అనకొండలను వదిలేసి...

సంపాదకీయం

అనకొండలను వదిలేసి...

దిమంది కోసం నిలబడ్డ నీకు ఫలితం ఏమిటి?

బాపు, రమణల వెండితెర దృశ్యకావ్యం ‘సాక్షి’ చిత్రంలో కథానాయకుడికి ఎదురయ్యే సూటిప్రశ్న ఇది! గీత రచయిత ఆరుద్ర దీనికి ఇచ్చిన జవాబు- యమపాశం! ఇప్పుడు అదే ప్రశ్నను కొన్ని లక్షల మంది అభిమానులు సోనూసూద్‌ను అడుగుతున్నారు. ఆ ఫలితం ‘పన్నుపాశమా?’ అంటూ ఆగ్రహోదగ్ధులవుతున్నారు. దేశంపై మహమ్మారి మహోద్ధృతంగా విరుచుకుపడుతున్న రోజుల్లో చేతికి ఎముకే లేదన్నట్టుగా సోనూసూద్‌ చేపట్టిన దాతృత్వ కార్యక్రమాలు ఆసేతుహిమాచలం ఎందరెందరినో కదిలించాయి. సామాన్యుల నుంచి అసామాన్యుల వరకు ఆ చల్లని మనసుకు జేజేలు పలుకుతూనే, నిండు గుండెలతో ఆశీస్సుల వర్షాన్నీ కురిపించారు. ‘సూద్‌ ఛారిటీ ఫౌండేషన్‌’ తరఫున అవిశ్రాంతంగా శ్రమిస్తున్న సోనూపై ఇటీవల ఎందుకో ఆదాయ పన్ను శాఖ కన్నుపడింది. తలచిందే తడవుగా ఆయన నివాసం, కార్యాలయాలపై దాడులకూ తరలివెళ్ళింది. కొన్ని రోజుల పాటు పత్రాలతో కుస్తీపట్టి చివరికి కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి(సీబీడీటీ) ఏమి ఆరోపించిందయ్యా అంటే- సోనూసూద్‌, ఆయన భాగస్వాములు కలిసి ఇరవై కోట్ల రూపాయల మేరకు పన్నుల ఎగవేతకు పాల్పడ్డారట! అందుకు తమకు ఆధారాలు లభ్యమయ్యాయని అధికారులు సెలవిస్తున్నారు. అవి ఏమిటో ఎవరికీ తెలియదు! ‘మంచి పనులు చేయాలనుకొనేవారు ఇక్కట్ల పాలవుతారని చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నా. కానీ, నేనే ప్రత్యక్షంగా అనుభవించాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు’ అంటున్న సోనూకు విశేష మద్దతు తెలుపుతున్న అశేష జనావళి- ప్రభుత్వ యంత్రాంగం విశ్వసనీయతనే నిగ్గదీస్తోంది.

మూటాముల్లే నెత్తిన పెట్టుకొని ఆకలి డొక్కలతో, ఉగ్గబట్టిన పిల్లలతో, పగిలి నెత్తురు చిమ్ముతున్న పాదాలతో నిరుడు వేల కిలోమీటర్లు నడిచి స్వస్థలాలకు చేరుకొన్న వలస కార్మికుల కష్టం- స్వతంత్ర భారత చరిత్రలో విషాదకర అధ్యాయం. ఉరుము లేని పిడుగులా ఊడిపడిన దేశవ్యాప్త లాక్‌డౌన్‌ నిర్ణయంతో ఎక్కడికక్కడ ఉపాధులు కోసుకుపోయాయి. సొంతూళ్లో కలోగంజో తాగి బతుకుదామంటే- జనజీవనాన్ని దిగ్బంధించిన ఆ కరకు ఆంక్షల కాలంలో రవాణా సదుపాయాలే లేవు. అయినా కన్నీళ్లను దిగమింగుకొంటూ కోటి మందికి పైగా కార్మికులు నగరాల నుంచి పల్లెలకు మరలిపోయినట్లు ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. ఆ అభాగ్యుల వెతలకు యంత్రాంగం పాషాణ హృదయం కరగలేదు కానీ, నేనున్నానంటూ సోనూసూద్‌ ముందుకొచ్చారు. బస్సులు, రైళ్లు, విమానాలతో సహా అందుబాటులో ఉన్న అన్ని మార్గాల్లో ప్రయాణ ఏర్పాట్లు చేసి 30వేల మందికి పైగా కార్మికులను గమ్యస్థానాలకు చేర్చారు. సిద్దిపేట జిల్లాలోని చెలిమె తండావాసులు స్వచ్ఛందంగా సోనూసూద్‌ విగ్రహాన్ని నెలకొల్పుకొన్నారంటే కారణం, ప్రేరణ- ఎల్లలెరుగని ఆయన మంచితనమే!

