘బంగార్రాజు’ గురించి?
నాగచైతన్య:  కథ నచ్చే నాన్నతో ‘బంగార్రాజు’ చేస్తున్నాను. ‘సోగ్గాడే చిన్ని నాయన’ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. ఈ ఫ్రాంచైజీని రాబోయే కాలంలో విజయవంతంగా కొనసాగించాలని ఉంది. ‘బంగార్రాజు’ లోనూ అవే పాత్రలు ఉంటాయి. కానీ, కథ మాత్రం పూర్తిగా కొత్తది.  

ఈశ్వరీరావుతో పనిచేయడం ఎలా ఉంది?
నాగచైతన్య: ‘లవ్‌స్టోరి’లో ఈశ్వరీరావుది ముఖ్యమైన పాత్ర.  తల్లీకొడుకుల మధ్య వచ్చే సన్నివేశాలు చాలా సహజంగా ఉంటాయి. తల్లితో ఇంత ఎక్కువ నిడివి మిగతా ఏ సినిమాల్లో లేదు. ఇంత లోతైన సన్నివేశాలు కూడా ఇది వరకు లేవు.  ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు భావోద్వేగానికి గురిచేస్తాయి. థియేటర్‌కి వచ్చే ప్రేక్షకులకు కచ్చితంగా ఆకట్టుకునే సీన్లవి. 

పిప్రీ ప్రజల నుంచి వచ్చిన స్పందన? 
నాగచైతన్య:  దాదాపు 45 రోజులు పిప్రీలో షూటింగ్‌ చేశాం. మొదటి రెండు, మూడు రోజులు ఆసక్తిగా చూశారు. ఆ తర్వాత మాలోనే ఒక భాగమయ్యారు. అక్కడి సంస్కృతి బాగా నచ్చింది. ఎన్నో మంచి జ్ఞాపకాలున్నాయి. చాలా ప్రేమనిచ్చారు.

ఓటీటీల మీద మీ అభిప్రాయం?
నాగచైతన్య:  తర్వాత ఏమవుతుందో ఊహించలేని పరిస్థితి గత రెండేళ్ల నుంచి ఉంటుంది.  ఆ సమయానికి ఏది మంచి నిర్ణయమో దాన్నే తీసుకోవాలి. అదృష్టవశాత్తు మా నిర్మాత థియేటర్లలోనే విడుదల చేద్దామన్నారు. అది మాకు బలాన్నిచ్చింది. అయితే ఓటీటీల్లో రిలీజ్‌ చేయడం తప్పని అనను.  ఇప్పుడున్న పరిస్థితులు అలాంటివి. 
సాయిపల్లవి ఎలా చేసింది?
నాగచైతన్య: నిజానికి డ్యాన్స్‌ విషయంలో సాయిపల్లవి చాలా సహకరించింది. ఆమె పక్కన డ్యాన్స్‌ చేసేటప్పుడు చాలా టేక్‌లు తీసుకున్నాను. అయినా చాలా ఓపికగా పని చేసింది. సినిమాలో అద్భుతంగా నటించింది.
సంగీత దర్శకుడు పవన్‌ గురించి? 
నాగచైతన్య: ఇంత అందమైన పాటలిచ్చినందుకు పవన్‌కి చాలా థాంక్స్‌.  ఇంకా ఆయన దగ్గర ఇలాంటివి చాలా పాటలున్నాయి. మనతో సులభంగా కలిసిపోతాడు. చాలా టాలెంటెడ్‌ మ్యూజిషియన్‌.  
ఎలాంటి సినిమాలు ఎంచుకోడానికి ఇష్టపడతారు?
నాగచైతన్య: ప్రేమకథ, థ్రిల్లర్, యాక్షన్‌ ఇలా ఏదైనా నిజాయతీగా చెప్పే కథలంటే ఇష్టం. మరీ సినిమాటిక్‌గా ఉండే సినిమాలు నాకు సరిపోవు. కొన్ని చిత్రాల్లో ఆ ప్రయత్నాలు చేశాను.  ప్రతి నటుడికి కొన్ని పరిమితులుంటాయి. నా బాడీ లాంగ్వేజ్‌కు అవి సరిపోవని తెలిసింది. 

‘హలో బ్రదర్‌’ మళ్లీ చేసే ఆలోచన ఉందా? 
నాగచైతన్య: లేదండి. మొదట్లో చేయాలని అనిపించేది.  అలాంటి క్లాసిక్స్‌ను తీసి చెడగొట్టడం ఎందుకు.
ఓవర్సీస్‌లో ఎలాంటి స్పందన ఉంటుందని ఆశిస్తున్నారు?
నాగచైతన్య: శేఖర్‌ కమ్ములకు అక్కడ పెద్ద మార్కెట్‌ ఉంది. అమెరికాలో ఆయన సినిమాలను విపరీతంగా ప్రేమిస్తారు. నా సినిమానే కాదు. తర్వాత విడుదలయ్యే సినిమాలూ బాగా ఆడాలని కోరుకుంటున్నాను. 
ప్రస్తుతం చేస్తున్న సినిమాలేంటి?
నాగచైతన్య: ‘థాంక్యూ’ సినిమా త్వరలో పూర్తవుతుంది. నాన్నతో ‘బంగర్రాజు’, అమెజాన్‌ ప్రైమ్‌ కోసం విక్రమ్‌ కె కుమార్‌తో ఓ వెబ్‌సిరీస్‌ చేస్తున్నాను. ఇంకొన్ని కథలు వింటున్నాను. 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

+

© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.abc_digital_logo