నాడు సంపన్నులకే గులాములు నేడు సామాన్యులకూ సేవలు

సంపాదకీయం

నాడు సంపన్నులకే గులాములు నేడు సామాన్యులకూ సేవలు

భారత్‌లో బ్యాంకింగ్‌ రంగ ప్రస్థానం

‘రుణాలు ఇవ్వడానికి లేదా పెట్టుబడులు పెట్టడానికి ప్రజల నుంచి నగదు డిపాజిట్లు స్వీకరించడం, డిపాజిట్‌ దారులు కోరిన వెంటనే నగదు చెల్లించడం, వారికి అవసరమైనప్పుడు చెక్కు, డ్రాఫ్టు లేదా ఇతర రూపాల్లో డబ్బు విత్‌డ్రా చేసుకునే సౌకర్యం కల్పించడం బ్యాంకుల బాధ్యత’ అని 1949నాటి బ్యాంకింగ్‌ నియంత్రణ చట్టం నిర్దేశిస్తోంది. కాలక్రమంలో బ్యాంకుల విధానాలు, కార్యకలాపాల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. జాతీయీకరణ తరవాత బ్యాంకుల స్వరూపమే మారిపోయింది. స్వాతంత్య్రం సిద్ధించిన తరవాత ఈ ఏడున్నర దశాబ్దాల్లో బ్యాంకింగ్‌ రంగంలో చోటుచేసుకొన్న పరిణామాలేమిటి? అసలు లక్ష్యాన్ని నెరవేర్చడంలో అవి ఎంతవరకు సఫలీకృతమవుతున్నాయి?

బ్రిటిష్‌ పాలనలో బెంగాల్‌, బాంబే, మద్రాసు ప్రెసిడెన్సీలకు వేర్వేరు బ్యాంకులు ఉండేవి. తరవాత ఈ మూడింటినీ విలీనం చేసి ఇంపీరియల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాగా ఏర్పరచారు. 1935లో రిజర్వు బ్యాంకును స్థాపించే వరకు ఇంపీరియల్‌ బ్యాంకే కేంద్ర బ్యాంకు విధులను నిర్వహించేది. ఇండియాకు స్వాతంత్య్రం వచ్చిన తరవాత రిజర్వు బ్యాంకు- ఫైనాన్స్‌ రంగానికి, దేశంలోని బ్యాంకులన్నింటికీ ప్రధాన నియంత్రణదారు అయింది. ద్రవ్య విధానం, కరెన్సీ నోట్ల ముద్రణ, ప్రభుత్వ బాండ్ల జారీ వంటివి రిజర్వు బ్యాంకు ద్వారానే జరుగుతాయి. సర్‌సి.డి.దేశ్‌ముఖ్‌, బి.రామారావు, సి.రంగరాజన్‌, మన్మోహన్‌ సింగ్‌, వై.వి.రెడ్డి, దువ్వూరి సుబ్బారావు, రఘురాం రాజన్‌ వంటి విఖ్యాతులు రిజర్వు బ్యాంకు గవర్నర్లుగా పనిచేశారు. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చినప్పుడు దేశవ్యాప్తంగా 3,469 బ్యాంకు శాఖలే ఉండేవి. వాటిలో మొత్తం డిపాజిట్ల విలువ రూ.962 కోట్లు. అవన్నీ ప్రైవేటు బ్యాంకులే. సంపన్నులకు మాత్రమే అవి రుణాలిచ్చేవి. వ్యవసాయదారులు, చిన్న వ్యాపారాలకు అవి పైసా కూడా విదిల్చేవి కావు. నాటి రాజ సంస్థానాలకు ఏడు సొంత స్టేట్‌ బ్యాంకులు ఉన్నా, అవి బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ కనుసన్నల్లో నడిచేవి. 1949లో బ్యాంకింగ్‌ రంగ నియంత్రణ చట్టం చేయడంతోపాటు రిజర్వు బ్యాంకునూ జాతీయం చేశారు.