భారత రత్నగర్భలో తినడానికి సరైన తిండి లేక దాదాపు 19 కోట్ల మంది ప్రజలు నిత్యం అలమటించిపోతున్నారు. మహమ్మారి రగిలించిన మహోత్పాతంలో కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు ఈ ఆకలి బాధలు ఇంకా పెచ్చరిల్లాయి. కొవిడ్‌ రెండో ఉద్ధృతి ధాటికి దాదాపు కోటిన్నర మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోతే- 23 కోట్ల మంది దారిద్య్రరేఖ దిగువకు జారిపోయారు. ఆ కల్లోల సమయంలో ఉదారంగా ముందుకొచ్చిన స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తుల బృందాలు తమకు కలిగినంతలో పేదల కడుపులు నింపాయి. మిత్రులతో కలిసి రోజుకు అయిదు వందల భోజనాల వితరణతో సోనూసూద్‌ సైతం ఆ క్రతువులో భాగస్వాములయ్యారు. దివంగతులైన తన తండ్రి పేరిట ‘శక్తి అన్నదానం’ ప్రారంభించి రోజుకు 45 వేల మంది చొప్పున కొన్నాళ్ల పాటు బాధాసర్పదష్టుల ఆకలి మంటలు చల్లార్చారు. తన మాతృమూర్తి పేరుతో విద్యార్థులకు ఉపకార వేతనాల నుంచి యువతకు ఉద్యోగాలు, కార్మికులకు తగిన ఉపాధి అవకాశాల కల్పన, ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ ప్లాంట్ల నిర్మాణం వరకు ఆయన తలపెట్టిన ప్రతి కార్యక్రమమూ సంచలనమే! ఉత్తర్‌ప్రదేశ్‌లోని బస్తీ గొంతు తడపడం మొదలు ఏపీలోని గుండెజబ్బు చిన్నారికి శస్త్రచికిత్స చేయించడం వరకు లెక్కకుమిక్కిలి విశేషకృత్యాలతో సోనూసూద్‌ చేపట్టింది అక్షరాలా మహోన్నత మానవతా యజ్ఞం! ‘ప్రజాప్రతినిధిగా నా బాధ్యత మేరకు జనసామాన్యానికి చేతనైనంత సాయం చేస్తున్నా. సోనూసూద్‌ మాత్రం నిజమైన సూపర్‌ హీరో’ అని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అందుకే ప్రశంసించారు. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి సంస్థ సైతం ప్రతిష్ఠాత్మక పురస్కారంతో సోనూను సత్కరించింది. దిల్లీ ప్రభుత్వమూ తమ విద్యార్థులకు మార్గదర్శకుడిగా ఆయననే కోరి నియమించింది. ఆ సందర్భంగా అరవింద్‌ కేజ్రీవాల్‌తో వేదిక పంచుకోవడం, సాగు చట్టాల రద్దు కోసం ఉద్యమిస్తున్న రైతుల తరఫున గళమెత్తడమే- సోనూపై సర్కారీ యంత్రాంగం కత్తి కట్టడానికి కారణమైందన్న విమర్శలు ముమ్మరిస్తున్నాయి!

మానవతా కార్యక్రమాల కోసం సోనూసూద్‌ సేకరించిన రూ.18 కోట్లకు పైబడిన మొత్తంలో 17 కోట్ల రూపాయలు ఇంకా నిరుపయోగంగా ఉన్నాయన్నది సీబీడీటీ పరిశోధన సారాంశం! తమకు అందిన ప్రతి రూపాయినీ సద్వినియోగం చేసి తీరతామన్నది సోనూ సమాధానం. మరోవైపు, బడా బహుళ జాతి సంస్థలు, వ్యక్తుల వల్ల ఏడాదికి సుమారు 75 వేల కోట్ల రూపాయలకు పైగా పన్నుల రాబడిని ఇండియా నష్టపోతోందని ఇటీవలే వెలుగుచూసింది. ఆ అక్రమాల అనకొండలను పట్టిబంధిస్తే ఖజానాకెంతో లాభం! అటువంటి తిమింగిలాలపై చర్యలు తీసుకోవడంలో ఆదాయ పన్ను శాఖ అలసత్వాన్ని ఏడేళ్ల క్రితమే కాగ్‌ కడిగిపారేసింది. ఎగవేతదారులపై విచారణా ప్రక్రియను ఆరంభించడంలోనే అయిదు నుంచి 48 ఏళ్ల వరకు జాప్యం చేయడం ఒకవంతు అయితే- ఆదాయ పన్ను చట్టంలోని రద్దయిన నిబంధనల కింద విచారణలు జరపడం ఆ శాఖ కీర్తికిరీటంలో మరో కలికితురాయి అని కాగ్‌ ఆనాడే కుండ బద్దలుకొట్టింది. అటువంటి విభాగం ఇప్పుడు అత్యవసరంగా రంగంలోకి దిగి సోనూసూద్‌ తప్పుచేసినట్లు నిర్ధారించేస్తోంది! ఏటా వేల కోట్ల రూపాయల నల్లధనాన్ని యమదర్జాగా విదేశాలకు తరలిస్తున్న పెద్దమనుషుల బాగోతాలను వెలికితీయడంలోనూ అధికారులు అదే కర్తవ్యదీక్షా పరాయణత్వాన్ని ప్రదర్శిస్తే- దేశానికి ఎంత మేలు జరుగుతుంది! అబ్బే... ఎంపిక చేసుకొన్న ‘లక్ష్యాల’ మీదే తప్ప అక్రమార్క విక్రమార్కులపై యంత్రాంగం ప్రతాపం పూజ్యమంటారా? అదీ నిజమే!

- శైలేష్‌ నిమ్మగడ్డ


జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

+

© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.abc_digital_logo