సమూల మార్పులు

వలస పాలన నుంచి విముక్తి పొందిన అనేక అల్పాదాయ దేశాల్లో బ్యాంకులను ప్రభుత్వ నియంత్రణలోకి తెచ్చి- పేదరిక నిర్మూలనకు, వ్యవసాయ, గ్రామీణాభివృద్ధికి, పారిశ్రామిక ప్రగతికి వాటిని సమర్థ సాధనాలుగా ఉపయోగించసాగారు. 1969లో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ రూ.100 కోట్లకు తగ్గకుండా డిపాజిట్లు ఉన్న 14 ప్రైవేటు బ్యాంకులను జాతీయం చేసి ప్రభుత్వరంగ బ్యాంకులుగా మార్చారు. 1980లో మరో ఆరు ప్రైవేటు బ్యాంకులు జాతీయమయ్యాయి. 1969లో దేశంలోని మొత్తం బ్యాంకు శాఖల సంఖ్య 8,262; 2014నాటికి ఆ సంఖ్య దాదాపు ఏడు రెట్లు పెరిగింది. 2007లో వ్యవసాయం, అనుబంధ రంగాలకు ఇచ్చిన రుణాలు రూ.2,75,300 కోట్లు; 2013-14నాటికి అవి రూ.6,69,400 కోట్లకు చేరాయి. బ్యాంకుల జాతీయీకరణ తరవాత మొదటి పదేళ్లలో గ్రామీణ ఆర్థిక వికాసానికి, సమ్మిళిత అభివృద్ధి సాధనకు ప్రాధాన్యం లభించింది. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (ఆర్‌ఆర్‌బీ), లోకల్‌ ఏరియా బ్యాంకులను ఏర్పరచారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు వాణిజ్య బ్యాంకులు రుణాలివ్వసాగాయి. రాష్ట్ర, జిల్లా స్థాయి సహకార సంఘాలకు ఎప్పుడూ నిధుల కొరతేనన్నది నిష్ఠుర సత్యం. ఇంకా సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకం, విద్యావంతులైన నిరుద్యోగులకు స్వయం ఉపాధి, నిరుపేదలకు నాలుగు శాతం వార్షిక వడ్డీపై రుణాలిచ్చే పథకాలను చేపట్టారు. బ్యాంకుల అధ్యక్షులు గ్రామాలను, వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి వాస్తవ స్థితిగతులను తెలుసుకొనేవారు. బ్యాంకుల జాతీయీకరణ తరవాత రెండో దశాబ్దంలో చిన్న, మధ్య తరహా రైతులకు, చిన్న పరిశ్రమలకు రుణ వితరణను విస్తరించారు. బ్యాంకుల నుంచి నేరుగా రుణాలు పొందినవారిలో చాలామంది ఎగవేతదారులయ్యారనే విమర్శలూ వచ్చాయి. 1982లో ‘జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డ్‌)’ను నెలకొల్పారు. 1990లో ప్రారంభమైన ‘భారత చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు (సిడ్బి)’ గ్రామీణ, చిన్న పరిశ్రమలు, చేతి వృత్తులవారికి ప్రోత్సాహం అందించసాగింది.

పీవీ నరసింహారావు ప్రధానిగా, మన్మోహన్‌ సింగ్‌ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు చేపట్టిన ఆర్థిక సంస్కరణలు బ్యాంకింగ్‌ రంగ స్వరూప స్వభావాలను మార్చివేశాయి. ఆర్థిక సరళీకరణ, ప్రపంచీకరణ, ప్రైవేటీకరణలకు ప్రాధాన్యం పెరిగింది. ఈ నేపథ్యంలో నరసింహం కమిటీ ప్రైవేటు బ్యాంకులను ప్రోత్సహించడం ద్వారా బ్యాంకింగ్‌ రంగంలో పోటీని పెంచాలని సిఫార్సు చేసింది. ఆదాయం ప్రాతిపదికపై బ్యాలన్స్‌ షీట్లను రూపొందించే విధానం కనుమరుగైంది. ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు కేటాయించే ప్రతి రూపాయిలో 16 పైసలు మాత్రమే లబ్ధిదారులకు చేరుతోందని 1989లో రాజీవ్‌ గాంధీ- భువనేశ్వర్‌ సభలో వ్యాఖ్యానించారు. అప్పటి నుంచి చిన్న రైతులకు, చిన్న పరిశ్రమలకు బ్యాంకు రుణాలను పెంచాలన్న భావన విస్తరించింది. ప్రభుత్వ పథకాల అమలుకు పకడ్బందీ యంత్రాంగం కొరవడటంవల్లే పేదరిక నిర్మూలన కార్యక్రమాలు ఆశించిన ఫలితాలను అందించడంలో విఫలమవుతున్నాయి. పీవీ హయాములో తెచ్చిన సంస్కరణలు ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నించాయి. తదనుగుణంగా గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి నిధిని మన్మోహన్‌ సింగ్‌ ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి సిడ్బి ఈ నిధిని నిర్దేశిత ప్రయోజనాలకు వెచ్చిస్తుందని కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి బడ్జెట్లలో కేటాయింపులు జరిపినా, ఖర్చు కాకుండా మిగిలిపోయిన మొత్తాలను ఈ నిధికి మళ్లించారు. సంస్కరణల అనంతరం బ్యాంకుల లాభదాయకత, సుస్థిరతలకు ప్రాధాన్యం పెరిగింది. ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యూటీఐ (యాక్సిస్‌) వంటి ప్రైవేటు బ్యాంకులు ఆవిర్భవించాయి. ఫెడరల్‌ వంటి సంప్రదాయ ప్రైవేటు బ్యాంకులు కొత్త రంగాల్లోకి విస్తరించాయి. రిటైల్‌ బ్యాంకింగ్‌, గృహ రుణాలు నానాటికీ వృద్ధి చెందాయి. మైక్రోఫైనాన్స్‌ సంస్థలు విరివిగా పుట్టుకొచ్చాయి.

బ్యాంకుల జాతీయీకరణ తరవాత నాలుగో దశాబ్దిలో గృహ, స్థిరాస్తి రంగాలకు, భారీ పరిశ్రమలకు, పెద్ద వ్యాపారాలకు విరివిగా రుణాలు ఇవ్వసాగారు. చిన్న పరిశ్రమలు, వ్యాపారాలను బ్యాంకులు పట్టించుకోవడం మానేశాయి. వ్యక్తులు కాకుండా సాంకేతిక వ్యవస్థలు రుణ వితరణను శాసించసాగాయి. అయితే, బ్యాంకులపై ప్రభుత్వ నియంత్రణ పటిష్ఠంగానే ఉండటంతో 2008నాటి అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభాన్ని భారత్‌ తట్టుకొని నిలబడగలిగింది. ఆ తరవాత నుంచి నెట్‌ బ్యాంకింగ్‌, ఏటీఎమ్‌లు విస్తరించసాగాయి. జాతీయీకరణకు ముందునాళ్లతో పోలిస్తే తరవాతి కాలంలో బ్యాంకింగ్‌ రంగం సమూలంగా మారిపోయింది. ప్రభుత్వ బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకులు, ఆర్‌ఆర్‌బీలు, విదేశీ బ్యాంకులు, సహకార గ్రామీణ, పట్టణ బ్యాంకులు, చిన్న పేమెంట్‌ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలతో బ్యాంకింగ్‌ రంగం కిక్కిరిసిపోయింది.

రుణాలంటేనే భయం!

జాతీయీకరణ తరవాత అయిదో దశాబ్దిలో బ్యాంకుల నిరర్థక ఆస్తులు పది లక్షల కోట్ల రూపాయలకు చేరాయి. ఈ పాపంలో విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీ, మెహుల్‌ చోక్సీ వంటివారి పాత్ర పెద్దదే. ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌, డీహెచ్‌ఐఎల్‌ వంటి పెద్ద ఎన్‌బీఎఫ్‌సీలు కుప్పకూలాయి. 2011 తరవాత భారీ కార్పొరేట్‌ సంస్థలకు, బ్యాంకులకు చెందిన 30 మంది ప్రమోటర్లు, సీఈఓలు జైలుపాలయ్యారు. రుణ మంజూరు అంటేనే బ్యాంకులు భయపడే పరిస్థితి నెలకొంది. దీంతో బ్యాంకులు, ఖాతాదారుల మధ్య దూరం పెరిగిపోతోంది. కనీస నగదు ఉంచడం లేదని ఖాతాదారులపై జరిమానాలు విధించడం ఎక్కువైంది. బ్యాంకులు బ్యాంకింగేతర కార్యకలాపాలపై కమిషన్ల రూపంలో ఎక్కువ సంపాదిస్తున్నాయి. రైతులకు సకాలంలో బ్యాంకు రుణాలు అందక వడ్డీ వ్యాపారుల చేతికి చిక్కి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) రంగానికి రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు వెనకడుగు వేస్తున్నాయి. సమ్మిళిత అభివృద్ధిని వదిలేసి లాభాల కోసం పాకులాడుతున్నా, ఎన్‌పీఏల వల్ల ఆ లాభాలూ ఎండమావిగా మిగిలాయి. బ్యాంకింగ్‌ రంగాన్ని మళ్ళీ సమూలంగా సంస్కరించాల్సిన సమయం వచ్చింది.


నిరర్థక ఆస్తుల మేట

ర్థిక సరళీకరణ తరవాత ఎస్‌బీఐతోపాటు అన్ని బ్యాంకులూ గ్రామీణ, పాక్షిక పట్టణ ప్రాంతాల్లో లాభసాటిగా లేని శాఖలను మూసివేశాయి. ఎస్‌బీఐ ఒక్కటే 5,000 శాఖలను మూసివేసింది. ఫలితంగా బ్యాంకింగ్‌ సౌకర్యం లేని గ్రామీణ పేదలకు ఆ సదుపాయాన్ని అందించాలన్న లక్ష్యం దెబ్బతిన్నది. నరసింహం కమిటీ సిఫార్సులకు అనుగుణంగా 39 బ్యాంకు విలీనాలు, స్వాధీనాలు జరిగాయి. 2008, 2015లో ఎస్‌బీఐ ఏడు అసోసియేట్‌ బ్యాంకులను విలీనం చేసుకుంది. బ్యాంకింగ్‌ రంగ సమస్యలకు బ్యాంకుల విలీనమొక్కటే పరిష్కారం కాదని వై.వి.రెడ్డి, దువ్వూరి సుబ్బారావు, రఘురాం రాజన్‌లు పదేపదే సూచించినా ప్రయోజనం లేకపోయింది. బ్యాంకుల్లో నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు) విపరీతంగా పేరుకుపోయాయి.


డిపాజిట్లపై అనాసక్తి

ప్రస్తుతం మనం బ్యాంకులో డబ్బు జమ చేయవచ్చు. దాన్ని మన ఇష్టం వచ్చినప్పుడు తీసుకునే సౌలభ్యం లేదు. ఏటీఎంల నుంచి డబ్బు తీసుకోవడంపై పరిమితులు ఉన్నాయి. వాటిని మీరితే రుసుము చెల్లించుకోవాలి. బ్యాంకు నుంచి ఎటువంటి సేవలు పొందాలన్నా చేతి చమురు వదిలించుకోవలసిందే. ప్రస్తుతం రూపాయికి విలువ లేదు. అది క్యాష్‌ కౌంటర్‌లో దొరకడమూ లేదు. కారణమేమిటి? మనం పూర్తిగా నగదు రహిత డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థకు మారిపోయామా, డిపాజిట్‌దారుల ప్రయోజనాలను రిజర్వు బ్యాంకు పట్టించుకోవడం మానేసిందా... నెట్‌ బ్యాంకింగ్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌, నెఫ్ట్‌, ఐఎంపీఎస్‌లు వచ్చాక ఖాతాదారు అసలు బ్యాంకుకు వెళ్ళవలసిన అవసరమేమిటని సర్కారు భావిస్తోంది. నిజానికి నేడు బ్యాంకులు నగదు డిపాజిట్లు తీసుకోవడానికి ఆసక్తి చూపడంలేదంటే అతిశయోక్తి కాదు! వాటిపై వడ్డీరేట్లు తగ్గిపోయాయి కాబట్టి, తమ బ్యాంకుకు చెందిన మ్యూచువల్‌ ఫండ్‌లోనో, బీమా పాలసీలోనో పెట్టుబడి పెడితే ఎక్కువ ప్రతిఫలం ఉంటుందని మేనేజర్లు సలహా ఇస్తున్నారు.


జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

+

© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.abc_digital_logo